YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 13 August 2012

ఫీజు పోరులో విజయమ్మకు బ్రహ్మరథం

* ఫీజు పోరులో విజయమ్మకు బ్రహ్మరథం 
* పోటెత్తిన యువత, మహిళా లోకం

ఏలూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ‘ఫీజు దీక్ష’కు విద్యార్థి, యువజన, కర్షక, కార్మిక వర్గాలు అధిక సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టాయి. దీంతో సోమవారం హేలాపురి నగరం(ఏలూరు)లో కోలాహలం నెలకొంది. కోస్తా జిల్లాల నుంచి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి దారులన్నీ ఏలూరువైపే పరుగులు తీశాయి. ఏబీవీపీ తొలుత బంద్ ప్రకటించి తర్వాత ఉపసంహరించుకున్నా.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కళాశాలలు తరగతులు నిర్వహించి విద్యార్థులను గదులకే పరిమితం చేసే ప్రయత్నం జరిగినా యువతరం మాత్రం ఉప్పొంగే ఉత్సాహంతో దీక్షా ప్రాంగణానికి తరలివచ్చారు. తమ బిడ్డల కోసం జరుగుతున్న ఈ దీక్షకు విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ప్రత్యేకంగా మహిళలు పెద్ద సంఖ్యలో రావడం విశేషం. వేల సంఖ్యలో తరలివచ్చిన జన సమూహంతో ఏలూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌తో పాటు నగర వీధులన్నీ జనప్రవాహంతో నిండిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలపై తరలివచ్చిన జనం ముందుభాగాన విచిత్ర వేషధారణలు, డప్పుల దరువుతో ప్రదర్శనలుగా దీక్షా ప్రాంగణానికి చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

దేవుని ఆశీస్సులు తీసుకుని..
విజయమ్మ సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆమెకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె రోడ్డు మార్గంలో ఏలూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో పెద అవుటపల్లిలో జోసఫ్ తంబి ఆలయంలో ప్రార్థనలు చేశారు. హనుమాన్ జంక్షన్‌లో ఆమె అభయాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మధ్యలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఉప్పులేటి కల్పన కలిసి విజయమ్మ వెంట ఏలూరు వెళ్లారు. మార్గమధ్యంలో అడుగడుగునా ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధ్నాహ్నం 12 గంటలకు విజయమ్మ దీక్షా వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రసంగాలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల కుట్రలపై పలువురు నేతలు చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు..
సభా కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయకుల ప్రసంగాలతో కాకుండా విభిన్నంగా జరిగింది. ఇద్దరు నాయకులు ప్రసంగించిన తరువాత కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రసంగించడానికి నాయకులు అవకాశం ఇవ్వడంతో.. వారు తమ బాధలు వివరించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఏ విధంగా లబ్ధిపొందిందీ కొందరు విద్యార్థులు వివరించారు. మా భవిష్యత్ కోసం విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా నిలుస్తామని, యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు వెన్నంటి ఉంటామని విద్యార్థులు ప్రతినబూనారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు విజయమ్మను అభినందించేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. 

నిర్వాహకులు వీరి ఆసక్తికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో బ్యాచ్‌లు, బ్యాచ్‌లుగా విద్యార్థులు వేదికపై ఉన్న విజయమ్మను కలుసుకుని అభినందనలు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి తమ బతుకుల్ని బాగుచేసిన దివంగత వైఎస్‌ను విద్యార్థులు పదే పదే స్మరించుకున్నారు. వేదికకు ఒక పక్కన ఏర్పాటు చేసిన సాంస్కృతిక విభాగానికి చెందిన కళాకారులు పెద్దాయనని పదే పదే స్మరించడంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. నాయకుల ప్రసంగాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన సమయాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ప్రసంగాల్లో వైఎస్‌ఆర్, జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు ప్రస్తావించిన ప్రతిసారీ యువత కేరింతలు కొడుతూ జగన్నినాదం చేశారు.

హాజరైన నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి, ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం, పశ్చిమగోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల కన్వీనర్లు తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, పి.శ్రీనివాసులు, అమర్‌నాథరెడ్డి, గుర్నాథరెడ్డి, మేకతోటి సుచరిత, కొడాలి నాని, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, నారాయణరెడ్డి, కేంద్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, మహిళా, యూత్, ఎస్సీ, రైతు, ప్రచార విభాగాల రాష్ర్ట అధ్యక్షులు కొల్లి నిర్మలాకుమారి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, నల్లా సూర్య ప్రకాశరావు, వై.వి.నాగిరెడ్డి, విజయచందర్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, నెలవెల సుబ్రహ్మణ్యం, ఆర్‌కే రోజా, సీఈసీ సభ్యులు మోషేన్‌రాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎంపీ హరిరామయ్యజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, వంగవీటి రాధాకృష్ణ, జంగాకృష్ణమూర్తి, అల్లు వెంకట సత్యనారాయణ, సింగన్నదొర, మేకా ప్రతాప్‌అప్పారావు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!