YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 28 October 2012


అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని బాబుకు భయం
ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని దించేయడం లేదు
బాబు తన హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అడిగితే ఎగతాళి చేశారు
అప్పుడు గ్రామాలను శ్మశానాలుగా మార్చి.. ఇప్పుడు వాటి గుండా పాదయాత్ర చేస్తున్నారు
బాబు అనుకున్నంత అమాయకులు కాదు ప్రజలు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 11, కిలోమీటర్లు: 151.4

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అటు కరెంటు చార్జీల మోత.. ఇటు ఆర్టీసీ చార్జీల వాత.. ఇవి చాలవన్నట్టు 4 శాతం పెరిగిన అమ్మకపు పన్ను.. పేదవాడు కడుపు నిండా ఒక్క పూట భోజనం చేయలేని పరిస్థితి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి అన్నింటా ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలదీయాల్సింది పోయి.. దానితోనే కుమ్మక్కయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయకుండా డ్రామాలాడుతున్నారు. అవిశ్వాసం కాదు.. అవసరమైతే విశ్వాస తీర్మానం పెట్టేలా ఉన్నారు..!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

‘‘మీకు ఎమ్మెల్యేలు ఉన్నారుగా.. ప్రభుత్వాన్ని ఎందుకు దించేయరు?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆదివారం 11వ రోజు పాదయాత్రలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) ప్రాంగణంలో అమె జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పాదయాత్ర ఆసాంతం జన సైన్యం ఉప్పొంగింది. యువకులు, మహిళలు భారీ సంఖ్యలో షర్మిలతో పదం కలిపారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కందుకూరు కిక్కిరిసిపోయింది. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఆవరణలో జరిగిన భారీ బహిరంగ సభకు యువకులు పోటెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తున్న చంద్రబాబు వైఖరిని, కుమ్మక్కు రాజకీయాలను షర్మిల కడిగిపారేశారు.

‘‘కరువొచ్చి రైతన్న దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంటే చంద్రబాబు హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రైతన్నలను వేధించారు. సామాను లాక్కున్నారు. కేసులు పెట్టారు. అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. బకాయిలు కట్టలేక, అవమాన భారం మోయలేక ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిహారమివ్వాలని అడిగితే ఎగతాళి చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం కొత్తగా పాదయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి.. ఇప్పుడు అవే గ్రామాల గుండా నడుస్తున్నారు. ప్రజల కాళ్లూ చేతులూ పట్టుకుని క్షమాపణ అడిగినా ఆయన చేసిన పాపం పోదు’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు గారూ.. ఏ ముఖం పెట్టుకుని ఆ గ్రామాలకు వెళుతున్నారు. మాబోటి వారు పాదయాత్ర చేసినా అర్థం ఉంది. మీకు ఎమ్మెల్యేలు ఉన్నారుగా. ఎందుకు దించేయరు? దించేయకుండా.. నాకు మళ్లీ అవకాశం ఇవ్వండి .. కుర్చీ ఇవ్వండి అని ప్రజలను బతిమాలుకుంటున్నారు. చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఆయన మాట మీద నిలబడడు. ప్రజలు అమాయకులు కాదు. బాబు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చోళ్లు కాదు.. రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్టీఆర్ అధికారంలోకి వస్తే.. 9 నెలల్లోనే మామకు వెన్నుపోటు పొడిచి సీటు లాగేసుకుని, ఆ రెండు హామీలను తుంగలో తొక్కారు..’’ అని విమర్శించారు.

జగనన్న అన్ని సీట్లూ గెల్చుకుంటాడనే..: కాంగ్రెస్, చంద్రబాబులు నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు దిగి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేశారని షర్మిల మండిపడ్డారు. ‘‘వీరిద్దరూ కలిసి అబద్ధపు కేసులు పెట్టారు. సీబీఐని వాడుకుని జగనన్నను జైల్లో పెట్టారు. వారి లక్ష్యం ఒక్కటే.. జగన్! జగన్ మీ మధ్య ఉంటున్నాడని, మీ మనిషిగా ఉన్నాడని, మీ గుండెల్లో ఉన్నాడని వారికి అక్కసు. దీన్ని చూసి కాంగ్రెస్, టీడీపీలు తట్టుకోలేకపోయాయి. ఆ పార్టీలకు మనుగడ ఉండదని, 2014లో జగన్ అన్ని సీట్లూ గెలుచుకుంటాడని, ఇక వారి దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని వారి భయం.

అందుకే కుట్రలు పన్ని బెయిల్ రాకుండా పెద్దపెద్ద వాళ్లతో మాట్లాడి జనం మధ్య లేకుండా చేశారు. అన్యాయం ఎన్నో రోజులు నిలవదు. అధర్మానికి శక్తి లేదు. దేవుడున్నాడు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో.. మంచివాళ్ల పక్షాన నిలబడతాడన్నదీ అంతే నిజం. జగన్ వస్తాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు’’ అని అన్నారు. ‘‘కోటి ఎకరాలకు నీరివ్వాలన్నది రాజన్న స్వప్నం. రాష్ట్రంలో గుడిసె అన్నదే లేకుండా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నది రాజన్న కల. చదువుకు పేదరికం ఆటంకం కారాదని, కుటుంబంలో ఒక్కరన్నా డాక్టరో, ఇంజనీరో అయితే ఆ కుటుంబం బాగుపడుతుందన్నది రాజన్న ఆశయం. వీటన్నింటినీ జగనన్న నెరవేరుస్తాడు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ అయితే రూ.700, డిగ్రీ అయితే రూ.1,000 తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది..’’ అని పేర్కొన్నారు.

సాక్షులను కాదు.. మిమ్మల్ని ప్రభావితం చేస్తాడనే..: విజయమ్మ

ఎస్కేయూ ముందు జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘ప్రజల కష్టసుఖాలను 25 ఏళ్లపాటు పంచుకున్న వైఎస్ మరణానంతరం జగన్‌బాబు మీ మధ్య ఉంటూ విద్యార్థులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికుల కోసం పోరాటాలు చేస్తుంటే సీబీఐ, కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుమ్మక్కై కేసులు పెట్టాయి. అయినా వాటిని పట్టించుకోకుండా 10 నెలలు జగన్ మీమధ్యనే ఉన్నాడు. ఉప ఎన్నికలు రాగానే విచారణ పేరుతో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే జైలులో పెట్టారట. వారి భయం అది కాదు. మిమ్మల్ని (ప్రజలను) ప్రభావితం చేస్తాడనే వారి భయం. జగన్‌ను బందీ చేసి నిన్నటికి ఐదు నెలలైంది. జగన్ బయటకు వస్తాడనుకున్న ప్రతిసారి కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్ని బెయిల్ రాకుండా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మీకు ధైర్యం ఇవ్వాలని జగన్ షర్మిలను పంపాడు..’’ అని చెప్పారు. చంద్రబాబు ఈ ప్రభుత్వానికి సలహాదారుగా మారిపోయారని విమర్శించారు.


చికిత్సకు భరోసా

కందుకూరుకు చెందిన మంజునాథ్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థి బోన్‌మారో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ నిరుపేద కుటుంబం ఇప్పటికే వైద్యానికి రూ.2 లక్షలు వెచ్చించింది. వైద్యులు రూ.15 లక్షల ఖర్చవుతుందని, వేలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. పాదయాత్రలో మంజునాథ్‌రెడ్డి పరిస్థితిని తెలుసుకున్న షర్మిల... అతడిని పరామర్శించి చికిత్సకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. సోమవారం ఉదయాన్నే వచ్చి ఎమ్మెల్యే గురునాథరెడ్డిని కలవాలని షర్మిల సూచించినట్టు మంజునాథరెడ్డి తల్లి చెప్పారు.

మాకు దిక్కెవరు?
షర్మిల ముందు గోడు వెళ్లబోసుకున్న రైతు కూలీలు


‘‘తాగునీళ్లు లేవు. సాగునీళ్లు లేవు. పంటలు లేవు. కరెంటు అసలే ఉండడం లేదు. కరువు పనులు కూడా దొరకడం లేదు. దొరికినా కూలి రూ.50 నుంచి రూ. 60లకు మించి పడడం లేదు. ఒక్కోసారి రూ. 30లే వస్తోంది. అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. మాకు దిక్కెవ్వరు. ఇక మీరే చూడాలి మమ్మల్ని.. ఇదివరకు వచ్చిన పెన్షన్‌ను కూడా ఇప్పుడు తీసేశారు..’’ అంటూ రైతు కూలీలు షర్మిల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శనివారం రాత్రి జ్వరం నుంచి కోలుకున్న షర్మిల ఆదివారం ఉదయం 10 గంటలకు చిగిచర్ల నుంచి పాదయాత్రకు బయల్దేరారు.

మార్గమధ్యలో వ్యవసాయ కార్మికులతో మాట్లాడారు. ఉప్పులేశునిపల్లి, పాల్వాయి తదితర గ్రామాలకు చెందిన రైతు కూలీలు షర్మిలతో తమ బాధలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారిలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆమె చలించిపోయారు. వారి చేతులు పట్టుకుని ‘‘ఇంత వయస్సులో కూడా మీరు కష్టపడాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. వణుకుతున్న చేతులతో మీరు పనికి వెళుతున్నారంటే బాధగా ఉంది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంపాపురం క్రాస్‌రోడ్డులో ఉన్న కెనాల్ వద్ద షర్మిల ఆగి... ఎండిపోయిన ఆ కెనాల్ పరిస్థితి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30కు అంపాపురం సమీపంలో భోజన విరామానికి ఆగారు. తిరిగి 3.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 4.30కు కందుకూరులో, సాయంత్రం 6.30కు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఆవరణలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ్నుంచి రాత్రి 7.35 గంటలకు సమీపంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. ఆదివారం పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!