దేశంలోని చిన్న వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే రిటైల్ ఎఫ్‌డీఐ నిర్ణయాన్ని తమ పార్టీ ఎంతమాత్రం సమర్థించదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో మేకపాటి పాల్గొన్నారు. సమయాభావం కారణంగా అనేక పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చర్చలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభించలేదు. అయితే.. స్పీకర్ మీరాకుమార్ మాట్లాడుతూ, వక్తల జాబితాలో చోటిచ్చిన వారందరూ తమ ప్రసంగాలను సభకు సమర్పించాలని, వాటన్నింటినీ సభలో చేసిన ప్రసంగాలుగానే పరిగణిస్తామని స్పష్టంచేశారు.
ఈ మేరకు పలు ఇతర పార్టీల ఎంపీలతో పాటు మేకపాటి తన ప్రసంగాన్ని సభకు సమర్పించారు. కోట్లాది మంది ఉపాధితో ముడిపడిన అంశం ఇదని, ఈ నిర్ణయం కోట్లాది చిన్నవ్యాపారులు, రైతుల పొట్టకొడుతుందని ఓ నిజమైన ఆందోళన అత్యధిక శాతం ప్రజల్లో ఉందని, ఎఫ్‌డీఐ విధానాన్ని ప్రకటించే ముందు ఈ ఆందోళలన్నింటినీ తొలగించి ఉండాల్సిందన్నారు. తయారీ, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాల రంగాల్లో ఎఫ్‌డీఐలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని తాము స్వాగతిస్తామన్నారు. ఎఫ్‌డీఐ అమలైతే దేశంలో గుత్తాధిపత్యం వస్తుందన్నారు. ఆయన ఉదయం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి చూస్తున్నాం.. ఎలా దోపిడీ చేస్తున్నారనేది. మోనోపలి చేశాక అన్ని విధాలా ఇబ్బంది ఉంటుంది’’ అని అన్నారు.
No comments:
Post a Comment