జీవోలు సక్రమమేనని ఆనాడే ప్రభుత్వం జవాబులిస్తే జగన్‌పై కేసే ఉండేది కాదు
గతేడాది జూలైలో హైకోర్టు నోటీసులిచ్చినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
నాడు ప్రభుత్వ సమాధానం కోసం పట్టుబట్టిన జగన్ న్యాయవాదులు
ఆ సమాధానం ఉంటేనే ఆరోపణల్లో నిజానిజాలు తెలుస్తాయని వాదన
తామెన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్న హైకోర్టు
జీవోలు కరెక్టయితే క్విడ్ ప్రో కో ఆరోపణలే ఆధారరహితం కాదా?
వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేయటానికి, జగన్‌ను నిలువరించడానికే ప్రభుత్వ కుట్ర?
మొదటి నుంచీ అదే చెబుతున్న ‘సాక్షి’; ఆ వాస్తవాన్నే విశ్వసిస్తున్న రాష్ట్ర ప్రజానీకం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ప్రభుత్వానికి ఎక్కడా రూపాయి కూడా నష్టం జరగలేదు. రాష్ట్ర పారిశ్రామిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్ర మంత్రిమండలి సమష్టిగా ఆ నిర్ణయాలు తీసుకుంది. అప్పటిదాకా అమల్లో ఉన్న నియమాలు, సచివాలయ నిబంధనల మేరకే ఆ 26 జీవోలూ జారీ అయ్యాయి. అవన్నీ కేబినెట్ ఉమ్మడి నిర్ణయాలు తప్ప ఏ ఒక్కరివో కావు.
...ఇదీ సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లలోని ముఖ్యాంశాలు. ముందు ఆ 26 జీవోల సంగతి తేల్చాలని... అవి తప్పో, ఒప్పో తేల్చాకే వాటి ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నెల్లూరు న్యాయవాది పి.సుధాకరరెడ్డి వేసిన కేసులో మంత్రులు, ఐఏఎస్‌లు చెప్పిన జవాబు ఇది.
మరి ఇదే జవాబు గతేడాది జూలైలో రాష్ట్ర హైకోర్టుకు చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్రావు, ఆయనకు తోడుగా తెలుగుదేశం నేతలు వేసిన కేసుకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జవాబిచ్చి ఉంటే ఏం జరిగి ఉండేది? బహుశా! గతేడాది ఆగస్టు 10న వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఉండేవి కావేమో! రాష్ట్ర పారిశ్రామిక పురోగతి కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూపాయి కూడా నష్టం వాటిల్లలేదని ప్రభుత్వమే స్వయంగా చెప్పాక అసలు ఈ కేసే ఉండేది కాదేమో!! ఈ కేసు మొత్తాన్ని హైకోర్టు కొట్టేసి ఉండేదేమో!!
ఒకవేళ ప్రభుత్వం చెప్పిన మాటలను హైకోర్టు విశ్వసించని పరిస్థితి గనక ఉండి ఉంటే... అప్పుడు నాటి కేబినెట్ మొత్తాన్ని హైకోర్టు జవాబుదారీ చేసి ఉండేది. ప్రభుత్వం కౌంటర్ వేసి ఉంటే ఏం జరిగి ఉండేదోనన్న విషయంలో ఒక్కటి మాత్రం స్పష్టం. వైఎస్ రాజశేఖరరెడ్డి పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయటం... ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించటం జరిగి ఉండేవి కావు. కానీ అదే జరిగింది. అప్పట్లో ప్రభుత్వం నోరు మెదపలేదు. వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. ఎందుకంటే దానికి కావాల్సింది వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రతిష్ట పాలు చేయటం. రాజకీయంగా తాము ఎదుర్కోలేని స్థాయికి చేరుతున్న ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డిని వేధించటం. కానీ ఇప్పుడు కేసు మొత్తం చుట్టూ తిరిగి దానికే చుట్టుకునే పరిస్థితి వచ్చింది. మంత్రివర్గం నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో సుప్రీంకోర్టుకు చెప్పాల్సి వచ్చింది. లేదంటే మంత్రులు ఇరుక్కుని, మొత్తం ప్రభుత్వమే కుప్పకూలే ప్రమాదం తలెత్తింది. అందుకే ప్రభుత్వం నోరు విప్పింది. నిజం చెప్పింది. ఆ నిర్ణయాలన్నీ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి కోసమే తీసుకున్నామని, అవన్నీ కేబినెట్ సమష్టి నిర్ణయాలేనని, ప్రభుత్వానికి రూపాయి కూడా నష్టం జరగలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటిదాకా దాదాపు 16 నెలల పాటు తాను కొనసాగించిన కుట్రను స్పష్టంగా బయటపెట్టుకుంది. అసలు ఈ కుట్ర ఎలా మొదలైందంటే...
కౌంటర్ దాఖలు చేయలేదు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులను ప్రశ్నిస్తూ శంకర్రావు, తెలుగుదేశం నేతలు వేసిన పిటిషన్లలో మొదటి ప్రతివాది రాష్ట్ర ప్రభుత్వమే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది. కోర్టు నోటీసులివ్వటంతో జగన్ సంస్థలు సహా అంతా సమాధానాలిచ్చారు. మొదటి ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమాధానాలివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలివ్వకుంటే ఆ ఆరోపణల్లోని నిజానిజాలు ఎలా తెలుస్తాయని జగన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దానికి తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఏం చెప్పారంటే.. ‘‘ఒకరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేటపుడు అతనికి సహజ న్యాయ సూత్రాలు వర్తింపజేయాలి. దీన్లో రెండో మాటకు తావులేదు. ఈ కేసులో పిటిషనర్ చేసిన ఆరోపణల నిజానిజాల్ని రికార్డుల పరిశీలన ద్వారా నిర్ధారించుకునే అవకాశమివ్వాలని ప్రతివాదులు కోరారు. అది కూడా సహజ న్యాయ సూత్రాల కిందికే వస్తుందన్నారు. కానీ మేం నిబంధన మేరకు నోటీసులు జారీ చేశాం. రికార్డులు సమర్పించాలని కోరాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేమీ చేయలేదు. కౌంటర్ అఫిడవిట్లు కూడా వేయలేదు. అయితే ఆ ఒక్క కారణంతో ఈ కేసును కొట్టివేయలేం’’ అని. బహుశా.. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కౌంటర్లు వేసి ఉంటే కేసు కొట్టివేసి ఉండేవారేమో!!
జీవోలు కరెక్టయితే క్విడ్ ప్రో కోకు అర్థం ఉందా?
ఈ కేసులో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సంస్థల తరఫు న్యాయవాదులు వాదించింది ఒక్కటే. ఈ 26 జీవోలు తప్పో ఒప్పో తేల్చాలని. అవన్నీ నిబంధనల ప్రకారమే ఇచ్చి ఉంటే గనక... వాటి ద్వారా కాంట్రాక్టులు, లీజులు పొందినవారు ప్రతిగా ఎందుకు పెట్టుబడులు పెడతారన్నది వారి ప్రశ్న. పెట్టుబడిదారులంతా ఇతర వ్యాపార నిర్ణయాల్లో భాగంగానే దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి లాభాల కోసం పెట్టుబడి పెట్టారే తప్ప అందులో క్విడ్ ప్రో కో ఏమీ లేదని వాదించారు. ఈ కంపెనీల్లోని ఇన్వెస్టర్లు కూడా కోర్టు ముఖంగా ఇదే వాదన వినిపించారు. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవటంతో... ప్రభుత్వానికి నష్టం జరిగిందనే కోణంలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది.
26 జీవోలపై సుధాకరరెడ్డి కేసు: సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో నెల్లూరుకు చెందిన న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి కీలక అంశాన్ని లేవనెత్తారు. ఆ 26 జీవోల వల్ల లబ్ధి పొందిన సంస్థలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయంటున్నారు కనక ఆ జీవోలు తప్పోఒప్పో తేల్చాలన్నారు. జీవోలు తప్పయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అలా తేల్చకుండా దర్యాప్తు కొనసాగించటం సరికాదని వాదించారు. సీబీఐ కోర్టులో ఆయనకు చుక్కెదురయింది. ఏమైనా ఉంటే వెళ్లి సీబీఐకే చెప్పుకోవాలని కోర్టు పేర్కొంది. దీంతో సుధాకరరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అక్కడా కొట్టివేతే ఎదురైంది. తర్వాత సుప్రీం తలుపు తట్టారు. మొత్తం పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం... దానికి సమాధానాలు చెప్పాలంటూ ఆరుగురు మంత్రులకు, పలువురు ఐఏఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. దాంతో వారికి జవాబు చెప్పక తప్పని పరిస్థితి ఎదురైంది. గడువులు మీద గడువులు కోరిన మంత్రులు... చివరికి సమయం సమీపించటంతో సోమవారానికల్లా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశారు.
ఆరునెలలుగా జైల్లో జగన్: నిజానికి ప్రభుత్వం మొదట్లోనే తన సమాధానం చెప్పి ఉంటే జగన్ సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తునకు ఆదేశించే పరిస్థితే ఉండేది కాదన్నది న్యాయనిపుణుల మాట. కానీ రాజకీయ డ్రామాలో భాగంగా ఆయన్ను అరెస్టు చేసి ఆరు నెలలుగా జైల్లో పెట్టి వేధిస్తున్నారని, మంత్రివర్గంపై ఎవ్వరి చూపూ పడకుండా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక మంత్రిని రాజీ నామా చేయించి జైల్లో పెట్టారనేది రాజకీయ నేతల మాట. ఒక మంత్రిని బలిచేసి మిగిలిన మంత్రులందరికీ క్లీన్‌చిట్ ఇచ్చే క్రమంలోనే తాజా కౌంటర్లు దాఖలు చేశారనేది వారి భావన.
ఆది నుంచీ అదే డ్రామా!
నిజానికి ఈ కేసులో హైకోర్టుకు శంకర్రావు లేఖ రాయటంతోనే డ్రామా మొదలైంది. కాంగ్రెస్‌ను ఎదిరించకుండా వైఎస్ జగన్‌కు చెక్ పెడదామని భావించిన అధిష్టానం.. అదేమీ కుదరకపోవటంతో మిగిలిన అస్త్రాలన్నిటినీ వాడటం మొదలుపెట్టింది. తెలుగుదేశం నేతలు కలవటం, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగా తీర్పు వెలువడటం... ఆ తరవాత దర్యాప్తు సంస్థ తనకు అందిన ఆదేశాల్ని పాటిస్తూ చార్జిషీట్లను ముక్కలు చేయటం... ప్రశ్నించకుండానే చార్జిషీట్లు వేసేసి ఆనక అరెస్టు చేయటం.. తీరా బెయిలు అడిగితే దర్యాప్తు ముగియలేదని సాకులు చెప్పటం.. ఇలా అన్నీ ఈ డ్రామాలోని అంకాలే. ఆది నుంచీ ఈ డ్రామాను కళ్లకు కడుతున్న సాక్షి... ఏం చెబుతూ ఉందో అదే జరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ఈ డ్రామాను అర్థం చేసుకున్న వారంతా మొన్నటి ఉప ఎన్నికల్లో గట్టి సమాధానమే చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే సమాధానం చెప్పటానికి సిద్ధమయ్యారు కూడా. తాజా అఫిడవిట్లతో ఆ డ్రామా మొత్తం యథార్థమనేది మరోసారి రుజువైంది.
source:sakshi
No comments:
Post a Comment