YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 6 December 2012

బాధల్లో ఉన్న ప్రజానీకానికి భరోసా

అందుకే జనం ప్రభంజనంలా వస్తున్నారు 
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర ఇది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, వారితో కుమ్మక్కయిన ప్రధాన ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలను ఎండగడుతూ, బాధల్లో ఉన్న ప్రజానీకానికి భరోసా కలిగిస్తూ షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అందుకే ఆమె యాత్రకు జనం అంతగా విరగబడుతున్నారని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికార, ప్రతిపక్షాలు రెండూ కలిసి కుట్ర పన్ని జగన్‌ను సీబీఐ దన్నుతో జైల్లో పెట్టించాయి. కానీ ఆయన జైల్లో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయొచ్చని వారు క న్న కలలు కల్లలయ్యాయి. జగన్ జైల్లో ఉన్నా పార్టీకి ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. చంద్రబాబు పాదయాత్ర నానాటికీ నిస్సారంగా మారి పోతూంటే, షర్మిల యాత్రలో జీవకళ ఉట్టిపడుతోంది. 

కొనుగోలు చేసిన మనుషులతో బాబు యాత్ర నత్తనడకన సాగుతూ అవిటి యాత్రలా తయారైంది. షర్మిల యాత్ర మాత్రం లక్షలాది మంది ప్రజల జేజేల నడుమ కొనసాగుతోంది’’ అని ఆయనన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎదురైన నిరసనను ప్రస్తావించగా, లక్షలాది మంది దీవిస్తున్నపుడు అక్కడక్కడా కొందరు రాళ్లు కూడా వేస్తూంటారని, వాటికంత ప్రాధాన్యత లేదని భూమన బదులిచ్చారు. షర్మిల పాదయాత్ర వల్ల ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించే దిశగా సర్వసన్నద్ధం అవుతున్నారని జోస్యం చెప్పారు. షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నవ చైనా నిర్మాత మావో జెడాంగ్ జరిపిన లాంగ్ మార్చ్‌తో పోల్చదగినదని కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‘నాడు మావో లాంగ్ మార్చ్‌లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇప్పుడు షర్మిల పాదయాత్రలో కూడా లక్షలాది మంది ప్రజలు ఆమె వెంట వస్తున్నారు. అక్టోబర్ 18న ఇడుపులపాయలో తండ్రి వైఎస్ సమాధి నుంచి యాత్ర ప్రారంభించిన ఆమె ఇప్పటికి 700 కిలోమీటర్లు పూర్తి చేశారు. 200 గ్రామాలు, 10 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్ల గుండా యాత్ర జరిపారు. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా ప్రజలు షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొని ఆశీర్వదించారు. మహిళలెవరూ 300, లేదా 400 కిలోమీటర్ల కంటే ఎక్కువగా పాదయాత్ర చేసిన సందర్భాలు చరిత్రలో లేవు. షర్మిల మాత్రం ఏకబిగిన నిర్విరామంగా 3,000 కిలోమీటర్ల యాత్రకు పూనుకున్నారు. ఇది ప్రపంచంలోనే ప్రప్రథమం’ అని చెప్పారు.

తెలుగు మహాసభలపై నిరసన సబబే!

తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల తీరుపై తాము నిరసన వ్యక్తం చేయడం సబబేనని భూమన అన్నారు. తెలుగు మహా సభల్లో ఆంగ్లానికి తావివ్వరాదని ఓ తెలుగు భాషాభిమానిగా తాను తొలి నుంచీ కోరుతున్నానని చెప్పారు. ‘‘శరవేగంగా అంతరిస్తున్న 16 భాషల్లో తెలుగూ ఒకటని ప్రపంచ జీవధ్భాషాధ్యయన సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఒకప్పుడు లక్షన్నర పదాలతో విరాజిల్లిన తెలుగు ఇప్పుడు 7,000 పదాలకు పరిమితం కావడం విచారకరం. ఇలాంటి తరుణంలో ఏదో ఊరంతా తోరణాలు కట్టి, రంగులేసి జాతరలాగా సభలు నిర్వహించినంత మాత్రాన తెలుగు భాషకు ఒరిగేదేమీ ఉండదు. పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!