* మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం లేదు
* చట్టబద్ద సంస్థలపై రాజ్యాంగ సంస్థలదే అధిపత్యం
* మంత్రివర్గ నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడం కుదరదు
* మంత్రివర్గ నిర్ణయాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని ఇదివరకే హైకోర్టు విస్పష్ట ప్రకటన
* విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం మంత్రివర్గానిదే
* చట్టసభలు, ప్రభుత్వాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది
మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలపై సీబీఐ కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తోందని, చరిత్రలో మొదటి సారి బిజినెస్ రూల్స్‌కు వక్రభాష్యం చెపుతోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. మంత్రి మండలి నిర్ణయాలు తీసుకునే హక్కును కాపాడటమంటే చట్టసభలను, ప్రభుత్వాన్ని రక్షించుకోవడమేన ని సీబీఐ కేసు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి అభిప్రాయపడ్డారు. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా న్యాయవ్యస్థ తీసుకునే చర్యలకు వ్యతిరేకంగా మంత్రి మండలిని, కార్యానిర్వహక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
వాన్‌పిక్ కేసులో ధర్మానను నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ గత ఆగస్టు 14న మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి విదితమే. వాన్‌పిక్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామే తప్ప... మంత్రిగా ఒక్క అంగుళం భూమి కూడా కేటాయించే అధికారం తనకు లేదంటూ ఎనిమిది పేజీల నివేదికను సీనియర్ మంత్రులకు ధర్మాన శుక్రవారం అందజేశారు. మంత్రులకు ఇచ్చిన నివేదికలో ఆయన సీబీఐ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. చట్టబద్ధసంస్థల కంటే రాజ్యాంగసంస్థలే ఉన్నతమైనవని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం చట్టబద్ధ సంస్థలకు లేదని కుండబద్దలు కొట్టారు. గతంలో హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన నివేదికలో వివరించారు.* భారత రాజ్యాంగ ప్రకారం మంత్రిమండలి అధికారాన్ని వినియోగిస్తుంది. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థ చట్టబద్ద సంస్థ మాత్రమే. సీబీఐ ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ఏర్పాటైంది. చట్టబద్ద సంస్థపై రాజ్యాంగ సంస్థకే అధికారం ఉంటుంది. అందువల్ల మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడానికి వీల్లేదు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం విధాన నిర్ణయాలు చేయడంలో మంత్రిమండలిదే అత్యున్నతస్థానం. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు మంత్రిమండలి సలహాలు ఇస్తుంది. అదే ఆర్టికల్‌లోని సెక్షన్ రెండు ప్రకారం మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలను గవర్నర్ అడగానికి వీల్లేదు. మంత్రివర్గ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ తన విచక్షణతో వ్యవహరించలేరు. గవర్నర్‌కు మంత్రివర్గం ఇచ్చే సలహాలను ఏ కోర్టులోనూ విచారించడానికి వీల్లేదు.
* ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్ చేయడానికి మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా కాని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కిందకాని, భారత శిక్షాస్మృతి కిందగాని ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.
* భూ కేటాయింపులు చేసే అధికారం మంత్రిగా ధర్మాన ప్రసాదరావు కానీ, ముఖ్యకార్యదర్శిగా శామ్యూల్‌కు కానీ లేవనే అంశాన్ని సీబీఐ విస్మరించింది. బిజినెస్ రూల్స్‌లోని నిబంధన 9 ఆర్/డబ్ల్యూ, నిబంధన 15 ప్రకారం భూ కేటాయింపు చేసే అధికారం కేవలం మంత్రిమండలికి మాత్రమే ఉంది. బిజినెస్ రూల్స్ రెండో షెడ్యూల్ ప్రకారం అన్ని భూ కేటాయింపు ప్రతిపాదనలు, మార్కెట్ ధర నిర్ణయాధికారం మంత్రిమండలిదే. మంత్రిమండలి ఆమోదం తరువాతే జీవోలు 1110, 1115, 233 జారీ చేశారు.
* వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు భూ కేటాయింపు మంత్రి మండలి చేసిందే తప్ప... ధర్మాన కానీ, శామ్యూల్ కానీ కాదు.
* వాప్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి కేటాయింపు చేయాలని ధర్మాన ప్రసాదరావు కానీ, శామ్యూల్ కానీ చేయలేదు. ఈ నిర్ణయం మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ (ఐ అండ్ ఐ) నిర్ణయం. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ధృవీకరించింది. ఐ అండ్ ఐ శాఖ మెమో నంబర్ 881(ఎ)/పోర్ట్స్.1(1)/ 2008 తేదీన ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు నోట్ పంపించారు. ఈ నోట్ వాన్‌పిక్ పోర్ట్స్‌కు కాకుం డా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు భూమి కేటాయించాలని సూచించింది.
* ఏ భూ కేటాయింపు అయినా ప్రభుత్వ ప్రయోజనానికి లోబడి జరగాలి. కేటాయించిన భూమిని సద్వినియోగం చేసుకోని పక్షంలో తిరిగి స్వాధీనం చేసుకోవడానికి బోర్డు స్టాండింగ్ ఆర్డర్ 24 కింద అధికారం ఉంటుంది.
* వాన్‌పిక్ ప్రాజెక్టు ఐ అండ్ ఐకి సంబంధించినది. ఐ అండ్ ఐ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మినహా రెవెన్యూ శాఖకు దీనితో ఏమాత్రం సంబం ధం లేదు.
* మంత్రిమండలి 2008 జూన్ 30న జరిగిన సమావేశంలో, ఆ తదుపరి మంత్రి మండలి సమావేశాల్లో తీసు కున్న నిర్ణయాలను అమలుచేయడం తప్ప... మం త్రులకు తెలిసిందే తప్ప ధర్మానకు ఈ అంశాలపై అదనంగా ఏమీ తెలియదు. అందువలన ఆయన కేబినెట్‌ను తప్పుదోవ పట్టించే సమస్యే తలెత్తదు.
* భూ కేటాయింపు ప్రతిపాదనలపై నిర్ణయాలు రాష్ట్ర బిజినెస్ రూల్ 8 ప్రకారం, సచివాలయ సూచనల ప్రకారం మంత్రివర్గం సమష్టిగా తీసుకున్నవే.
* మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు దురుద్దేశాలను ఆపాదించడం, నేరపూరితంగా చూడటం సరికాదు. మంత్రిమండలి తీసుకునే అన్ని నిర్ణయాలను కాపాడాల్సిన అవసరం ఉంది.
* ప్రభుత్వ వ్యవహారాలలో, పరిపాలనలో ఏవైనా పొరపాట్లు జరిగినా దానికి దురుద్దేశాన్ని ఏ చట్టం కింద కూడా ఆపాదించలేరు.
* ఫైళ్లపై సంతకాలు కేవలం విధి నిర్వహణలో భాగంగా చేసినవే తప్ప.. మరే ఇతర ఉద్దేశంతో చేసినవి కావు.
* రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు నిర్ణయం తీసుకోవడంలోకానీ ఉత్తర్వులు జారీచేయడంలోకానీ ఎలాంటి పాత్రలేదు. భూములు కేటాయించాలని కానీ, ప్రతిపాదనలు పంపించాలని కానీ ఎక్కడా చెప్పలేదు.
* వాన్‌పిక్ ప్రాజెక్టు ఐ అండ్ ఐలో రూపుదిద్దుకుంది. ఆ విభాగం అధికారులకు లబ్ధిదారు ఎవరు...ఎంత భూమి కావాల్సి ఉంటుంది? అనే విషయాలు ఆ శాఖ అధికారులకే తెలుస్తుంది. లబ్ధిదారుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది ఆ శాఖనే. రెవెన్యూ శాఖ పరిధి పరిమితం.
* భూ నిర్వాసితులకు నేరుగా నష్టపరిహారం చెల్లింపు లను ప్రసాదరావు లేదా శామ్యూల్ ఎక్కడా అనుమతించలేదు. ధర నిర్ణయించడానికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే జారీ చేయడం జరిగింది.
* నోట్‌ఫైల్స్ కానీ, భూ కేటాయింపునకు అనుమతించే విషయంలో కానీ, నమ్మకద్రోహం, నేరపూరిత ప్రవర్తన, మోసం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం చేయలేదనే విషయాన్ని సీబీఐ కావాలనే విస్మరించింది.
* మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను మాత్రమే ముందుకు పంపిం చడం తప్ప... ఒక వ్యక్తికి అనుకూలంగా ఉద్దేశపూర్వకంగా ఫైళ్లలో ఏవైనా అక్షరాలు తొలగించడం లేదా చేర్చడం చేయలేదన్న విషయాన్ని సీబీఐ కావాలనే విస్మరించింది.
* ఒక మంత్రి లేదా అధికారి వ్యక్తిగత హోదాలో తీసుకున్న నిర్ణయం కాకుండా మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం అవినీతి నిరోధకచట్టం కిందకు రాదని 2006లో హైకోర్టు ఓ కేసులో స్పష్టం చేసింది.
* మంత్రి మండలి తీసుకునే నిర్ణయాల్లో కొంతమంది లబ్ధిపొందినా దాని ఆధారంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదు.
* వాన్‌పిక్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఒక్క ఎకరా కూడా అప్పగించలేదు. వాన్‌పిక్ పేరిట సేల్ డీడ్ ఇవ్వలేదు. 4992 ఎకరాలకు సంబంధించి తహశీల్దార్ కేవలం భూ కేటాయింపు లేఖమాత్రమే ఇచ్చారు.
No comments:
Post a Comment