YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 24 November 2012

మా పాప పంపిన ఏడు మెసేజ్‌లు...

ఇంకో రెండు రోజులు పోతే జగన్‌ను అరెస్టు చేసి ఆరు నెలలు అవుతుంది. ఇంకొక నెల గడిస్తే మా పండగ క్రిస్మస్ వస్తుంది. రెండు రోజుల క్రితం వేయవలసిన 5వ చార్జిషీట్‌లో 167 కింద బెయిల్ పిటిషన్ సీబీఐ కోర్టులో వేశాము. ఆరోజు నేను కోర్టులో వుండగా మా పాప నాకు ఫోన్‌లో ఏడు మెసేజ్‌లు పంపింది.

‘మనము గెలిచామా’
‘గెలిచామా అమ్మా’
‘డాడీకి బెయిల్ వచ్చిందా’
‘వచ్చిందా అమ్మా డాడీకి’
‘ప్లీజ్ చెప్పు అమ్మా’
‘చెప్పు అమ్మా’
‘ప్లీజ్...’


నేను బయటకు వచ్చి చూసుకున్నాను. నేను, నా బిడ్డలే కాదు... ప్రసాద్ అన్న భార్య ఆశ, వాళ్ల పిల్లలు, సునీల్ భార్య తేజ, వాళ్ల అబ్బాయి... ఇలా ఒక రాజగోపాల్ భార్య పిల్లలు కానివ్వండి, మోపిదేవి భార్య పిల్లలు కానివ్వండి... అసలు తప్పు జరిగిందో లేదో తెలియకుండా, రాజకీయ ప్రయోజనాలకోసం ఇన్ని కుటుంబాలను కన్నీటిపాలు చేయడం ఒక సభ్యసమాజంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఇంతమంది కళ్లముందు జరుగుతూ వుంది. ఇంతమంది పెద్దమనుషులు ఈ రాక్షస క్రీడను ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఆమోదించని పెద్దలు, ప్రజలు ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ వున్నారు.

ఈరోజు నేను సీబీఐని, రాజకీయ నాయకులను, పత్రికా యజమానులను, టీవీ ఛానెల్స్ అధిపతులను చేతులు జోడించి ఒక్కటే వేడుకుంటున్నాను - దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దండీ - మా భర్తలతో పోరాడాలనుకుంటే వాళ్లను బయట పెట్టుకుని పోరాడండి. అంతేకాని, వాళ్లను లోపలపెట్టి మాతో ఎందుకు మీ పోరాటం? పాపం, పుణ్యం తెలియని మా పిల్లలు ఏం చేశారని వాళ్లను ఈరోజు మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దారినపోయేవారు ఏదో అభియోగం మోపారని, తను అనుకున్న దారిలో నడవాలని నా భర్త అనుకున్నాడని, ప్రజాభిమానం కూడగట్టుకున్నాడని, తన తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్నాడని... ఇంతగా మమ్మల్ని మానసికంగా హింసించటం ఎంతమాత్రం సరైనదో మీరే ఆలోచించండి. పెద్దలు చెబుతూ వుంటారు - ఒకరిని బాధపెట్టి మనం సంతోషపడలేమని. మరి మమ్మల్ని బాధపెట్టి, మీరు అనుకున్న తీరాన్ని చేరగలరా? సంతోషాన్ని పొందగలరా?

రాజకీయ నాయకులైనా, పత్రికాధిపతులైనా, టీవీ ఛానెల్స్ అధిపతులైనా, సీబీఐ అధికారులైనా, న్యాయాధిపతులైనా మీరు వుండేది మంచి సమాజ నిర్మాణం కోసం కాదా! ఒకరి హక్కులకు భంగం కలిగించాలనో, ఒకరిని అన్యాయంగా ఇరికించాలనో, అబద్ధాలు మాట్లాడి, ఉన్నవి లేనివీ రాసి, మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారా మీరు మంచి సమాజాన్ని నిర్మించగలరా? పనికి వచ్చే పనుల మీద, మంచితనం మీద, మానవత్వం మీద, సమానత్వం మీద ధ్యాస పెట్టండి. ప్రసాద్‌గారికి, జగన్‌కు, మోపిదేవికి ఒక రూలు, ల్యాంకో రాజగోపాల్ తమ్ముడు శ్రీధర్‌కు, ధర్మానకు, మిగతా మంత్రులకు, చంద్రబాబుకు ఒక రూల్ పెట్టడం ద్వారా సమసమాజం నిర్మిస్తున్నామని, న్యాయం చేస్తున్నామని అనగలరా? ఎందుకీ వివక్ష? ఎందుకీ అన్యాయం? 

దయచేసి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. దేనికోసం నిలబడ్డారో ఆలోచించుకోండి. ఈలోకం గుండా వెళ్తూ వెళ్తూ మన వెనుక ఏమి విడిచి వెళ్తున్నామో ఆలోచించండి. మంచిని, మానవత్వాన్ని, న్యాయాన్ని, సభ్యతను భావితరాలకు, మీ సొంత పిల్లలకు ఇచ్చి వెళ్లండి. అంతేకాని, మాలాంటివాళ్లకు కన్నీటిని, వేదనను, అన్యాయాన్ని, కష్టాన్ని విడిచి వెళ్లకండి. చేతనైతే ఒకరికి సహాయం చెయ్యండి. అంతేకాని ఇతరులకు చేటు చేయకండి. ఇకముందైనా మీ మూలంగా మాలాంటి వాళ్ల హక్కులు హరించబడకుండా, జీవితాలు ఒడిదుడుకులకు లోనుకాకుండా, మా పిల్లలు వేదనకు గురికాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.

- వైఎస్ భారతి
w/oవైఎస్ 
జగన్








http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53140&Categoryid=11&subcatid=25



No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!