YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 7 December 2012

సీబీఐ ఇక్కడా పనిచేసింది

కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కుకిది పరాకాష్ట
బాబు అసలు స్వరూపం రాజ్యసభలో వెల్లడైంది
పక్కాప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యుల్ని ఓటింగ్‌లో పాల్గొనకుండా చేశారు
ఐఎంజీ భారత కిచ్చిన భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ఆపుకోవడానికేనని విమర్శ

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్ష తెలుగుదేశం లాలూచీ పడినందువల్లే రాజ్యసభలో ఎఫ్‌డీఐపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. ఓటింగ్ సందర్భంగా ముగ్గురు టీడీపీ సభ్యులు గైర్హాజరవడాన్ని బట్టి చూస్తే వారి కుమ్మక్కు నైజం మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఈ ముగ్గురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎఫ్‌డీఐలపై చర్చ జరిగేటప్పుడు సభవద్దే ఉన్నారు. తీరా ఓటింగ్ సమయానికి పాల్గొనకుండా డుమ్మా కొట్టారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట’’ అని పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో కలిసి శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే చిల్లర వర్తకులకు, రైతులకు మొత్తంగా దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్షపార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ విషయమై టీడీపీ ఒకడుగు ముందుకేసి ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొంది. బంద్‌కూ మద్దతిచ్చింది. 

అంతేకాదు పాదయాత్రలోనూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇంత చేస్తున్న చంద్రబాబు అసలు స్వరూపం రాజ్యసభలో వెల్లడైంది. ముగ్గురు టీడీపీ సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసి తీర్మానం ఆమోదం పొందేలా చేశారు’’ అని ఆయన విమర్శించారు. బీఎస్పీ మద్దతుతో తీర్మానం వీగిపోతుందని భావించామని టీడీపీ సభ్యుడు దేవేందర్‌గౌడ్ చెప్పడంలో నిజం లేదన్నారు. ‘‘దేవేందర్‌గౌడ్ చెప్పిన ప్రకారం చూస్తే.. మొత్తం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో యూపీఏ బలం 94 మాత్రమే. 15 మంది బీఎస్పీ సభ్యులు మద్దతుగా నిలిచినా సంఖ్యాబలం 109తో బొటాబొటిగానే ఉండేది. ఎస్పీకి చెందిన 9 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరైన నేపథ్యంలో ముగ్గురు టీడీపీ సభ్యులు పాల్గొని ఉంటే విపక్షాల తీర్మానం వీగిపోయేది కాదు కదా. దీన్నిబట్టి చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు’’ అని మైసూరా తెలిపారు. టీడీపీ మాదిరిగా మరికొందరు ఇతర పార్టీల సభ్యులు వ్యవహరించినందునే విపక్షాల తీర్మానం వీగిపోయిందన్నారు.

చంద్రబాబు నైజం బయటపడింది

ప్రజలముందు గగ్గోలు పెడుతున్న చంద్రబాబు అసలు నైజం మరోసారి వెల్లడైందని మైసూరారెడ్డి చెప్పారు. తెరవెనుక ఒక రాజకీయం, తెరముందు మరో రాజకీయం నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఇలాంటి రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ‘‘ఎఫ్‌డీఐల విషయంలో ఓటింగ్ రెండున్నర గంటలకు జరుపుతామని సభ్యులందరికీ చైర్మన్ సమాచారమందించారు. రెండుగంటలదాకా సభవద్దే ఉన్న టీడీపీ ఇద్దరు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంలోని ఆంతర్యమేంటి? నిన్నటిదాకా సభలో పాల్గొని ఢిల్లీలోనే ఉన్న మరో సభ్యుడు(టి.దేవేందర్‌గౌడ్)... చంద్రబాబు అనుమతితోనే ఆసుపత్రిలో చేరానంటారు. మరోవైపు రాష్ట్రానికే చెందిన ఎన్.జనార్దన్‌రెడ్డి నడవలేకపోయినా వీల్‌చైర్‌లో వచ్చి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేశారు. కానీ బాధ్యత కలిగిన విపక్ష ఎంపీలు ఓటింగ్‌కు డుమ్మా కొట్టడంలోని ఆంతర్యమేంటీ? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చోటుచేసుకుంది. చంద్రబాబు ఇద్దరిచేత తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయించి, ముగ్గుర్ని డుమ్మా కొట్టించి స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేర్చుకున్నారు’’ అని దుయ్యబట్టారు. గతంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం లోక్‌సభలో టీడీపీ సభ్యులనుద్దేశించి.. మీ అధినేత చాలాసార్లు తనను కలిశారని ముందొకమాట, తర్వాత ఒకమాట మాట్లాడడం మీకే చెల్లుతుందని చెప్పడాన్ని మైసూరా గుర్తుచేశారు.

సీబీఐ ఇక్కడా పనిచేసింది

యూపీఏ ప్రభుత్వం ఎఫ్‌డీఐపై విపక్షాల తీర్మానం విషయంలో సీబీఐని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మైసూరా ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ సభ్యులు గైర్హాజరు కావడం, రాజ్యసభలో తాజాగా టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు గైర్హాజరవడమూ సీబీఐ ఎఫెక్ట్ అని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత సంస్థకిచ్చిన భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయకుండా ఉండేందుకే టీడీపీ సభ్యులు ఇలా వ్యవహరించారన్నారు. జగన్ కేసు విషయమై సీబీఐ వ్యవహరించిన తీరు, చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపట్ల ఆ సంస్థ పనిచేసిన తీరును రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. ‘‘జగన్‌పై 48 గంటల్లో మూకుమ్మడి దాడిచేసిన సీబీఐ.. చంద్రబాబుపై విచారణ అనేసరికి సిబ్బందిలేరనడం దేనికి సంకేతం! అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తి పోస్తున్న చంద్రబాబు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టమంటే డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్, టీడీపీల మిలాఖత్ రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు మంచి సంప్రదాయం కాదు’’ అని మైసూరా హితవు పలికారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!