- ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పోయింది మీ పార్టీకే
- అఖండ మెజారిటీలు సాధిస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్
- ఎవరి పార్టీ పని అయిపోయినట్లు?
- మీ పార్టీ ఎంపీలు ఢిల్లీలో రోజుకొక మంత్రిని ఎందుకు కలుస్తున్నారు?
- బాబుపై సీబీఐ విచారణ ఆపుకోవటానికే కదా?
హైదరాబాద్, న్యూస్‌లైన్: అన్ని విధాలా పార్టీ ప్రతిష్ట పలుచబడుతున్న తరుణంలో ఆఖరి అస్త్రంగా చేపట్టిన పాదయాత్ర కూడా విఫలమయ్యేటప్పటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు రాజకీయ పిచ్చి పట్టిందని, అందుకే ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. తాను చేపట్టిన పాదయాత్ర పూర్తిగా వెలవెలపోతుండటంతో నిరాశా నిసృ్పహలకు లోనైన బాబుకు దిక్కుతోచటం లేదని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో డిపాజిట్లు పోయింది నీ పార్టీకి.. కొన్ని నియోజకవర్గాల్లో ఐదారు వేల కన్నా ఎక్కువ ఓట్లు రాని పరిస్థితి నీ పార్టీది.. ప్రజాభిమానంతో అఖండ మెజారిటీలు సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఎవరి పనైపోయినట్లు అనుకోవాలి? ఏమిటీ మాటలు? బాబుకు పిచ్చి పట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు’’ అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తో కుట్ర పన్ని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని టీడీపీ అధినేత భావించారని.. కానీ ఆ ఆశలు ఫలించలేదని గట్టు పేర్కొన్నారు. జగన్ జైలులో ఉన్నా పార్టీ మాత్రం దేదీప్యమానంగా వెలుగొందటాన్ని బాబు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ‘‘అసలు ఎవరు ఎవరిని కలుస్తున్నారు? మీ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్ ఢిల్లీలో రోజుకొక మంత్రిని ఎందుకు కలుస్తున్నారు? బాబుపై సీబీఐ విచారణను ఆపుకోవటానికే కదా? అని ప్రశ్నించారు.
‘‘తిరుపతిలో వాహనాల్లో దొరికిన ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబువని తీసుకెళుతున్న వ్యక్తులు చెప్పినా దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు?’’ అని నిలదీశారు. ‘‘సాక్షాత్తూ తన ఇంట్లోనే కట్టలకొద్దీ డబ్బు దొరికిన ప్రస్తుత కేంద్రమంత్రి మాటేమిటి? బాహాటంగా దొరుకుతున్న నోట్ల కట్టలు ఎవరివి? ఆరోపణలు చేస్తున్నది ఎవరి మీద?’’ అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌టీఆర్ బతికి ఉండగా ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించి మానసిక క్షోభకు గురి చేసి మరణానికి కారకుడైన బాబు.. తనను ఉద్దేశించి ఎన్‌టీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజల ముందు చెప్పి, వాటి సీడీలను విడుదల చేసి ఉంటే బాగుండేదన్నారు.
జగన్ తప్పెలా అవుతుంది?
సుప్రీంకోర్టులో రాష్ట్ర మంత్రులు జీవోలకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. వాటి జారీ మంత్రివర్గ సమష్టి బాధ్యత అని చెప్పినపుడు ఇక జగన్ తప్పు ఎలా అవుతుందని గట్టు ప్రశ్నించారు. ‘‘అసలు ఈ జీవోలతో జగన్‌కు ఏం సంబంధం? ఆయనేమైనా ఏ చాంబర్‌లోనైనా కూర్చొని జీవోల్లో సంతకాలు చేశారా?’’ అని వ్యాఖ్యానించారు. జగన్‌ను జైలులో ఉంచాలనే దురుద్దేశంతోనే మంత్రులు అఫిడవిట్ దాఖలు చేయడానికి 9 నెలల సమయం తీసుకున్నారని విమర్శించారు.
No comments:
Post a Comment