YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 5 December 2012

బెయిల్‌పై సీబీఐ కోర్టు తీర్పును.. సవాల్ చేస్తూ హైకోర్టుకు జగన్

* కింది కోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడి
* ఆ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసి, బెయిల్ ఇవ్వాలని వినతి
* త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం చెప్పి రెండు నెలలైంది.. అయినా పూర్తి కాలేదు
* సీబీఐ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించా
* కేసు డాక్యుమెంట్లన్నీ సీబీఐ స్వాధీనం చేసుకుంది 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రద్దు చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే సీబీఐ కోర్టు తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిందని పేర్కొన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఇతర నిందితులకు తాను ప్రయోజనాలు కల్పించాననేందుకు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వకూడదంటూ సీబీఐ చేస్తున్న వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని ఆ పిటిషన్‌లో తెలిపారు. 

ఈ మొత్తం కేసులో దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు అయినప్పటికీ, సీబీఐ ఇప్పటివరకు దర్యాప్తును పూర్తి చేయలేదని వివరించారు. చట్టం నిర్దేశించిన కాలపరిమితి పూర్తయిన తరువాత కూడా నిందితునికి బెయిల్ నిరాకరించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని తెలిపారు. సీబీఐ చేస్తున్న ఆరోపణలకు, దర్యాప్తులో తేలుతున్న వాస్తవాలకు పొంతన ఉండటంలేదన్నారు. 

ఈ అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేసిందని, అందువల్ల తనను ఇంకా కస్టడీలోనే ఉంచాలనడం సరికాదన్నారు. మొదటినుంచి సీబీఐ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించానని, దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు ఎక్కడా సీబీఐ చెప్పలేదని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ సీబీఐ ఇప్పటికే స్వాధీనం చేసుకుందని, కాబట్టి తనను బెయిల్‌పై విడుదల చేయడంవల్ల సీబీఐ దర్యాప్తునకు వచ్చే నష్టమేమీ లేదని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు. ఇదే కేసుకు సంబంధించి జగన్ ఇప్పటికే సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ధమైన బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.



- వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల అరెస్టు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరైన జగన్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన్ను చూడగానే ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. సీబీఐ ప్రత్యేక కోర్టున్న గగన్‌విహార్, చంచల్‌గూడ జైలు సమీపంలోని నల్లగొండ చౌరస్తాల్లో జగన్‌ను చూసేందుకు వచ్చిన దాదాపు 500 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సైదాబాద్, మలక్‌పేట్, అబిడ్స్ పోలీసుస్టేషన్లకు తరలించారు. 

చంచల్‌గూడ జైలు వద్దకు బుధవారం ఉదయం నుంచే కార్యకర్తలు రావడం గమనించిన పోలీసులు, అరెస్టు చేస్తామంటూ హెచ్చరించి వెనక్కు పంపారు. చంచల్‌గూడ జైలు నుంచి ఉదయం 11 గంటల సమయంలో బయటకు వచ్చిన జగన్ అక్కడున్న వారందరికీ నవ్వుతూ అభివాదం చేశారు. అప్పటిదాకా ఎదురు చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా ‘జగన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. 

దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ నాయకురాలు విజయా రెడ్డితో పాటు మరికొందరు నేతలను చూసి జగన్ చిరునవ్వు నవ్వుతూ కోర్టుకు బయల్దేరారు. దారి పొడవునా అభిమానులు జగన్ వాహనం కోసం ఎదురు చూస్తూ కనిపించారు. గగన్‌విహార్ చేరగానే అభిమానులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వివిధ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది జగన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గగన్‌విహార్ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నేత రెహ్మాన్‌ను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. వందలాది మంది కార్యకర్తలను పోలీస్ వ్యాన్లలో తరలించారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!