హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ‘వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్’ను ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డిలతో పాటు అన్ని జిల్లాల విద్యుత్ ఉద్యోగులు హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు అంశాలపై ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించారు.
అలాగే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే మహానేత వైఎస్ పాలనా పగ్గాలు చేపట్టాక అలాంటి ఆలోచనలు చేయకుండా దాదాపు పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మనెంట్ చేశారన్నారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను జనక్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్‌పై ఉన్న అభిమానంతో పలువురు నేతలు ఏర్పాటు చేసుకున్న అనుంబంధ సంఘాలన్నింటినీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ గొడుగు కిందకు తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఉద్యోగుల సంరక్షణ కోసం తీసుకున్న పలు తీర్మానాలను ఆయన వివరించారు.
‘‘పరీక్షలు నిర్వహించడం, సర్వీసు మార్కులు కలపడం కాకుండా కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను చెల్లించడంతో పాటు, ప్రమాదాలు జరిగితే రెగ్యులర్ కార్మికులతో సమానంగా చికిత్స అందించాలి. కాంట్రాక్టు కార్మికులు మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరిని రెగ్యులర్ పోస్టులో నియమించాలి. రెగ్యులర్ కార్మికులకు నిర్దిష్ట కాలపరిమితిలో ప్రమోషన్లు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ రద్దు చేసి పనులన్నీ విద్యుత్ ఉద్యోగులతో చేయించాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 60వేల పోస్టులను భర్తీ చేయాలి. ఐటీఐ అర్హతతో సంబంధం లేకుండా కాంట్రాక్టు కార్మికులందరినీ జె.ఎల్.ఎంలుగా నియమించాలి. కార్మికులందరికీ గృహవసతి కల్పించాలి’’ అని తదితర డిమాండ్లను ఆమోదించినట్లు జనక్‌ప్రసాద్ వెల్లడించారు. సమావేశానంతరం పలువురు విద్యుత్ ఉద్యోగులు పార్టీలో చేరారు. వారిలో నేతలు ఎస్.పాండురంగారెడ్డి, కె.సత్యనారాయణరావు, బి.ప్రేమ్‌కుమార్, పి.మధులతో పాటు పలువురు నేతలున్నారు.
No comments:
Post a Comment