‘తప్పు మీద తప్పు మీరు చేస్తూ నిత్యం దివంగత సీఎం వైఎస్‌పై నిందలు వేస్తూ కాలం గడుపుతారా’ అని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలులోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘బయ్యారం గనులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు వాస్తవాలు వెల్లడించినా పదే పదే పాత ఆరోపణలు చేస్తున్నారు. ఏపీఎండీసీ నుంచి రక్షణ స్టీల్స్ కొనే మెటీరియల్‌కు సంబంధించిన ఒప్పందాన్ని నేను మంత్రిగా ఉండగానే రద్దుకు సిఫార్సు చేశాను.
రక్షణ స్టీల్స్ వైఎస్ అల్లుడిదైతే నేను ఆ పని ఎందుకు చేస్తాను? ఓఎంసీలో తాజా లీజుకు సంబంధించి ఏపీఎండీసీతో నాడు దరఖాస్తు చేయిస్తే.. అది రద్దు చేసి, ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఇచ్చారు. టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు వైఎస్‌ఆర్‌కు పట్టం కడితే... కనీసం కాంగ్రెస్‌కు అనుకూలంగా కాకుండా అనుక్షణం టీడీపీకి వత్తాసు పలుకుతూ అధికార, విపక్షాలు ఒకరికొకరు సహకరించుకుంటూ దోచుకుంటున్నాయి. ఇలా మీరు తప్పులు చేస్తూ మహానేత మీద బురద ఎలా చల్లుతారు’ అంటూ కాంగ్రెస్, టీడీపీలపై బాలినేని ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిణామాలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
స్పీకర్ పక్షపాతం చూపారు
ఆదివారం అసెంబ్లీలో బయ్యారం గనులపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు అప్పటి మంత్రిగా నాకు అవకాశం కల్పించలేదు. అలాగే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయమ్మ సమాధానం చెప్పగా, మళ్లీ రేవంత్‌కే మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ మాపై పక్షపాతంతో వ్యవహరించారు.
సబ్‌ప్లాన్‌కు సహకరించాం
సబ్‌ప్లాన్‌కు వైఎస్‌ఆర్ సీపీ నూరుశాతం సహకరించింది. టీడీపీ ఓటింగ్ పెట్టినపుడు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నాం. సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు ఉందని ఓటింగ్ పూర్తయ్యే వరకు సీఎంకు తెలియదా? ఇది టీడీపీ, కాంగ్రెస్‌ల కుమ్మక్కుకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. నిజంగా ఓటింగ్‌లో నెగ్గాలనుకుంటే టీడీపీ విప్ జారీ చేసి ఉండేది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కచ్చితంగా హాజరయ్యేవాడు. వైఎస్‌ఆర్ సీపీ సహకరించలేదంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, గర్హనీయం.
వైఎస్ కుటుంబమంటే ఎందుకంత భయం?
జగన్‌ను ఉద్దేశపూర్వకంగా వేధించి, సీబీఐని అడ్డుపెట్టుకుని కనీసం బెయిల్‌కూడా రాకుండా చేస్తున్నారు. తాజాగా ఇపుడు షర్మిలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మహానేత కుటుంబమంటే మీకు ఎందుకంత భయం? నిజంగా మీ వద్ద ఆధారాలుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవచ్చని విజయమ్మ స్పష్టం చేశారుకదా! ఇంకెందుకీ దుర్మార్గపు చర్యలు?
ప్రజాభీష్టం మేరకే పార్టీలో చేర్చుకుంటాం
మా పార్టీలోకి వచ్చేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారనేది నిజం. అయితే ఎవరినంటే వారిని పార్టీలోకి తీసుకోం. ప్రజల మద్దతు ఉన్న వారిని మాత్రమే చేర్చుకుంటాం. ఆదివారం ఆసెంబ్లీ లాబీల్లో సాదా సీదాగా మాట్లాడిన మాటలను ఓ పత్రిక వక్రీకరించింది. అవినాష్, షర్మిలలు కడప లోక్‌సభ సీటుకోసం పోటీ పడుతున్నారట కదా! అని అడిగినపుడు షర్మిలమ్మ ఒంగోలు, విశాఖ, విజయవాడలతో పాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలదు. రాజశేఖరరెడ్డి కుమార్తెగా ఆమెకు ఆ ఛరిష్మా ఉందని మాత్రమే చెప్పా. అలాగే జగన్‌కు బెయిల్ ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు.. జగన్ బెయిల్‌కు సీబీఐ కావాలని అడ్డుపడుతోందని, బెయిల్ ఎప్పుడొస్తుందో చెప్పలేనన్నాను తప్ప మార్చి తర్వాత అని చెప్పలేదు.
టీడీపీకి సిగ్గు రావాలనే..
రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 29 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ మా వద్ద 17 మంది మాత్రమే ఉన్నారు. మేమెలా అవిశ్వాసం పెడతాం? కానీ టీడీపీకి అలా అయినా సిగ్గు వచ్చి..అవిశ్వాసానికి అడుగులు వేస్తుందనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశా. కానీ వారికి సిగ్గు లేదు. అందుకే ఈ రోజు సోమిరెడ్డి మీరే పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా కలిసి కొత్త పార్టీని, ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాయి... అని బాలినేని పేర్కొన్నారు.
No comments:
Post a Comment