YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 3 December 2012

‘ప్రొక్యూర్‌మెంట్ హాలిడే’ ప్రకటన చేయడం వెనక ప్రైవేటు డెయిరీల కుట్ర?

సర్కారు నిర్లక్ష్యంతో వట్టిపోతున్న ఏపీ డెయిరీ
‘విజయ’ డెయిరీ సేకరిస్తున్నదే 6 లక్షల లీటర్లు...
1.5 లక్షల లీటర్లను అమ్ముకోలేకపోతున్న వైనం.. సేకరణకు సెలవిచ్చే దైన్యం
మార్కెటింగ్ వ్యూహం సున్నా... అరకొర ఉద్యోగులు.. పాత యంత్రాలు
{పభుత్వం నుంచి ప్రోత్సాహం కరువే... డెయిరీని దెబ్బతీసే ‘ప్రైవేట్’ కుట్రలూ కారణమే!

హైదరాబాద్,న్యూస్‌లైన్: విజయ. ఒకప్పుడు దేశ విదేశాల్లో పేరెన్నిక గన్న పాల బ్రాండ్. సహకార రంగంలో విప్లవం సాధించిన గుజరాత్ డెయిరీ ‘అమూల్’తో పోటాపోటీగా మార్కెట్‌లో రాజ్యమేలిన సర్కారీ బ్రాండ్ ఇది. ఇదంతా గతం. మరి ప్రస్తుతం? సేకరిస్తున్న పాలనే ప్రాసెస్ చేయలేని పరిస్థితి. చేసిన వాటిని కూడా అమ్ముకోలేక ఏకంగా సేకరణకే ‘సెలవు’ ప్రకటించిన దుస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 1.2 కోట్ల లీటర్ల పాల సేకరణ జరుగుతుంటే, అందులో ఏపీ డెయిరీ సేకరిస్తోంది కేవలం 6 లక్షల లీటరు! వాటిలో కూడా 1.5 లక్షల లీటర్ల పాలను అమ్మలేకపోతున్నామంటూ ఇటీవల ‘ప్రొక్యూర్‌మెంట్ హాలిడే’ ప్రకటన చేయడం వెనక ప్రైవేటు డెయిరీల కుట్ర దాగుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహకార రంగం పూర్తిగా చేతులెత్తేస్తే, పాల వ్యాపారంలో తమదే గుత్తాధిపత్యం అవుతుందనే వ్యూ హంతో ఆ దిశగా అవి పావులు కదుపుతున్నాయంటున్నారు.
హైదరాబాద్‌లోనూ అంతంతే: హైదరాబాద్ పాల మార్కెట్‌ను ఒక్కసారి చూస్తే ఏపీ డెయిరీ దుస్థితి కళ్లకు కడుతుంది. గత 10-15 ఏళ్లలో నగరం ఎంతో విస్తరించింది. కానీ ఏపీ డెయిరీ మార్కెట్ ఏరియా మాత్రం పెద్దగా పెరిగింది లేదు. నిన్న మొన్న మార్కెట్‌లోకి వచ్చిన హెరిటేజ్, తిరుమల, జెర్సీ వంటి డెయిరీలు రాజధానిలో తమ మార్కెట్లను విస్తరించుకుంటూ అమ్మకాలను పెంచుకొంటుంటే, ఏపీ డెయిరీ మాత్రం ఆ దిశగా ప్రయత్నమే చేయడం లేదు. హైదరాబాద్‌లో రోజూ 3.5 లక్షల లీటర్ల విజయ పాలు అమ్ముడవుతున్నాయి. అందులో 2.5 లక్షల లీటర్ల అమ్మకాలు ఒక్క పాతబస్తీ పరిసరాల్లోనే ఉన్నాయి. మాదాపూర్ వంటి ఏ ప్రాంతంలోనూ విజయ పాలు కొందామన్నా దొరకవు. మహబూబ్‌నగర్‌నే తీసుకుంటే, ఆ జిల్లా నుంచి ఏపీ డెయిరీ రోజుకు లక్ష లీటర్ల పాలు సేకరిస్తోంది. కానీ జిల్లాలో విజయ పాల అమ్మకాలు మాత్రం 10 వేల లీటర్లకు మించవు. పటిష్టమైన ఏజెంట్ నెట్‌వర్క్‌ను ఏర్పరచుకుంటే హైదరాబాద్‌లోనే కనీసం మరో 2 లక్షల లీటర్ల పాలను అమ్మవచ్చన్న అభిప్రాయముంది. ఏపీ డెయిరీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే పూర్వ వైభవం అసాధ్యమేమీ కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సిబ్బందీ అరకొరే: సిబ్బంది కొరత కూడా ఏపీ డెయిరీని పీడిస్తోంది. సంస్థలో 1,462 పోస్టులు ఉంటే అందులో 745 ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. పాల సేకరణ, అమ్మకాల్లో బాగా వెనకబడటానికి చాలీచాలని సిబ్బంది కూడా ప్రధాన కారణమే. దీనికి తోడు సంస్థ ఎండీలను తరచూ బదిలీలు చేస్తుండటం, విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం కరువు కావడంతో దాని ప్రగతి పూర్తిగా కుంటుపడింది. పైగా ఏపీ డెయిరీలో ఇప్పటికీ తాతల కాలం నాటి యంత్ర పరికరాలనే వాడుతున్నారు. దాంతో పాల సేకరణ, అమ్మకాల్లోని ఎగుడుదిగుళ్లను తట్టుకోలేక సంస్థ చతికిల పడుతోంది.

ప్రభుత్వ చేయూతా కరువే: ఏపీ డెయిరీకి పూర్వ వైభవం తెచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టి కృషి చేశారు. తొలి దశలో పాల ఉత్పత్తి పెంపుదలపై దృష్టి పెట్టి పశు క్రాంతి వంటి పథకాలను ప్రవేశపెట్టారు. దాంతో 2003-04లో 69.58 లక్షల మెట్రిక్ టన్నులున్న పాల దిగుబడి 2009-10కి 104.3 లక్షల టన్నులకు పెరిగింది. 2011-12 నాటికి 124.3 లక్షల టన్నులకు చేరుకుంది (టన్ను పాలంటే 970 లీటర్లు). మలి దశలో ఏపీ డెయిరీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసే కృషి మొదలైంది. మూతబడ్డ 38 ‘బల్క్ మిల్క్ కూలింగ్’ కేంద్రాలను డెయిరీ ఆధ్వర్యంలో తెరవడం, కొత్త టెట్రా ప్యాక్ యూనిట్ నెలకొల్పడం వంటి చర్యలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణం తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
అవకాశాలెన్నో: ఏపీ డెయిరీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పాల విక్రయాలు పెంచుకునే అవకాశాలకు కొదవేమీ లేదు. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజూ 4,000 లీటర్ల పాలు కావాలి. అందులో సగం సొంత డెయిరీ నుంచి వస్తోంది. మిగతా 2,000 లీటర్లను బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. టీటీడీకి రోజుకు సుమారు 1,500 కిలోల నెయ్యి కూడా అవసరముంటుంది. దాన్ని కర్ణాటక నుంచి కొంటున్నారు. అవసరమైతే వ్యాట్ తదితర సడలింపులిచ్చి ఏపీ డెయిరీ నుంచే కొనుగోలు చేసేలా చేయవచ్చు.



హైదరాబాద్‌లో పాల విక్రయాలు (లక్షల లీటర్లలో)
విజయ హెరిటేజ్ తిరుమల
2002 2.31 0.8 0.2
2012 3.68 2.5 1.5

ఏపీ డెయిరీకీ బాబు వెన్నుపోటు
చంద్రబాబు ప్రస్తావన వస్తూనే ‘మామకు వెన్నుపోటు’ ఉదంతం గుర్తుకొస్తుంది. అయితే బాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ ్ధకోసం ఏపీ డెయిరీకి కూడా వెన్నుపోటు పొడిచారని డెయిరీ ఉద్యోగులు అంటారు. మొదట్లో హెరిటేజ్ కోసం రోజుకు 2.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యమున్న చిత్తూరు డెయిరీని దుంపనాశనం చేసిన ఘనత బాబుదే. తర్వాత ఏపీ డెయిరీ ఫెడరేషన్‌లో భాగస్వాములుగా ఉన్న 8 జిల్లాల పాల యూనియన్లను మ్యాక్స్-95 పేరుతో బాబే విడదీసి విచ్ఛిన్నం చేశారని, అలా హెరిటేజ్‌ను విస్తరించుకున్నారని ఏపీ డెయిరీ ఓ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు చెప్పారు. నాటి బాబు వెన్నుపోటు నుంచీ సంస్థ ఇప్పటికీ కోలుకోలేకపోతోందన్నారు.



వైఎస్ ఉంటే ఇలా ఉండేది కాదు

వైఎస్ ఉంటే ఇలా ‘మిల్క్ హాలిడే’ పరిస్థితి వచ్చేది కాదు. గతంలో చంద్రబాబు కారణంగా ఏపీ డెయిరీ నుంచి విడిపోయిన 8 జిల్లా యూనియన్లను ఒకే తాటి కిందకు తెచ్చేందుకు వైఎస్ గట్టిగా ప్రయత్నించారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక 8 జిల్లాల పాల యూనియన్ల చైర్మన్లు వైఎస్‌ను కలిసి రాజీ ప్రతిపాదనలు చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వైఎస్ హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు రెండు రోజులకే ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రెండు పాల పొడి కర్మాగారాలు ఏర్పాటు చేయాలి.

-బుల్లయ్య చౌదరి, కృష్ణవేణి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్
మార్కెట్ వ్యూహాలను సక్రమంగా అమలు చేయాలి

రాష్ట్రంలో పాలు ఇంతగా వెల్లువెత్తుతున్నా ఏపీ డెయిరీతో సహా ఏ డెయిరీ కూడా పాల అమ్మకపు ధరను రూపాయి కూడా తగ్గించలేదు. కోడి మాంసం, గుడ్ల వంటి వాటి ధరలు సీజనల్‌గా తగ్గుతుంటాయి. కాబట్టి ఏపీ డెయిరీ చొరవ తీసుకుని పాల ధర తగ్గిస్తే ప్రైవేటు డెయిరీలూ తగ్గించాల్సి వస్తుంది. పాల వినియోగమూ పెరుగుతుంది. రోజుకు లక్షన్నర లీటర్ల పాలను ప్రాసెస్ చేయలేక నష్టాలపాలవడం కన్నా ధర తగ్గిస్తే సంస్థ మార్కెట్ విస్తృతమవుతుంది. అలాగే పాలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. లేదంటే పాల ఉత్పత్తిదారుల్లో భరోసా సడలి అసలుకే మోసం వస్తుంది.

- ప్రొఫెసర్ జీఎన్ రావు, రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల రిటైర్డ్ ప్రినిపల్, పశు నేస్తం మానపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్


source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!