YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 4 December 2012

మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే..పులి పులే

* చట్టాలు, పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసే నాయకత్వం ఉండాలి: షర్మిల
* ఈ విషయం ముఖ్యమంత్రికి మేం చెప్పాల్సి రావడం దురదృష్టకరం
* సబ్‌ప్లాన్ బిల్లును ఆయన హడావుడిగా సభలో పెట్టి గొప్పలు చెప్పుకొంటున్నారు
* తన పాలనలో ప్రజల్ని అష్టకష్టాలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ రకరకాల హామీలిస్తున్నారు
* ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు కాబట్టే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు 

‘‘మన ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు హడావుడిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చాలా గొప్ప పని చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక మాట చెప్తున్నా. అభివృద్ధి అనేది చట్టాల వల్ల మాత్రమే జరగదు. చట్టాలు, సంక్షేమ పథకాలను.. అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో ఒకేసారి అమలు పరచగల నాయకత్వం వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందని మేం ముఖ్యమంత్రికి చెప్పాల్సి రావడం మన దురదృష్టం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘విద్యార్థుల మెస్ చార్జీలు పెంచగలిగినవారు.. అదే హాస్టల్ విద్యార్థులు కడుపు నిండా తినడానికి గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వడం లేదు? వారికి దళితులు, గిరిజనుల మీద ప్రేమ ఉంది అని చెప్పుకుంటున్నారు.

నిజంగా వారికి ప్రేమే ఉంటే దళితుల కష్టాలు ఈపాటికే వారికి కనిపించేవి’’ అని ఆమె అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 48వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ పట్టణానికి చేరింది. పట్టణంలోని గడియారం చౌరస్తాలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

బాబు పాలనలో 4 వేల మంది అన్నదాతల ఆత్మహత్యలు..
‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పుస్తకం రాసుకున్నారు. దాని పేరు ‘మనుసులో మాట’.. ఆయన మనసులో మాట. జల ప్రాజెక్టులు కట్టడం నష్టమట.. వ్యవసాయం శుద్ధ దండగట.. ప్రజలకు ఏమీ ఉచితంగా ఇవ్వకూడదట.. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులుగా మారుతారట.. ఇదీ చంద్రబాబు పుస్తకంలో రాసుకున్నది. చంద్రబాబు తొమ్మిదేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను, మహిళలను జైల్లో పెట్టించారు. ఈ అవమానాలను తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘ఇప్పుడు మళ్లీ పాదయాత్ర పేరుతో గ్రామాల్లోకి వస్తున్న బాబు.. రకరకాల హామీలు ఇస్తున్నారు. వైఎస్సార్ అమలు చేసిన రైతు రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ.. తదితరాలను తాను కూడా చేపడతానని బాబు ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. 

అయ్యా.. చంద్రబాబూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది మీ వ్యవహారం. మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే..పులి పులే ’’ అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయవచ్చన్నారు. కానీ ఆయన ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటున్నారని విమర్శించారు.

కేసీఆర్ ప్రజల్ని మర్చిపోయారు..
మహబూబ్‌నగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు.. తనను గెలిపించిన ప్రజల్ని మర్చిపోయారని, ఆయన ఏనాడూ తన నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. ‘‘ఇక్కడ ప్రస్తుతం ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఎక్కడికి పోయినా మహిళలు తాగడానికి నీళ్లు లేవు అంటున్నారు. ఏరోజైనా కేసీఆర్.. ఓటేసిన ప్రజల దిక్కు చూశారా? అని అడుగుతున్నా! తనకు ఓటేసిన ప్రజలు ఎలా ఉన్నారు?.. తింటున్నారా? బతికి ఉన్నారా? అనిఆయన ఒక్కసారంటే ఒక్కసారైనా తిరిగి చూశారా? ఒక్కరోజైనా ప్రజల సమస్యల గురించి మీరు పోరాటాలు చేశారా? ఆడవాళ్లయితే రెండు మూడు కిలోమీటర్లు వెళ్లి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మహిళ కన్నీటి కష్టాలు ఒక్కసారంటే ఒక్కసారికూడా కేసీఆర్ కంటికి కన్పించ లేదు’’ అని అన్నారు.

పాలమూరు కిటకిట..
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్రతో మంగళవారం పాలమూరులో రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. సభకు పట్టణంలోని ప్రజలేకాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కె.కె.మహేందర్‌రెడ్డి, బాల మణెమ్మ, వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు, హెచ్‌ఏ రహమాన్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎ.సురేందర్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి శ్రీనివాసరెడ్డి, ప్రసాదరాజు, ఇందూరి రామక్రిష్ణరాజు, చల్లా వెంకట్రామిరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, బీశ్వ రవీందర్, కసునూరు రఘునాథరెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, శేరి రాకేష్‌రెడ్డి, అంజార్ బాషా, ఎం.రాజగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, బండారు మోహన్‌రెడ్డి, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వరమ్మ, మధుమిత, కందూరి లక్ష్మి, కందుల శోభనాదేవి తదితరులు యాత్రలో షర్మిల వెంట నడిచారు. 

మాకు న్యాయం చేయండి..
‘‘కష్టపడి ఎడ్‌సెట్‌లో ర్యాంకులు తెచ్చుకున్నాం. చిన్నచిన్న పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలేసి కష్టపడి బీఈడీ చదువుతున్నాం. తీరా చూస్తే ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తోంది. బీఈడీ చేసిన వాళలకు ఎస్‌జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టుకు అర్హత లేదని ఉత్తర్వులిచ్చింది. ప్రమోషన్లలో కూడా డీఈడీ వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బీఈడీ పూర్తి చేసిన వారున్నారు.

ప్రభుత్వం చీకటి జీవోలతో మా భవిష్యత్తును నాశనం చేసింది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే మాకు ఆత్మహత్యలే గతి’’ అంటూ మహబూబ్‌నగర్‌లో వందలాది మంది బీఈడీ విద్యార్థులు షర్మిలను కలిసి మొరపెట్టుకున్నారు. దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘‘మీ సమస్యను అమ్మతో(విజయమ్మతో) చెప్పి అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రయత్నం చేస్తాం. పార్టీతో చెప్పి మీ సమస్యపై అధ్యయనం చేయించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం మీ సమస్య తీరుస్తుందనే నమ్మకం నాకైతే లేదు. కానీ జగనన్న రాగానే మీకు న్యాయం చేస్తారు. ఏడు లక్షల మందికి అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని అన్నారు.

ఉద్రిక్తతలోను.. చిరునవ్వుతోనే..
షర్మిల మంగళవారం పాలమూరు వర్సిటీ వద్ద నుంచి వెళుతున్నప్పుడు వర్సిటీ ప్రాంగణంలో నుంచికొంతమంది రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. అయితే షర్మిల మాత్రం చిరునవ్వుతోనే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వ్యక్తిగత సిబ్బంది, పోలీసులు ఆమెకు రక్షణ వలయంగా ఏర్పడటానికి ప్రయత్నించినా షర్మిల వారిని వారించారు. గాలిలోకి అభిమానపు ముద్దులు విసురుతూ నడుచుకుంటూ ముందుకుసాగారు. అయితే ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్ అభిమాని జగన్ అనే వ్యక్తి కాలు టమాటాల మీదపడి జారి పడ్డారు. 

అతని కాలుపై ఒక వాహనం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాన్వాయ్ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలోని విజయ డెయిరీ ఎదురుగా షర్మిల భోజన విరామం తీసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. ఆమెకు సంఘీభావంగా భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో రాయచూర్ రోడ్డు జనంతో కిటకిటలాడింది. కాగా, మంగళవారం ధర్మాపురం నుంచి మొదలైన యాత్ర బండమీదిపల్లి, పాలమూరు యూనివర్సిటీ మీదుగా సాగింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 

అక్కడి నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రి 8 గంటలకు ఎలుగొండ శివారులోని బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మంగళవారం మొత్తం 13.20 కిలోమీటర్ల యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 669.30 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

అభిమానిని పరామర్శించిన విజయమ్మ: గాయపడిన అభిమాని జగన్‌ను కాన్వాయ్ సిబ్బంది స్థానిక ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వస్తూ.. ఆస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించారు.

sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!