YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 23 November 2012

గడువు దాటి ఒక్క రోజు జైల్లో ఉంచినా అది చట్టవిరుద్ధమే

సీబీఐ కోర్టులో జగన్ వాదన
బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి... తీర్పు 28వ తేదీకి వాయిదా 
అరెస్టు చేసి 90 రోజులు దాటినా చార్జిషీట్ దాఖలు చేయలేదు
కాబట్టి, నిబంధనల ప్రకారం బెయిలివ్వాలి 
గడువు దాటి ఒక్క రోజు జైల్లో ఉంచినా అది చట్టవిరుద్ధమే 
చట్టబద్ధంగా ఉన్న హక్కు కాలరాయడమే 
సెక్షన్ 167(2) కింద స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ ఈ కోర్టులోనే వేయాలి
సీబీఐ కోర్టులో జగన్ తరఫున న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు 
రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా

‘సుప్రీం’లో వేసిన పిటిషన్‌కు ఈ సెక్షన్ వర్తించదు...

‘‘సెక్షన్ 167 (2) కింద జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేనే లేదు. ఆయన ఏ కేసులో అయితే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఆ కేసు విచారణ అప్పటికే పూర్తయింది. మొదటి చార్జ్‌షీటు ఆధారంగా జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అందువల్ల ఆ బెయిల్ పిటిషన్ ఈ సెక్షన్‌కు వర్తించదు. 

సెక్షన్ 167 (2) కింద బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కోర్టులో మాత్రమే దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద బెయిల్ కోసం పై కోర్టులను ఆశ్రయించటానికి వీలు లేదు. అందువల్ల ఈ సెక్షన్ కింద జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లిందీ లేదూ.. సుప్రీంకోర్టు తిరస్కరించిందీ లేదు.’’ 
- సెక్షన్ 167 (2)పై పద్మనాభరెడ్డి వాదన

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 28న తీర్పు వెలువడనుంది. తనను అరెస్ట్ చేసి 90 రోజులు దాటిపోయిందని, ఈ లోగా చార్జిషీటు వేయటంలో సీబీఐ విఫలమైంది కాబట్టి తనకు చట్టబద్ధంగా బెయిలు మంజూరు చేయాలని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో వాదప్రతివాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు వినిపించగా, సీబీఐ తరఫున బళ్లా రవీంద్రనాథ్ వాదించారు. 

ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన బెయిలు 

పిటిషనర్ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ ఏడాది మే 27న అరెస్టు చేశారని, ఇప్పటికి దాదాపు ఆరు నెలలు కావస్తోందని, సీఆర్‌పీసీలోని సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజుల్లో గనక దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీటు వేయకపోతే.. నిందితుడికి తప్పనిసరిగా బెయిలు ఇవ్వాల్సి ఉందని పద్మనాభరెడ్డి వాదించారు. ‘‘గడువు ముగిశాక తనకు ఈ సెక్షన్ ప్రకారం బెయిలివ్వాలని అడిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. దీన్ని భూమ్మీద ఏ శక్తీ నిలువరించలేదు’’ అని పద్మనాభరెడ్డి ఉద్ఘాటించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన ఈ కేసులో జరిగిన వ్యవహారాల క్రమాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘‘ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ చెప్తున్న ఏడు అంశాలూ కొత్తవేమీ కావు. దర్యాప్తు చేస్తున్నపుడు బయటపడిన అనుబంధ అంశాలూ కావు. 

అవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నవే. సాండూర్ పవర్, భారతి సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, సూట్‌కేస్ కంపెనీలు, ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లపై దర్యాప్తు చేస్తున్నామని మే 28న కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కూడా సీబీఐ స్పష్టంగా పేర్కొంది. దానర్థం దర్యాప్తు అధికారులకు మొదటి నుంచీ ఆ అంశాలు తెలుసు. వాటిపై గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయకపోతే దర్యాప్తు సంస్థ విఫలమైనట్లే. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి చట్టబద్ధంగా బెయిలు అడిగే హక్కు ఉంటుంది. ఆ హక్కును ఉపయోగించుకోగలిగేది ఈ కోర్టులోనే. అందుకే పిటిషన్ వేశాం. పిటిషనర్ ఇప్పటిదాకా ఆ హక్కును ఉపయోగించుకోలేదు. పిటిషనర్ ఈ హక్కును ఉపయోగించుకుని బెయిల్ అడిగాక నిరాకరించటానికి వీల్లేదు. అలా నిరాకరించి జైల్లో ఉంచితే చట్ట విరుద్ధంగా ఉంచినట్లే లెక్క’’ అని పద్మనాభరెడ్డి కోర్టుకు విన్నవించారు. తొలి చార్జిషీటుకు సంబంధించి (సీసీ-8) జగన్‌ను అరెస్టు చేశారని, తరవాత రెండవ, మూడవ, నాలుగవ చార్జిషీట్లకు సంబంధించి ఆయన వద్ద తగు ష్యూరిటీలు తీసుకుని బెయిలు మంజూరు చేశారని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. 

సుప్రీంలో ప్రస్తావనకే రాలేదు 

వాదనల సందర్భంగాను, తను వేసిన కౌంటర్‌లోను సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ ప్రముఖంగా ప్రస్తావించింది. దర్యాప్తు ముగిసేదాకా బెయిలుకు అర్హులు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటూ బళ్లా రవీంద్రనాథ్ వాదించారు. దీన్ని ముందే ప్రస్తావించిన పద్మనాభరెడ్డి.. సుప్రీంకోర్టులో ఈ స్టాట్యుటరీ బెయిలు ప్రస్తావనకే రాలేదని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టులో బెయిలు దాఖలు చేసేనాటికి 90 రోజుల గడువు పూర్తి కాలేదు. అందుకని దీన్ని ప్రస్తావించే అవకాశం లేకపోయింది. పెపైచ్చు ఈ బెయిలు దాఖలు చేయాల్సింది కింది కోర్టులోనే’’ అని స్పష్టంచేశారు. 

అరెస్టు అన్ని అంశాలకూ వర్తిస్తుంది

జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన అనంతరం సీబీఐ కోర్టులో హాజరు పరచగా.. చార్జిషీట్లు దాఖలు చేసిన అనంతరం కస్టడీకి ఇవ్వటం సరికాదంటూ కోర్టు కొట్టివేసిన సందర్భాన్ని పద్మనాభరెడ్డి గుర్తుచేశారు. ‘‘దీనిపై సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు చివరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కొన్ని అంశాల్ని స్పష్టంగా పేర్కొంది. సీబీఐ ఎన్ని చార్జిషీట్లు దాఖలు చేసినా.. ఎఫ్‌ఐఆర్‌లోని ఒక నేరానికి సంబంధించి అరెస్టు చేస్తే దాన్లో పేర్కొన్న అన్ని నేరాలకు గాను అరెస్టు చేసినట్లే భావించాలని జస్టిస్ చంద్రకుమార్ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిప్రకారం ఎఫ్‌ఐఆర్‌లోని అన్ని అంశాలకూ సంబంధించి జగన్‌ను అరెస్టు చేసినట్లే. కాబట్టి ఆయన్ను అరెస్టు చేసిన 90 రోజుల్లోగా సదరు అంశాలన్నిటిపై చార్జిషీటు వేయాల్సిన బాధ్యత సీబీఐకి ఉంది. అలా వేయకపోతే నిందితుడికి చట్టప్రకారం బెయిలిచ్చి తీరాలి’’ అని పద్మనాభరెడ్డి వాదించారు. జస్టిస్ చంద్రకుమార్ ఉత్తర్వుల్ని సీబీఐ ఎక్కడా సవాలు చేయలేదు కాబట్టి, వాటికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ‘‘ఆ ఉత్తర్వుల్ని సీబీఐ ఎక్కడా సవాల్ చేయలేదు. మరి అంగీకరించినట్లే కదా? గడువులోగా దర్యాప్తు పూర్తి చేయనప్పుడు అది దాని వైఫల్యమే కదా?’’ అని పేర్కొన్నారు. బెయిలును అడ్డుకోవటానికే సీబీఐ వరసగా అన్ని చార్జిషీట్లు వేసిందని జగన్ తరఫున వాదించిన మరో న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవి వేధింపులు తప్ప మరొకటి కావన్నారు. తాము కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నామని సీబీఐ చేస్తున్న వాదనను కొట్టిపారేశారు. 

ఒకే వ్యక్తిపై వేర్వేరు చోట్ల కేసులుంటే

‘‘ఒక వ్యక్తిపై సీబీఐ హైదరాబాద్‌లో, ముంబైలో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసిందనుకోండి. హైదరాబాద్ కేసులో 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసేసింది. ముంబై కేసులో మాత్రం నిర్దిష్ట గడువులో అంటే అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయలేదు. చార్జిషీటు దాఖలు చేసేసిన హైదరాబాద్ కేసులో పై కోర్టులు వివిధ కారణాలతో బెయిలివ్వలేదు. ముంబై కేసులో చార్జిషీటు దాఖలు చేయలేదు కనక 167(2) కింద చట్టబద్ధ బెయిలు అడిగే హక్కు ఉంటుంది. అయితే హైదరాబాద్ కేసులో మీకు బెయిలు రాలేదు కనక ముంబై కేసులో 167(2) వర్తించదని ఎవరైనా చెప్పగలరా? చట్టబద్ధంగా ఉన్న హక్కును కాదనగలరా?’’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలను కిందికోర్టులు పాటించాల్సిందేనన్న సీబీఐ వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ఏ సందర్భానికి, ఏ అంశానికి పరిమితమైనదో చూడాలి. ఆ అంశానికి, సందర్భానికి మాత్రమే పరిమితం చేయాలి’’ అని పేర్కొన్నారు. 

సుప్రీం తీర్పుకు విరుద్ధం: సీబీఐ 

ఏడు అంశాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని, ఈ అంశాల్లో దర్యాప్తును పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదించారు. సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం ఈ కోర్టును తప్పుదోవపట్టించడమే అవుతుందని, కోర్టుధిక్కరణ కూడా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వినిపిస్తున్న వాదనలు సుప్రీంకోర్టులోనూ వినిపించారని చెప్పారు. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును కింది కోర్టులు విధిగా పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువైపులా వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. 

రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై 28న విచారణ 

ఇదిలావుంటే.. కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించిన సీసీ-8లో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సీఆర్‌పీసీ సెక్షన్ 437 కింద దాఖలు చేసిన (రెగ్యులర్) బెయిల్ పిటిషన్‌పై తర్వాత వాదనలు వినిపిస్తామని సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. 

ఇదేమీ తీవ్రమైన శిక్షలు పడే కేసు కూడా కాదు..

‘‘మరణశిక్ష లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే కేసుల్లో మినహా ఇతర కేసుల్లో 90 రోజుల తర్వాత నిందితుడిని జైల్లో ఉంచరాదు. ఒక్క రోజు జైల్లో ఉంచినా అది చట్టవిరుద్ధమే. చట్టబద్ధంగా నిందితుడికున్న హక్కులను కాలరాయడమే. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నా పూచీకత్తు తీసుకుని ఈ కోర్టు బెయిల్ ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.’’ 

సీబీఐ సత్వరం విచారణ పూర్తి చేస్తామని చెప్పింది

‘‘జగన్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన సీసీ-8లో మేం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. ఆ సందర్భంగా సత్వరం దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ న్యాయవాది పరాశరన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కోర్టులో ఉన్న సీబీఐ ఎస్‌పీ అక్కడ సుప్రీంకోర్టుకూ హాజరయ్యారు. ఆయనను అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. మేం కోర్టును తప్పుదోవపట్టిస్తున్నామన్న సీబీఐ వాదనలో అర్థం లేదు.’’ 
- జగన్ బెయిల్ పిటిషన్‌పై పద్మనాభరెడ్డి వాదనలు

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!