మా బాగా బుద్ధి చెప్పారు. నోటికి అదుపు అడ్డూ ఉండక్కర్లేదా. చిన్నంత్రం, పెద్దంత్రం పట్టింపు లేదా. ఎంత మాట వస్తే అంతమాట అంటారా. అందుకు తగిన శాస్తే జరిగింది. రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యనేతను అందరి ముందు పబ్లిగ్గా నిలదీయడానికి ఎంత ధైర్యం. అదృష్టం కలిసొచ్చి ఆయన అమాంతంగా గద్దెనెక్కితే మాత్రం ముఖ్యమంత్రిగారికి ‘రూలింగ్’ తెలియదనుకుంటున్నారా లేక ఆయనకు మంద బలం లేదనుకున్నారా. బెల్లం చుట్టూ ఈగల్లా అధికారాన్ని అంటబెట్టుకునే వీర విధేయులు ఉంటారన్న జాన్ఞమైనా ఉండక్కర్లేదా. అజ్ఞానికి అమాత్రం ‘సన్మానం’ సముచితమే.
భారత్ అతిపేద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇది నిజమని నమ్మి గళమెత్తితే తన్నులు తప్పవు. ముఖ్యనేతలు చెప్పింది విని తలాడించాలి తప్పితే ఎదురు మాటాడకూడదు. సీఎం సారూ ఏం చెప్పినా సావధానంగా వినాలే తప్పా ఆయనను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు సంధించకూడదు. సీఎం గారు అడిగిన దానికి మటుకు క్లుప్తంగా నోరాడిస్తే చాలు. సభా మర్యాద పాటించకుంటే భజనపరుల చేతిలో ‘సత్కారం’ తప్పదు. సంప్రదాయాన్ని ధిక్కరించినందుకు సహచరుడని కూడా చూడకుండా పీచరి వెంకట్‌రెడ్డికి నల్లారి భక్తులు ‘ఘన సన్మానం’ చేశారు.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన పీచరి వెంకట్‌రెడ్డి- కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా చేవెళ్లలో ముఖ్యమంత్రి కిరణ్ నిర్వహించిన సభలో అతడు పాల్గొన్నాడు. ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల అభివృద్ధి కోసం బోలెడు నిధులిచ్చామని గొప్పలు పోయారు. సీఎం మరీ లేత సొరకాయలు కోస్తుంటే కాంగ్రెస్ కార్యకర్త అయ్యుండి కూడా వెంకట్‌రెడ్డి ఊరుకోలేకపోయాడు. నిధులు ఎక్కడిచ్చారంటూ ప్రశ్నించాడు.
ఊహించని ప్రశ్నతో సీఎం అవాక్కయ్యారు. అతడిని సముదాయించేందుకు విఫలయత్నం చేశారు. వెంకట్‌రెడ్డి వినకపోయేసరికి ఈ సభలో ఉన్న జనం తలుచుకుంటే నువ్వు గాల్లో లేచిపోతావంటూ హెచ్చరిక జారీ చేశారు. దీంతో అప్రమత్తమయిన ద్వితీయశ్రేణి నేతాగణం కార్యకర్తలను ఉసిగొల్పారు. నాయకుల ఆదేశాలతో రంగంలోకి దిగిన కార్యకర్తలు వెంకట్‌రెడ్డిని సభలోంచి పక్కకు ఈడ్చుకెళ్లి చితకబాదారు. కాళ్లతో ఎక్కడిబడితే అక్కడ తన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా కాకుండా ఓ పౌరుడిగా వ్యహరించినందుకు వెంకట్‌రెడ్డికి జరిగిన ‘సన్మానం’ ఇది. హస్తం పార్టీలో పెజాస్వామ్యం కాస్తంతా ఎక్కువే కాబట్టి సీఎం సాక్షిగా కాంగీయులు కదంతొక్కారు. అధికారామా మజాకా!
No comments:
Post a Comment