YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 6 December 2012

వైఎస్ ఆలోచనలను జగన్ ముందుకు తీసుకువెళ్తారు

గుడిసెలు లేని రాష్ట్రం కోసం వైఎస్ తపన పడ్డారు
అన్ని వర్గాలకు సంతృప్తస్థాయిలో పథకాలు అమలు చేశారు
వైఎస్ ఆలోచనలను జగన్ ముందుకు తీసుకువెళ్తారు

హైదరాబాద్, న్యూస్‌లైన్:మహనీయుడు బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. అంబేద్కర్ 56వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి విజయమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సమాజంలో మనిషిని మనిషిగా నిలబెట్టేందుకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారు.

ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలని తపన పడ్డారు. ఇదే ఆలోచన విధానంతో పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అనేక పథకాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందించారు. కొద్ది మందికి మాత్రమే రేషన్ ఇచ్చినట్లు కాకుండా పార్టీలకతీతంగా కులం, వర్గమన్న తేడా లేకుండా సమాజంలోని వారందరికీ వర్తించేలా అనేక పథకాలను చేపట్టారు. స్వాతంత్య్రం సిద్ధించిన 65 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల కోసం ఇన్ని పథకాలు చేపట్టలేదు. ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టి పేదలకు, ధనికులతో సమానంగా కార్పొరేట్ వైద్యం అందేందుకు కృషి చేశారు. కేంద్రం 2009లో ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అంతకు రెండేళ్ల ముందే వైఎస్ రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులోకి తెచ్చారు. దీనివల్ల ఎందరో పేద విద్యార్థులు డాక్టర్, ఇంజనీరింగ్ విద్యతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ వంటి చదువులు అభ్యసించగలిగారు. కానీ ఈ ప్రభుత్వం ఆ పథకాలను నిర్లక్ష్యం చేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తమ్మీద ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 45 లక్షల ఇళ్లను నిర్మిస్తే మన రాష్ట్రంలో వైఎస్ అదే ఐదేళ్లలో 45 లక్షల ఇళ్లను నిర్మించారని గుర్తించారు. గుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వైఎస్ ఆలోచించారని పేర్కొన్నారు. 80 లక్షల ఇళ్లను నిర్మిస్తే గుడిసెలు లేకుండా చేయడం సాధ్యమని భావించారని, కానీ ఆయన ప్రజల మధ్య నుంచి వెళ్లి పోయాక ఇప్పుడు ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ ఆలోచించినందువల్లే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల పెద్ద సంఖ్యలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. 

జగన్‌మోహన్ రెడ్డి కూడా వైఎస్ ఆలోచనలను కొనసాగించేందుకు కృషి చేస్తారని తాను గర్వంగా చెబుతున్నట్లు వివరించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. పిల్లలను స్కూలుకు పంపితే ఆ తల్లి ఖాతాలో నగదు జమ చేసేలా ‘అమ్మ ఒడి’ పథకంతోపాటు ప్రతి దళిత కుటుంబానికి సాగుకు వీలైన ఒక ఎకరా భూమి ఇస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పారిశ్రామికులుగా మారాలనుకున్న ఎస్సీ, ఎస్టీలకు శిక్షణ, రుణ సదుపాయాలను హక్కుగా మారుస్తామని చెప్పారు. దళిత, గిరిజనులకు సంబంధించి వైఎస్ సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉపాధి, ఉద్యోగాలను హక్కుగా మారుస్తామన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేసిన ప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని విజయమ్మ స్పష్టంచేశారు. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎస్.రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, హెచ్.ఏ.రెహ్మాన్, నల్లా సూర్యప్రకాశరావు, కొల్లి నిర్మల కుమారి, మూలింటి మారెప్ప, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!