YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 12 August 2012

రెండుగా చీలిన కాంగ్రెస్!

తెలంగాణ కాంగ్రెస్ నేతకు ముఖ్యమంత్రి పదవిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి చేసిన అభివృద్ధిపై శే్వతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిఎల్పీలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు రాజ్యసభ మాజీ ఎంపి కేశవరావుకు లేదన్నారు. కెకెను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని, కెసిఆర్, జైపాల్‌రెడ్డి, కెకె కలిసి కిరణ్ ప్రభుత్వాన్ని దించేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. కెసిఆర్ ఏజెంట్‌గా కెకె అని, కాంగ్రెస్ భవిష్యత్‌కు చేటు చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జైపాల్ ఢిల్లీలో కూర్చుని రాజకీయాలు చేస్తారని, సిఎం కిరణ్ సోనియా ఆదేశాలతో రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రనేతలతో సమైక్యాంధ్రవైపు, తెలంగాణ నేలతో తెలంగాణకు అనుకూలంగా జైపాల్ మాట్లాడుతున్నారన్నారు. జైపాల్ ఎప్పుడూ తెలంగాణ డిమాండ్ చేయలేదని, ఈ ప్రాంత రైతు ప్రయోజనాలపై మాట్లాడలేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఎప్పుడైనా కేంద్రాన్ని ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నించాలని, ఏడాదిన్నరలో ఎన్నికలున్న సమయంలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తెలంగాణను కేంద్రం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్భ్రావృద్ధికి ఏమీచేయని జైపాల్, ఇప్పుడు కిరణ్ ప్రభుత్వంలో పుల్లలు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులు కోరుతూ కేంద్రానికి సిఎం లేఖ రాయడంలో తప్పు లేదన్నారు. తెలంగాణలోనూ రెండు గ్యాస్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనలో ఉన్నాయని, పెట్రోలియం శాఖ మంత్రిగా వీటికి గ్యాస్ కేటాయించాలని జైపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కోరడంలో తప్పేముందన్నారు. గ్యాస్ కేటాయింపుల కోసం సాధికారత కమిటీ ఉన్నా, ఆ కమిటీలో రాష్ట్రానికి గ్యాస్ కేటాయించాల్సిందేనని జైపాల్‌రెడ్డి ఎందుకు ఒత్తిడి తీసుకురాకూడదని ఆయన ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పనిచేసే తరుణంలో సిఎంను విమర్శించడం తగదని కాంగ్రెస్ నేతలను కోరారు.
...................
సిఎల్పీ వేదికగా నేతల పరస్పర విమర్శలు
నిన్న సిఎంపై భగ్గుమన్న యాదవరెడ్డి, ఆమోస్ నేడు జైపాల్‌పై విప్ జగ్గారెడ్డి నిప్పులు
అర్థరాత్రి నగరానికి వచ్చిన వయిలార్
హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాల్లో కాంగ్రెస్ నేతలు రెండుగా చీలిపోయారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష (సిఎల్పీ) కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకోరాదని నిషేధం విధించినప్పటికీ, సిఎల్పీనే వేదిక చేసుకుని కాంగ్రెస్ ముఖ్యులు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్ శనివారం సిఎల్పీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా, దీనికి ప్రతిగా ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఆదివారం అదే సిఎల్పీలో విలేఖరుల సమావేశం నిర్వహించి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, తెలంగాణ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తప్పించాలన్న ఏకసూత్ర కార్యక్రమంలో వారు నిమగ్నమయ్యారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. రాష్టమ్రంత్రులు కూడా కొందరు కిరణ్‌కు, మరికొందరు జైపాల్‌రెడ్డికి అనుకూలంగా చీలిపోయారు. ఒకవిధంగా చెప్పాలంటే అటు సిఎం వర్గం, ఇటు కేంద్రమంత్రి వర్గం అన్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి యాభైయ్యవ వివాహ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వయలార్ వచ్చారు. రవిని కలిసేందుకు పలువురు ముఖ్యనేతలు ప్రయత్నించినా, ఆయన రాక ఆలస్యం కావడంతో కలవకుండానే వెనుతిరిగారు. సోమవారం ఉదయమే వయలార్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా అధిష్ఠానవర్గం ప్రత్యేక దూతగా రాష్ట్రానికి వయిలార్ వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను మళ్ళీ వయలార్‌కే అధిష్ఠానం అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వయలార్‌తో భేటీ అయ్యేందుకు పలువురు ముఖ్యనేతలు చేసిన ప్రయత్నం, ఆయన రాక ఆలస్యం కారణంగా విఫలమైంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిని రవికి వివరించాలన్నది నేతల యత్నం. అలాగే, రాష్ట్రంలో మార్పులు జరగనున్నాయని చెబుతున్న నేపథ్యంలో, వయలార్ ద్వారా అధిష్ఠానం మనసు ఏమిటన్నది తెలుసుకోవాలన్నది కొందరి ఆలోచన. అయితే వయలార్ రాక ఆలస్యం కావడంతో, నేతల ప్రయత్నాలు ఫలించలేదు.
ఇదిలావుంటే, పార్టీ కష్టకాలంలో ఉన్న పరిస్థితిలో కీలకస్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రం అవుతుండటం పట్ల కాంగ్రెస్ నేతలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని వారంటున్నారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షునికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగేదని, ఇటీవల ఇది సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైందని వారంటున్నారు. కీలకస్థానాల్లో ఉన్న వ్యక్తులే ఈవిధంగా వ్యవహరిస్తే, కిందిస్థాయిలోని నాయకులు, కార్యకర్తలకు చెప్పేవారు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు.

1 comment:

  1. It is their party. They have all the rights to make as many oieces as they want. It is working under the able leadership of Sonia Gandhi, the supremo.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!