రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో కోఠిలోని ఈఎన్‌టీ స్థలం కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర అధికారులు తమ నిజాయతీ ఏమిటో నిరూపించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆ స్థలాన్ని కాపాడాలని ఆందోళన చేసినందుకు కబ్జాకోరులు తమపై నిందలు వేశారని, ఆ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పార్టీ నాయకుడు ఎం.శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈఎన్‌టీ స్థలం వ్యవహారంలో డాక్టర్లు, సిబ్బంది, వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆందోళన చేశాయి.
మేం ఇంకా ఆందోళన కొనసాగిస్తుండటంతో కబ్జాదారులైన ఎ.రమేష్, టీకే శ్రీనివాసులు మాపై నింద మోపారు. ఈ మేరకు గత నెల 2న వైద్య శాఖ మంత్రికి రహస్యంగా లేఖ కూడా పంపారు. ప్రభుత్వానికి ధైర్యం లేకపోవడంతో ఆ లేఖను బయటపెట్టలేకపోయింది. అందువల్లే ఆ లేఖ ప్రతిని మేం విడుదల చేస్తున్నాం. ఇందులో నాతో పాటు మాజీ ఎంపీ పి.మధు, మరో రెండు పత్రికల అధిపతుల పేర్లను ఉదహరించారు. డబ్బులు ఇవ్వకపోతే కబ్జాకోరులను చంపుతామని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారు’’ అని వివరించారు.
No comments:
Post a Comment