YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 15 August 2012

మృత్యుఘోష

* వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ చిన్నారుల మృతదేహాలతో బాధిత కుటుంబాల ఆందోళన
* బాధితులకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బాసట.. వారితో కలిసి ఆస్పత్రి వద్ద బైఠాయింపు
* మరణాలపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
* విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశం

తిరుపతి(అర్బన్), న్యూస్‌లైన్: స్వాతంత్య్ర సంబరాల వేళ.. తిరుపతిలోని రుయా(ఎస్వీఆర్) ఆస్పత్రి చిన్నారుల మృత్యుఘోషతో మార్మోగింది. వారం రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో ఒకే రోజున 11 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన ఇంకా మరువకముందే మరో విషాదం సంభవించింది. బుధవారం ఒకే రోజున ఆరుగురు చిన్నారులు కన్నుమూశారు. అత్యవసర సేవలు అందించడంలో వైద్యులు చూపిన నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డలు చనిపోయారని ఆరోపిస్తూ.. బాధితులు చిన్నారుల మృతదేహాలతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆందోళనలో కూర్చున్నారు. ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. విచారణ జరిపి, తక్షణమే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

వారం రోజుల కిందట రుయా ఆస్పత్రిలోనే ఆక్సిజన్ కొరత వల్ల 11 మంది చిన్నారులు చనిపోయారు. బుధవారం(మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ) మరో ఆరుగురు చిన్నారులు మరణించారు. వీరిలో వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఆరు నెలల బాబు, చిత్తూరు జిల్లా తొట్టంబేడుకు చెందిన వెంకటయ్య బిడ్డ(4 రోజులు), నాయుడు పేటకు చెందిన చిన్నారి, తిరుపతి చెన్నారెడ్డి కాలనీకి చెందిన మమత, శోభన్‌ల కుమారుడు గిరీష్(8), తిరుపతికే చెందిన మరో ఇద్దరు చిన్నారులు కన్ను మూశారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారు సకాలంలో తగిన మందులివ్వలేదంటూ చిన్నారుల బంధువులు ఆందోళనకు దిగారు. అటు ఆస్పత్రి ఉన్నతాధికారులూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. 

విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు కరుణాకరరెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. చిన్నారుల మృతికి దారి తీసిన కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సరిగా బదులివ్వకపోవడంతో వైద్యులపై మండిపడ్డారు. బాధితులకు మద్దతుగా ఆందోళనలో కూర్చున్నారు. చిన్నారుల మరణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. రుయా ఆస్పత్రి కోసం రూ.100 కోట్లు నిధులు విడుదల చేయాలని తాను కోరినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న చిన్నారుల మరణాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణలోనే తిష్ట వేసిన ఎంపీ చింతామోహన్ ఈ సమస్య గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

కాగా, చిన్నారులను చివరి నిమిషంలో చికిత్సకు తీసుకురావడం వల్లే వారు మరణించారని.. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరాస్వామి వివరణ ఇచ్చారు. ఆస్పత్రికి నిధుల కొరత ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు ఆస్పత్రిని సందర్శించారు. చిన్నారుల మరణాలపై వెంటనే నివేదిక సమర్పించాలని రుయా సూపరింటెండెంట్ వీరాస్వామిని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. గురువారం నివేదికను పై అధికారులకు పంపిస్తామని చెప్పారు. 

మందులు లేకనే చనిపోయారు..
మా తమ్ముడికి కవల పిల్లలు పుట్టారు. జ్వరంగా ఉండటంతో ఇక్కడకు తీసుకొచ్చాం. ఇక్కడకు వచ్చాక పిల్లల వైద్యానికి సంబంధించి మందులు లేవని డాక్టర్లు చెప్పారు. సమయానికి తగిన మందులు ఇవ్వకపోవడం వల్లే మా తమ్ముడి కుమార్తెలలో ఒక చిన్నారి చనిపోయింది.
-సంపూర్ణ, డీఎంపురం, కార్వేటినగరం, చిత్తూరు జిల్లా

మీ బిడ్డలైతే ఇలాగే చేస్తారా?
మా అబ్బాయి గిరీష్‌బాబు ఏదో వస్తువు మింగేయడంతో ఇక్కడకు తీసుకువచ్చాం. తీరా ఎక్స్‌రే లు, స్కానింగ్‌లు అంటూ బయటప్రాంతాలకు పంపి వేలాది రూపాయలు ఖర్చు చేయించారు. పిల్లాడి వ్యాధికి తగిన మందులు ఇవ్వకపోవడంతో ఎనిమిదేళ్ల కొడుకును కంటిముందే పోగొట్టుకున్నాం. అదే డాక్టర్ల బిడ్డలకైతే ఇలానే నిర్లక్ష్యం చేస్తారా? మా ఉసురు తగలకపోదు.
-శోభన్‌బాబు, చెన్నారెడ్డికాలనీ, తిరుపతి

రూ.3 లక్షల పరిహారమివ్వాలి: బాలల హక్కుల సంఘం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 3 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!