YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 5 December 2012

ఎస్సీ, ఎస్టీల ఓట్ల కోసమే ‘గేమ్ ప్లాన్’

- ఎస్సీ, ఎస్టీల ఓట్ల కోసమే ‘గేమ్ ప్లాన్’ 
- వీరి కుట్రలను ప్రజల్లో ఎండగడతాం
- వైఎస్సార్ కాంగ్రెస్ దళిత నేతల ఆగ్రహం
- పదో తేదీన విస్తృత సమావేశం
- అంబేద్కర్ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు 

 ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం పట్ల కాంగ్రెస్, టీడీపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని సబ్‌ప్లాన్ చట్టబద్ధత ఆమోదం సందర్భంగా ఈ రెండు పార్టీలు ఆ వర్గాలను మోసం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన నేతలు ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత ఎమ్మెల్యేలు, గిరిజన నేతల సమావేశం జరిగింది. 

అనంతరం ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మేకతోటి సుచరిత, కొరుముట్ల శ్రీనివాసులు, ముఖ్య నేతలు మూలింటి మారెప్ప, చందా లింగయ్య దొర, నల్లా సూర్యప్రకాశరావు, మేరుగ నాగార్జున సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు తమకు దూరమైనట్లు కాంగ్రెస్, టీడీపీలు గ్రహించాయని, వారిని మభ్యపెట్టి దగ్గర చేసుకునేందుకు సబ్‌ప్లాన్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా ‘గేమ్ ప్లాన్’ ఆడారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం సుమారు 70 పథకాలు ప్రవేశ పెట్టారని, వాటి వల్ల దళిత, గిరిజనులకు భారీగా మేలు జరిగిందన్నారు. 

పభుత్వం ఆ పథకాలను గాలికొదిలేసి ఏడాదిలో ఎన్నికలొస్తున్న నేపథ్యంలో వారికి గాలం వేసే యత్నం చేసిందని విమర్శించారు. ‘ఎస్సీ, ఎస్టీ ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్‌తో ఉన్నారు. వైఎస్ చేసిన మేలును మర్చిపోకుండా ఆయనను తమ గుండెల్లో దాచుకున్నారు. ఈ పథకాల అమలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమని విశ్వసిస్తూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇది గ్రహించిన అధికార, ప్రతిపక్షాలు వారిని ఆయన నుంచి దూరం చేయడానికి అసెంబ్లీ సాక్షిగా కుమ్మక్కై కుట్ర పన్నారు’ అని వారు దుయ్యబట్టారు. వీరి మోసపూరిత వైఖరిని తాము ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని చెప్పారు. 

ఈ నెల 6న రాజ్యాంగ నిర్మాత అంబే ద్కర్ వర్ధంతి సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తమ పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించి దళిత, గిరిజనులకు కాంగ్రెస్, టీడీపీ చేసిన మోసాన్ని వివరిస్తామన్నారు. అలాగే దీనిపై ఈ నెల 10న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పార్లమెంటు స్థాయిలో జరగాల్సిన ఎస్సీ వర్గీకరణను టీడీపీ కావాలనే సవరణ రూపంలో అసెంబ్లీలో ప్రతిపాదించడం, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసిందనే సంగతి తెలిసి కూడా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తీరా ఓటింగ్ ముగిశాక ఈ విషయం గుర్తుకు వచ్చి అభ్యంతరం తెలపడం అంతా ఓ డ్రామా అని దుయ్యబట్టారు. ఇదంతా దళితులను వంచించడానికి చేసిన యత్నమేనని స్పష్టంచేశారు. టీడీపీ చేసిన సవరణకు అనుకూలంగా తమ ఎమ్మెల్యేలు ఓటేసింది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనని, ఎస్సీల వర్గీకరణ విషయంలో తమ వైఖరి సుస్పష్టమని బాబూరావు చెప్పారు. వర్గీకరణకు అనుకూలంగా వైఎస్ గతంలో రెండు సార్లు తీర్మానం చేసి పంపారని, తమ పార్టీ కూడా ఆయన విధానానికే కట్టుబడి ఉంటుందన్నారు. 

ల క్ష్మీపురంలో ఐదుగురు దళితులను ఊచకోత కోసిన అమానుషంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోలేక పోయిందని, టీడీపీ కూడా ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదని, దీన్ని బట్టే వారికి దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు జరిగిన దళిత, గిరిజన నేతల సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!