రాజకీయ పార్టీలకు సెంటిమెంట్ జిల్లాగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వేణు మొదటి నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. రాజకీయ అరంగేట్రం నాటి నుంచి వైఎస్ అడుగుజాడల్లో నడిచారు.
వేణు గురువారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ప్రజలకు ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కొనే మనోనిబ్బరం కలిగిన జగన్‌కు మద్దతు తెలపడం నైతిక బాధ్యతగా భావిస్తున్నానని వేణు శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో అన్నారు. రాజకీయంగా తాను ఎక్కిన ప్రతి మెట్టుపైనా వైఎస్ ముద్ర ఉందన్నారు. వైఎస్ బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. వైఎస్ పథకాలు, ఆశయాలు ఆయన తనయుడు జగన్ సారథ్యంలోని వైఎస్సార్ సీపీ మాత్రమే కొనసాగించగలదన్న నమ్మకంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న మహానేత తనయుడికి మద్దతివ్వడం తన విధ్యుక్త ధర్మమన్నారు. జగన్ ఆదేశాలకు అనుగుణంగా పదవులతో నిమిత్తం లేకుండా, పార్టీ అభ్యన్నతి కోసం సామాన్య కార్యకర్తగా తన వంతు పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమావాస్య తరువాత పార్టీలో చేరేందుకు మంచి ముహూర్తం నిర్ణయించుకుంటానన్నారు.
No comments:
Post a Comment