YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 December 2012

సబ్‌ప్లాన్‌పై నాటకాన్నే రాజ్యసభలోనూ కొనసాగించారు

బహిరంగ లేఖలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుచరిత ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లుపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఆడిన దొంగ డ్రామా ఎఫ్‌డీఐలను అనుమతించే విషయంలో రాజ్యసభలోనూ పునరావృతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. దళిత, గిరిజనుల పట్ల ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. మూడేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆడుతున్న కుమ్మక్కు కుట్రలను ఆమె వివరిస్తూ శనివారం 4 పేజీల బహిరంగలేఖను విడుదల చేశారు. ‘రాజకీయాల్లో ఉనికి కోల్పోతున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీలో చేసిన నటనను ప్రతీ ఒక్కరూ గమనించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అసలు వర్గీకరణ చేయలేమని తెలిసి కూడా రెండు పార్టీలు డ్రామాలు ఆడాయి. ఎస్సీలను విడగొట్టాలన్న దురాలోచనతో జరుగుతున్న కుట్రలో భాగంగా అధికార, ప్రతిపక్షం కుమ్మక్కై రచించిన డ్రామా అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది’’ అని విమర్శిం చారు. 

రాజకీయాల్ని టీడీపీ, కాంగ్రెస్ కలిసి దిగజార్చిన వైనాన్ని వివరిస్తూ... ‘రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీకి చెందిన వ్యక్తికి రూ.400 కోట్ల విలువ చేసే 9 ఎకరాల విలువైన భూమిని హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ధారాదత్తం చేశారు. కిరణ్ సర్కార్ అయితే ఏకంగా ఏపీఎండీసీకి చెందిన గనులను రద్దు చేసి, వాటిని చంద్రబాబు మనిషి సురేందర్‌రావుకు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఈ రెండు పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారీ సంబంధం పెట్టుకున్నాయి. ఆర్టీఐ కమిషనర్ పదవుల్ని పంచుకునే ప్రయత్నం చేశారు. పైగా ఎమ్మార్ భూములకు సంబంధించి చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీబీఐ ఆ దిశగా విచారణ చేయదు’ అని ధ్వజమెత్తారు.

జగన్ విషయంలో చేస్తున్నదేంటి?: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అకారణంగా అరెస్టు చేసి, 6 నెలలు గడిచినా బెయిల్‌ను అడ్డుకుంటున్న సీబీఐ, ఐఎంజీ కేసులో నెలరోజుల్లో చంద్రబాబుపై రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తే ఆయన్ను ఒక్కసారీ విచారించరెందుకని సుచరిత నిలదీశారు. జగన్ కేసులో సీబీఐ మూకుమ్మడిగా దాడిచేసి పెట్టుబడిదారుల్ని భయభ్రాంతులకు గురిచేసి పది రోజుల్లోనే కోర్టుకు నివేదిక అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలని మూడో వ్యక్తి ఉండకూడదనే ఆలోచనతో కాంగ్రెస్-బాబు కలిసి ఆడుతున్న నీచమైన రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అర్థమవుతోందన్నారు. దళిత, గిరిజనులకు సంబంధించినంతవరకు వైఎస్సార్ సంక్షేమ పథకాల వారసత్వ పార్టీగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!