ఈ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా ఈ చట్టం ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? వైఎస్సార్ గిరిజనుల కోసం 20 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు.. మూడేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం వారికి ఎంత భూమి పంపిణీ చేసిందో చెప్పాలి ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు కట్టించారా? అసలు మీరు వాళ్లకేం చేశారో చెప్పండి హాస్టళ్లలో విద్యార్థులు ఏం తింటున్నారు.. ఎలా ఉంటున్నారో ఒక్కసారైనా అలోచన చేశారా? ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబూ అంటే.. ససేమిరా అంటున్నారు షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 46, కిలోమీటర్లు: 640 ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘దళితులు, గిరిజనుల మీద ఈ సర్కారుకు ఈ రోజు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ప్రతిపాదించి హడావుడిగా అసెంబ్లీని సమావేశపరిచింది. ఇదంతా ఓ బూటకం.. ఎన్నికల కోసం కాంగ్రెస్ పెద్దలు ఆడుతున్న నాటకం. నిజంగా వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే రూ.వేల కోట్లు దారితప్పుతున్నా ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు ప్రవేశపెట్టడంలేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నిం చారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానిపై అవిశ్వాసం పెట్టకుండా కుమ్మక్కయిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరపున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 46వ రోజు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో సాగింది. దేవరకద్ర సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. వీరిపై ప్రేమ కాదు.. ఎన్నికల భయం.. ‘‘ఎన్నికలు ముందున్నాయని తెలిసే కాంగ్రెస్ పాలకులు ఈ సబ్‌ప్లాన్ చట్టం తేవాలని చూస్తున్నారు. దళితులు, గిరిజనుల మీద వీళ్లకున్నది ప్రేమ కాదు.. ఎన్నికలు వస్తున్నాయన్న భయం. వైఎస్ హయాంలో ఏ చట్టం లేకపోయినా ఆయనకు చిత్తశుద్ధి ఉంది కనుక ఎస్సీ, ఎస్టీల గురించి ఎంతగానో ఆలోచించారు. గిరిజనులకైతే 20 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు. అందులో ఒకే రోజు 3.30 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఇది దేశంలో మరెక్కడా జరగలేదు. పంచిన భూమిని సాగుకు అనుకూలంగా మార్చడం కోసం, ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి రోజుకు రూ.150 కూలి కట్టించారు. క్రైస్తవులను కూడా ఎస్సీలలో చేర్చాలని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. 17 లక్షల మంది ఎస్సీలకు వైఎస్సార్ రూ.1,100 కోట్ల రుణ మాఫీ చేశారు’’ అని షర్మిల వివరించారు. ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఏం చేసింది? ‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతమే మెస్ చార్జీలు పెంచారు. కానీ వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25% మెస్ చార్జీలను పెంచి ఆ మరుసటి సంవత్సరమే పెంపును 40% చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో ఎస్సీల కోసం రూ.85 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసి పంపిణీ చేస్తే వైఎస్సార్ హయాంలో రూ.530 కోట్ల విలువైన స్థలాలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ప్లాన్ ఉండాలని తొలిసారిగా తీర్మానం చేసిన వ్యక్తి వైఎస్సార్. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు 5 వేల మంది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు. ‘‘మూడు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఎంత సహాయం చేసిందని అడుగుతున్నాను. వాళ్లకేమైనా కొత్త ఇళ్లు కట్టిచ్చారా? ఈ మూడేళ్ల కాలంలో దళితులు, గిరిజనుల కోసం ఎంత భూమి పంపిణీ చేశారు..? ఇంతకుముందే పంపిణీ చేసిన భూమిని సాగులోకి తేవడానికి ఏమైనాప్రయత్నాలు చేశారా?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్కో హాస్టల్‌కు ఆరే సబ్సిడీ సిలిండర్లా? ‘‘ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? వాళ్లు తింటున్నారా? లేదా? అని ఒక్కసారైనా ఆలోచించిన పాపాన పోలేదీ ప్రభుత్వం. పైగా ఒక్కొక్క హాస్టల్‌కు ఏడాదికి ఆరు సిలిండర్లు మాత్రమే సబ్సిడీపై ఇస్తారట. ఈ పాలకులకు ఎస్సీ, ఎస్టీల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు’’ అని షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ ఎస్టీలకు ఉపాధి హామీ కింద రోజుకు రూ.150 ఇస్తే ఈ పాలకులు వాళ్ల శ్రమను దోపిడీ చేస్తూ.. సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు. ఆ పథకం కింద రూ.30 నుంచి రూ. 40 మాత్రమే ఇస్తూ.. రోజంతా కష్టం చేయించుకుంటున్నారని అక్కాచెల్లెమ్మలు చెప్తున్నారు’’ అని విమర్శించారు. ధరల ప్రభావం గురించి ఆలోచించారా? ‘‘డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు ప్రతీదీ పెంచి ఈ పాలకులు చోద్యం చూస్తున్నారు. ధరల పెరుగుదల అల్పాదాయం కలిగిన దళిత, గిరిజనుల మీద ఎంతటి తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఈ సర్కారు ఎప్పుడైనా ఆలోచన చేసిందా? మొన్నటికి మొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లాకు వచ్చారు. ఆ సందర్భంలో ‘అయ్యా..! సీఎం గారు మీరు 25 వేల మందికి పింఛన్లు తీసేశారు. వాటిని పునరుద్ధరించండీ’ అని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎస్సీ నాయకురాలు బాలమణెమ్మ ఒక వినతిపత్రం ఇవ్వబోతే.. ఆమెను, ఆమె అనుచరులను నాన్‌బెయిలబుల్ వారంటు కింద మూడ్రోజులు జైల్లో పెట్టారు. దళిత మహిళ అని కూడా చూడకుండా అక్రమంగా జైల్లో పెట్టడమేనా దళితులపై చూపించే ప్రేమ?’’ అని షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘మా పార్టీ వాళ్లను మాత్రమే కాదు. ఈ ప్రాంతానికి చెందిన ఆముదం రైతులు గిట్టుబాటు ధర కావాలని ధర్నా చేసినందుకు 40 మంది రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రజలను హింసిస్తోంది. వైఎస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ తూట్లు పొడుస్తోంది. అన్నం పెట్టే రైతన్నను కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. అవిశ్వాసం పెట్టి ఈ పాలకులను దింపవయ్యా చంద్రబాబు అంటే ససేమిరా అంటున్నారు’’ అని విమర్శించారు. ‘పాట’ కన్నీరు పెట్టింది... పల్లెకు పాటే ప్రాణం. కలుపు తీసినా పాటే.. కష్టమొచ్చినా పాటే.. కడుపు మండినా పాటే. ఆ పాటలో చెమట చుక్కల ఉప్పదనం ఉంటుంది.. పైరు పంటల పచ్చదనం ఉంటుంది. ఆకలి కేకల బాధా ఉంటుంది.. ఆప్తులను పోగొట్టుకున్న వ్యథా ఉంటుంది. కాలే కడుపు కైగట్టి రాగమెత్తితే పాలకుల గుండెలు అదరాల్సిందే. కానీ ఆదివారం పాలమూరులో ఆ పాటే కన్నీళ్లు పెట్టింది. ‘రాజన్న మళ్లీ నాకు కనిపించలేదక్కా’ అని గుక్కపెట్టి ఏడ్చింది. ఆ పాట పాడింది రమాదేవి. ఈ పేరు వింటే పాలమూరు జిల్లా ప్రజలకు గుర్తొచ్చేది పాటే. ప్రాంతీయ ఉద్యమంలో.. ప్రభుత్వ కార్యక్రమాలలో ఆమె పాటకు ఓ ప్రత్యేకత ఉంది. షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు సంబంధించి ప్రజలను జాగృతం చేయడం కోసం ఆమె పల్లెల్లో తిరిగి పాటలు పాడుతున్నారు. ఆదివారం లాల్‌కోట గ్రామం వద్ద రమాదేవి షర్మిలను కలిశారు. షర్మిలను చూడగానే ఆమెలో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. బిగ్గరగా గుక్కపెట్టి ఏడ్చింది. గద్గద స్వరంతోనే ‘రాజన్న కూతురు షర్మిలక్కా.. వచ్చెరా మన పల్లెకు’ అంటూ ఆమె పాటకు పల్లవి అందుకుంటే జనం వంతపాడారు. ఆమె పాటకు పక్కనే ఉన్న వై.వి.సుబ్బారెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. షర్మిల స్పందిస్తూ...‘పాలమూరు జిల్లా కళలు, కళాకారులకు పుట్టిళ్లు.. నాన్న మీద మీరు చూపిస్తున్న అభిమానానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం’ అంటూ రమాదేవి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. వైఎస్ వచ్చాక రూ. 2.30 లక్షల రుణం మాఫీ... ‘నేను రైతును. నాకు సహకార బ్యాంకులో రూ.1.80 లక్షలు, ఆంధ్రా బ్యాంకుల రూ.50 వేలు అప్పుండే. అప్పులు కట్టమని బ్యాంకోళ్లు ఇబ్బంది పెట్టిండ్రక్కా. వైఎస్సార్ రాగానే నా అప్పంత మాఫీ జేసిండు. నేను వికలాంగుడినని నెలకు రూ.500 పింఛన్ కూడా ఇచ్చిండు. వైఎస్సార్‌తోనే కాలం పోయిందక్కా.. రైతులు అప్పుల పాలయినరు.. మళ్లా జగనన్న వస్తేనే రైతులు బాగుపడతారు’ అని లాల్‌కోట గ్రామానికి చెందిన కావలి కృష్ణయ్య షర్మిల వద్ద అన్నారు. త్వరలోనే జగనన్న వస్తారని, రాజన్న పాలన మళ్లీ అందిస్తారని షర్మిల ఆయనకు భరోసా ఇచ్చారు. కాగా ఆదివారం ఉదయం లాల్‌కోట శివారు నుంచి మొదలైన యాత్ర బందర్‌పల్లి, రాకొండ స్టేజీ, గోప్లాపూర్ మీదుగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి చేరింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రి 7.45 గంటలకు షర్మిల బసకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం ఆమె 15.50 కి.మీ. నడిచారు. ఇప్పటి వరకు యాత్ర 640 కి.మీ. పూర్తయ్యింది. |
Sunday, 2 December 2012
అసలు మీరు వాళ్లకేం చేశారో చెప్పండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment