YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 23 November 2012

ఈ ప్రభుత్వం పెట్టదు. మేం తినం. మళ్లీ ఆ దేవుడే రావాలె

వైఎస్ మరణం తర్వాత వరదల్లో సకలం కోల్పోయిన టుంబాలు

పాదయాత్ర మార్గమధ్యంలో వారిని కలిసిన షర్మిల
మూడేళ్లవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితుల ఆవేదన
వారి దుస్థితి చూసి చలించిపోయిన షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్సార్ మరణం తరువాత జలరాశులు రాకాసులై ఊళ్లమీద పడ్డాయి. ప్రళయ కృష్ణమ్మ ఉప్పొంగి ఊళ్లను, నీళ్లను ఏకం చేసింది. కట్టుకున్న బట్టలు తప్ప సకలం గంగపాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం రోడ్డున పడ్డారు. అప్పటి జల ప్రళయానికి ఎదరురొడ్డి ప్రాణాలు నిలబెట్టున్న వరద బాధితులు ఇప్పుడు మానవత్వం లేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నారు. ఉన్న గూడు పోయి మూడేళ్లుగా నరకం చూస్తున్నారు. ఇదీ.. 2009లో మహబూబ్‌నగర్ జిల్లాలో వచ్చిన కృష్ణా, తుంగభద్ర నదుల వరద బాధితులు దుస్థితి. ఆదుకోవాల్సిన పాలకులు తమకేమి పట్టనట్లు గాలికి వదిలేయడంతో.. వారు నీడ దొరికిన చోట గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు బయటి ప్రంపంచానికి తెలియకుండా చీకటిలోనే మగ్గిపోతున్న వారి బతుకులు షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’తో వెలుగులోకి వచ్చాయి.

కంపచెట్ల మధ్యే జీవితం..

మహబూబ్‌నగర్ జిల్లాలోని నాటి వరద బాధితుల్లో కొందరు అలంపూర్ నియోజకవర్గంలోని కలుకుంట్ల, శాంతినగర్ గ్రామాల మధ్య వ్యవసాయ భూముల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం షర్మిల అటుగా వస్తున్నారని తెలిసి.. బాగా చీకటి పడిన తరువాత కూడా ఆ గుడారాల్లోని ఓ వృద్ధ దంపతుల జంట దీపపు బుడ్డీ పట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నారు. వారి పేర్లు జమ్మన్న, నర్సమ్మ. షర్మిల తన కోసం ఎదురుచూస్తున్న వారిని చూసి.. ‘‘బాగున్నావా తాతా?’’ అంటూ పలకరించారు. ‘‘ఏం బాగమ్మ..! నాయిన పోయినంకా దిక్కూదివాణం లేదు. పట్టించుకున్నోడే లేడు’’ అని సమాధానం వచ్చింది. ‘‘కండ్లు కనపడవు బిడ్డా.. నువ్వొస్తున్నవని అంటే పడిగాపులు గాసుకుంటా కూసున్నా.. జర ఇసుంటా రా బిడ్డా.. నా ఇల్లు జూసి పోదువు’’ అని ఆ తాత షర్మిలను ఆహ్వానించాడు. 

కంపచెట్ల మధ్య మూడు గుడారాలు వేసి ఉన్నాయి. వాటిని చూసిన షర్మిల అవాక్కయ్యారు. ‘‘ఇక్కడెందుకు ఉంటున్నారన్నా?’’ అని గుడారంలోకి తొంగి చూస్తూ.. అందులో నివాసం ఉంటున్న వారిని అడిగారు షర్మిల. ‘‘మాది మద్దూరు అమ్మా! ఏరు పొంగి ఇళ్లు కొట్టుకపోయినయి.. ఆలుమగలం కట్టపడి సంపాయించుకున్నదంతా ఏట్లనే కొట్టుకుపోయింది. ఇప్పటికీ మూడేళ్లు గడిచిపోయింది. వరద వచ్చినపుడే మీ లాంటోళ్లు ఇచ్చిన గుడారాలు ఇక్కడ తెచ్చి వేసుకున్నాం. సర్కారు నుంచి ఈసం కూడా సాయం రాలేదు. ఈ మూడేళ్ల నుంచి పంటలు చేతికి రాలేదు. అప్పటి నుంచి ఈ గుడారాల కిందనే ఉంటున్నామమ్మా!’’అని సుంకన్న, శంకరమ్మ దంపతులు తమ గోడు చెప్పుకొచ్చారు.

పాములొచ్చి.. పిల్లల కాళ్లకు సుట్టుకుంటున్నాయి..

పక్కనే మరో గుడారంలో ఉన్న సోమన్న దంపతులు కూడా షర్మిల వద్దకు వచ్చారు. ‘‘అమ్మా..! మంచిగ బతికినోళ్లం. ఇప్పుడు బతికి చెడుతున్నాం.. పొద్దుగూకితే పాములు గుడారాలకు వస్తాయి. పిల్లల కాళ్లుకు కూడా సుట్టుకున్నాయి’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్ల మాటలు షర్మిలను తీవ్రంగా కలచివేశాయి. ‘‘సకలం కోల్పోయిన వారిని ఆదుకునే తీరు ఇదా? ఈ పాలకులకు మానవత్వం లేదా?’’ అని షర్మిల మండి పడ్డారు. మీ సమస్యను అమ్మకూ, పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పి అసెంబ్లీలో చర్చించేయత్నం చేస్తాననగా.. ఆ వృద్ధ దంపతులు జమ్మన్న, నర్సమ్మ కల్పించుకొని ‘‘వద్దమ్మా.. పెట్టే దేవుడే ఎళ్లిపోయినాడు. ఈ ప్రభుత్వం పెట్టదు. మేం తినం. మళ్లీ ఆ దేవుడే రావాలె.. జగనన్నకు ఓటేస్తాం.. అప్పుడే మా బాధలు తీరుతాయి’’ అని వారనడంతో షర్మిల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తరువాత షర్మిల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడుతూ.. ‘‘నాన్న చెప్పాడు చిన్నాన్నా.. మన ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని! పస్తులైనా ఉంటారుగాని ఇది మాకు కావాలని అడగరని చెప్పారు. నిజం చిన్నాన్నా.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. మా కుంటుంబం మీద ఇంత విశ్వాసం పెట్టుకున్న వీళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!