YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 15 August 2012

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆత్మహత్యాసదృశం

ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఆత్మహత్యాసదృశంగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల హృదయాల్లో ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్ట దెబ్బ తీయాలని, జగన్‌మోహన్‌రెడ్డిని అణచి వేయాలనే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం తానే కూలిపోయే పరిస్థితులు తెచ్చుకుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జైల్లో ఉండటం, మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ చార్జిషీటులో నిందితుడుగా పేర్కొనడం వంటి పరిణామాలపై మేకపాటి బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనతో వైఎస్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే.. దానిని తుడిచివేసేందుకు ఆయన హయాంలో చేసిన పనులన్నీ తప్పే అని నిరూపించే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం తానే ఇరుక్కుపోయేలా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఎస్ హయాంలో జారీ అయిన 26 జీవోలు సక్రమమో అక్రమమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

జగన్‌పై కక్షతో జీవోలపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఆనాడు ప్రభుత్వం వ్యవహరించడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందని చెప్పారు. వైఎస్ మరణించిన తరువాత ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 200 శాసనసభ, 40 వరకూ లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో జగన్ కీలక పాత్రను పోషిస్తారని చెప్పారు. మూడో ఫ్రంటుతో జతకట్టే విషయంలో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. లౌకిక శక్తులతో కలుస్తామని జగన్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు.


తాను ఉప ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన తరువాత అన్ని పార్టీల వారూ తమకు స్నేహహస్తం అందించడం భవిష్యత్ పరిణామాలకు సూచికలని చెప్పారు. జగన్‌ను జైల్లో పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బందులు పెట్టాలని చేసిన యత్నాలు ఫలించలేదనీ... విజయమ్మ తమ నాయకురాలిగా ఎదిగారని తెలిపారు. తెలంగాణలో వైఎస్‌ను అభిమానించే వారు, జగన్‌ను ఆదరించే ప్రజలు భారీగా ఉన్నారని పరకాల ఉప ఎన్నికల్లో స్పష్టమైందని చెప్పారు. సిరిసిల్లలో విజయమ్మ చేనేత ధర్నా విజయవంతం కావడంతో కూడా ఇది వెల్లడైందని తెలిపారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!