బాపట్ల (గుంటూరు), న్యూస్‌లైన్:
తన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో చెప్పినా ఆయన వైఖరిలో మార్పులేదని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. 2004, 2009 ఎన్నికలలో తన సామాజిక వర్గానికి టీడీపీలో చోటు దక్కలేదన్నారు. గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని బాబుతో చెప్పినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అనుచరులందరూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని, వారి అభీష్టం మేరకు ఈ నెల 24వ తేదీన ఆ పార్టీలో చేరనున్నట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు. సోమవారం బాపట్లలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర మంత్రిగా, పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసినప్పటికీ తనకు టీడీపీలో సభ్యత్వమే లేకుండా పోయిందని చెప్పారు. తనకు పదవులు అయాచితంగా రాలేదని, టీడీపీ కోసం తాను పడిన కష్టానికే ప్రతిఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఎదుగుతున్నారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఈనెల 23న ఆయనతో ములాఖత్ అవుతున్నానని, 24న బాపట్లకు వస్తానని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఆయన కుమార్తెగా షర్మిల ప్రజల్లోకి వె ళుతున్నప్పుడు వారు చూపుతున్న ఆదరణే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. సమావేశంలో ఉమ్మారెడ్డి తనయులు వెంకటరమణ, వీరగణేష్, వీరేంద్రకుమార్, టీడీపీ నాయకులు కొండారెడ్డి అనిల్‌కుమార్, నరాలశెట్టి శ్రీరామమూర్తి, కొండలరెడ్డి, పులంశెట్టి శ్రీను, గండికోట వెంకట్రావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment