అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: కేటాయింపుల మేరకు నీటి విడుదలలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటం జలయుద్ధాలకు దారితీస్తోందని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు అనంతపురంలోని రెవెన్యూ భవన్‌లో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన హెచ్చెల్సీ ఐఏబీ(నీటి పారుదల సలహా మండలి) సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆయకట్టులో ఘర్షణలను నివారించేందుకు వైఎస్ విజయమ్మ నిర్మాణాత్మక సూచనలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారు.
ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, హెచ్చెల్సీ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై రఘువీరారెడ్డి స్పందిస్తూ తాగునీటి కోసం నీటిని నిల్వ చేసిన తర్వాతే ఆయకట్టుకు నీళ్లందిస్తామని స్పష్టీకరించారు. ఇదే సమయంలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే. పులివెందులలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తక్షణమే సీబీఆర్‌కు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. విజయమ్మ డిమాండ్‌కు ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు పలికారు.
ఈ సందర్భంలో ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ నీటి కేటాయింపులు, విడుదలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ హెచ్చెల్సీ ఎస్‌ఈ వాణీప్రసాదరావుపై విరుచుకు పడుతూ వాటర్ బాటిల్ విసిరారు. ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తీరుకు నిరసనగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. కలెక్టర్ వి.దుర్గాదాస్, ఎమ్మెల్సీ గేయానంద్‌లు అధికారులను సముదాయించటంతో రాత్రి 7.28 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైంది. వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘టీబీ డ్యాంలో పూడికతీతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదని కర్ణాటక సీఎం అన్నట్టు ఈ మధ్య పేపర్‌లో చదివా. హెచ్చెల్సీకి సమాంతరంగా కాలువ తవ్వితే వరద నీళ్లను వినియోగించుకోవచ్చు.
హెచ్చెల్సీని ఆధునికీకరించడానికి రూ.458 కోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి పనులను ప్రారంభించారు. రూ.98 కోట్ల విలువైన పనులను తన హయాంలోనే పూర్తిచేశారు. ఆయన మరణం తర్వాత ఈ ప్రభుత్వం కేవలం రూ.32 కోట్లే ఆ పనులపై ఖర్చుపెట్టింది. తక్షణమే హెచ్చెల్సీ ఆధునికీకరణను పూర్తిచేయాలి. కర్ణాటక పరిధిలో కూడా హెచ్చెల్సీని ఆధునికీకరించాలి. పీఏబీఆర్‌కు దివంగత వైఎస్ కేటాయించిన పది టీఎంసీల జీవోను తక్షణమే అమలుచేయాలి. కర్నూలు రైతులకు కృష్ణా జలాలను అందించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయ/్ఞం పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది’ అని వివరించారు. ఆ తర్వాత ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ‘హెచ్చెల్సీ కాలువపై గస్తీ లేకపోతే కర్ణాటక జలచౌర్యం ఎక్కువవుతుంది. 19 టీఎంసీలు కూడా జిల్లాకు దక్కవు. దామాషా పద్ధతిలో కేటాయించిన మేరకు ఆయకట్టుకు నీళ్లందించాలి’ అని కోరారు.
ఆగస్టు 31 నుంచి హెచ్చెల్సీ, జీబీసీకి సాగునీరు
ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంత్రి రఘువీరా మాట్లాడుతూ హెచ్చెల్సీ ప్రధాన కాలువ, జీబీసీ ఆయకట్టుకు ఆగస్టు 31 నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. పీబీజీ ద్వారా సీబీఆర్‌కు సెప్టెంబరు 1 నుంచి తాగునీటిని విడుదల చేస్తామని, మధ్యపెన్నార్ జలాశయం, పీబీసీ, ఎంబీసీల ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేస్తామన్నారు. వారం రోజుల్లోగా హెచ్చెల్సీ ప్రధాన కాలువ, జీబీసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్లను మంత్రి రఘువీరా పట్టించుకోలేదు. మంత్రి ఒంటెద్దు పోకడపై ఎమ్మెల్యే విజయమ్మ విరుచుకుపడ్డారు. అన్నింటికీ సానుకూలంగా స్పందించిన మంత్రి.. నిర్ణయాన్ని ప్రకటించడంలో మాత్రం నియంతలా వ్యవహరించారని విమర్శించారు.
No comments:
Post a Comment