YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 5 December 2012

చంద్రబాబూ.. రిలయన్స్ గుట్టు చెప్పు


* ప్రజలకు ఉపయోగపడాల్సిన కేజీ బేసిన్‌ను చంద్రబాబు రిలయన్స్‌కు ధారాదత్తం చేశారు
* ఆ గ్యాస్ ఇవ్వకుండా ఉండుంటే.. ఇప్పుడు ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ చవకగా దొరికేది
* మన రాష్ట్ర విద్యుత్ సమస్యలు కూడా తీరిపోయేవి
* ఆ గ్యాస్ రిలయన్స్‌కు అప్పగించి.. బాబు రాష్ట్రంలో గ్యాస్ రేటు రూ.180 నుంచి రూ. 305కు పెంచారు
* కేజీ బేసిన్ స్కాం.. 2జీ కంటే పెద్ద స్కాం.. అయినా దీనిపై ఈ ప్రభుత్వం విచారణ జరపదు
* 850 ఎకరాల భూముల్ని ఐఎంజీ సంస్థకు బాబు ధారాదత్తం చేసినా విచారణ జరపదు
* విచారణ జరపనందుకు ప్రతిగా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరు
* పాలమూరు ప్రజల గొంతు ఎండుతున్నా కేసీఆర్ గొంతెత్తరేం?

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కృష్ణా-గోదావరి బేసిన్(కేజీ బేసిన్) గ్యాస్ మనకు దేవుడిచ్చిన వరం. మన రాష్ట్ర విద్యుత్తు అవసరాలన్నీ దానితో తీరిపోతాయి. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా చవకగా గ్యాస్ కూడా సరఫరా చేయొచ్చు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ గ్యాస్‌ను నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు అవసరమైన రిలయన్స్ కంపెనీకి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించారు. ఇది 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం.

రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేజీ బేసిన్ గ్యాస్‌ను ఎందుకు రిలయన్స్ చేతిలో పెట్టారో చంద్రబాబే చెప్పాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల డిమాండ్ చేశారు. కేజీ బేసిన్‌ను రిలయన్స్‌కు ధారాదత్తం చేసి ఆ వేళ రాష్ట్రంలో రూ.180 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.305కు పెంచిన ఘనుడు చంద్రబాబు కాదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 49వ రోజు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో సాగింది. షర్మిలకు సంఘీభావం తెలపడానికి జడ్చర్ల సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతోపాటు అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. జడ్చర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు.

చంద్రబాబుపై విచారణ చేయరేం?
‘‘కోట్ల రూపాయల కేజీ బేసిన్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టడంతోపాటు, ఎకరాకు రూ. 2 కోట్లు పలికే 850 ఎకరాల భూమిని చంద్రబాబు ఎకరా రూ. 50 వేల చొప్పున ఐఎంజీ భారత అనే తన బినామీ సంస్థకుకట్టబెట్టేసినా.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై విచారణ జరిపించదు. రెండెకరాల నుంచి ఇన్ని వేల కోట్లు బాబు ఎలా సంపాదించారంటూ కమ్యూనిస్టులు పుస్తకాలు ముద్రించినా విచారణ జరిపించరు. చంద్రబాబును మించిన ధనవంతుడైన రాజకీయ నేత లేడని తెహల్కా వెబ్‌సైట్ ఆరోపించినా.. విచారణ జరిపిం చరు. వారు విచారణ జరిపించనందుకు బదులుగా టీడీపీ అధినేత కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా కాపాడతారు. ఇద్దరూ కలిసి జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి సీబీఐని వాడుకుని నీచమైన రాజకీయాలకు దిగారు..’’ అని షర్మిల మండిపడ్డారు.

వైఎస్సార్ చెప్పనివీ చేశారు..
‘‘రాజన్న రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చి, కరెంటు ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి, దురదృష్టవశాత్తూ పంట నష్టపోతే పరిహారం ఇచ్చి రైతన్నకు అండగా నిలబడ్డారు. అక్కాచెల్లెళ్లు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు. విద్యార్థులు పెద్ద చదువులు చదవాలని పూర్తిగా ఫీజు కట్టారు. ఆరోగ్యశ్రీ, 108తో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. చెప్పినవీ, చెప్పనివీ చేశారు. కానీ వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతన్నను పూర్తిగా గాలికి వదిలేసింది. కంటతడి పెట్టించి కడుపు మీద కొట్టి వేడుక చూస్తోంది. మహిళలు అల్లాడుతుంటే, విద్యార్థులు బాధపడుతుంటే తమకేమీ పట్టనట్టు చూస్తోంది. అవిశ్వాసం పెట్టి నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తూ ఈ ప్రభుత్వాన్ని కాపాడుతోంది..’’ అని షర్మిల దుయ్యబట్టారు.

పాలమూరును సస్యశ్యామలం చేయాలని వైఎస్ తపించారు: ‘‘మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని వైఎస్సార్ సంకల్పిం చారు. రూ.10 వేల కోట్లతో చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు తరహాలో దీన్ని చేపట్టి మూడు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ అనుకున్నారు. కానీ ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టు గురించి కనీసం ఆలోచించే వారే లేకపోవడం మన దురదృష్టం. రామన్‌పాడు నుంచి జడ్చర్ల పట్టణంతోపాటు చుట్టూ ఉన్నా 52 గ్రామాలకు మంచినీ టిని అందించాలని వైఎస్సార్ అనుకున్నారు. ఆయన ఉన్నప్పుడే 60% పనులు పూర్తి చేశారు. కానీ ఆ తరువాత వచ్చిన చిత్తశుద్ధి లేని పాలకులు ఆ ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు’’ అని షర్మిల విమర్శించారు.

కేసీఆర్.. ప్రజా సమస్యలపై గొంతెత్తరేం?
మహబూబ్‌నగర్ ఎంపీ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలను పూర్తిగా మర్చిపోయారని షర్మిల అన్నారు. ‘‘కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీ. కానీ ఆయనకు ఏనాడూ కూడా ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ ఈ జిల్లాలో ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఎక్కడికి పోయినా తాగడానికి నీళ్లు లేవు అని మహిళలు చెప్తున్నారు. మహిళ కష్టాలు కేసీఆర్ కంటికే కనిపించవు. ఆయన జీవితం సగం ఫామ్‌హౌస్‌లో, సగం ఢిల్లీలోనే సరిపోతోంది. కేసీఆర్‌గారూ.. మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు తాగునీళ్ల కోసం తల్లడిల్లుతున్నా ఏ ఒక్క రోజు కూడా గొంతెత్తరెందుకు?’’ అని ఆమె విమర్శించారు.

జడ్చర్ల జనసంద్రం..
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్ర సందర్భంగా బుధవారం జడ్చర్ల మొత్తం జనసంద్రంగా మారింది. కిక్కిరిసిన సభలో షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రతిపక్షాల కుట్రపైన, కేసీఆర్‌పైన విమర్శలు ఎక్కుపెట్టారు. షర్మిల ప్రసంగిస్తుంటే యువత, మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిం చింది. కాగా 49వ రోజు బుధవారం యాత్రను షర్మిల ఉదయం ఎనుగొండ నుంచి ప్రారంభించారు. అప్పన్నపల్లి, నక్కలబండ, కొత్తతాండ, జడ్చర్ల మీదుగా పాదయాత్ర చేసి సిగ్నల్ గడ్డ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 17.30 కిలోమీటర్లు ఆమె నడిచారు.

ఇప్పటి వరకు మొత్తం 686.60 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. యాత్రలో పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, అవినాష్‌రెడ్డి, తలశిల రఘురాం, శేరి రాకేష్‌రెడ్డి, ఎం.సురేందర్‌రెడ్డి, కసునూరు రఘునాథరెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, మాదారం రవీందర్‌రెడ్డి, డాక్టర్ వి.రాంరెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, కందుల శోభనాదేవి తదితరులు షర్మిల వెంట నడిచారు.

రికార్డు లీడర్ వైఎస్సార్...
చంద్రబాబు గ్యాస్ ధరను రూ.305కు పెంచితే ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైఎస్ ఆరేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఒక్క గ్యాస్ ధరే కాదు ఏ ఒక్క పన్నులు కూడా పెంచకుండా అన్ని అభివృద్ధి పథకాలూ అమలు చేసి చూపించిన రికార్డు లీడర్ వైఎస్సార్. కానీ నాన్న చనిపోయాక వచ్చిన సీఎం కిరణ్ ప్రభుత్వం రూ.305గా ఉన్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.420కి పెంచింది. అది సరిపోదన్నట్లు మరో మెలిక పెట్టారు. సబ్సిడీ సిలిండర్లు ఇక ఏడాదికి ఆరు మాత్రమే ఇస్తారట. మిగిలిన సిలిండర్లను సబ్సిడీ లేకుండా దాదాపు ఒక్కోటి రూ.వెయ్యికి కొనాలట!
- జడ్చర్ల సభలో షర్మిల

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!