రాయలసీమ సేద్యపు నీటి,
తాగునీటి అవసరాల కోసం 1983 నుంచి నిరంతరాయంగా 2004 దాకా నిలకడగా సమస్యలపై సమరశం ఖం పూరించి ఉద్యమించిన నేత డాక్టర్ వైఎస్. రాయలసీమ ఉద్యమం ఒత్తిడికి తలొగ్గి స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ పొడిగింపులు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, గండికోట ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2004 దాకా ఈ పనులన్నీ నత్తనడకగా సాగిన సంగతి తెలిసిందే. గండికోట ప్రాజెక్టుకు రెండుసార్లు, హంద్రీ-నీవాకు రెండుసార్లు చంద్రబాబు శంకుస్థాపనలు చేసి తిలోదకాలు ఇవ్వడం, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనన్నది చెప్పనవసరం లేదు. సేద్యపునీటి ప్రాజెక్టులకు ఆయన ప్రాముఖ్యం ఇవ్వలేదు, ప్రాజెక్టులపై అతనికి విశ్వాసం అంతకంటేలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిల కన్నా కొంత భిన్నంగా విజయభాస్కరరెడ్డి పాలన సాగించినప్పటికీ హంద్రీ-నీవా ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన భాగస్వాములని చెప్పడం వాస్తవదూరం.
హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదలచేసే కార్యక్రమంలో అన్ని విలువలను పక్కన పెట్టి కేవలం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని సంతోషపెట్టడానికి విజయభాస్కరరెడ్డి పేరును కిరణ్‌కుమార్ ప్రస్తావించారు. రాయలసీమలోని మెట్ట ప్రాంతాల్లో సేద్యపునీటి అవసరాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించడానికి సాహసోపేతమైన నిర్ణయం తప్పదని తెలిసే వైఎస్ హంద్రీ-నీవా పథకాన్ని చేపట్టారు. పథకం చేపట్టే సమయానికి దేశంలోనే అత్యంత ఎత్తై ఎత్తిపోతల పథకం అది. దాదాపు 40 టీఎంసీల సామర్థ్యపు నీటిని శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తై మాల్యాల ప్రాంతానికి, అటునుంచి సీమలోని మిగతా జిల్లాలకు తరలించడానికి ఉద్దేశించిన పథకం ఇది. హంద్రీ-నీవా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిరణ్, వైఎస్ వ్యక్తిత్వంపై విషంచల్లే ప్రయత్నం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ, ఆయన తండ్రి అమరనాథ్‌రెడ్డి కానీ, 1983 నుంచి సీమ సేద్యపునీటి కోసం సాగిన ఉద్యమాలలో ఏనాడూ ఏ విధమైన పాత్రనూ నిర్వహించలేదు.
కిరణ్‌కుమార్‌రెడ్డిలో వైఎస్ కుటుంబంపై గుడ్డి ద్వేషం పేరుకుపోవడం సహజమే. కానీ అపర భగీరథునిలా తానేదో పవిత్రమైన కర్తవ్యం తన భుజాలమీద వేసుకొని యాత్ర చేపడుతున్నానని చెబుతున్న రఘువీరా కపట రాజకీయం గురించే మనం ఇక్కడ చెప్పుకోవాలి. రాయలసీమ ప్రాజెక్టులపై రఘువీరాకు ఏనాడూ ఆసక్తిలేదు. అధ్యయనం అంతకంటే లేదు. ఈ విషయం ఆయనే స్వయంగా ఎన్నోమార్లు బహిరంగంగా చెప్పుకున్నా రు. కానీ నిన్నటి రోజున కిరణ్ మాటలను రఘువీరా మౌనంగా భరించడం ఆయన కపట రాజకీయానికి పరాకాష్ట. హంద్రీ-నీవా రాజకీయ ఫలాల్ని తన సొంత ఖాతాలో వేసుకోవడానికి రఘువీరా నానాతంటాలు పడుతున్నారు. రఘువీరాకు హంద్రీ-నీవా మీద కించిత్తయినా ఆసక్తిలేదని చెప్పడానికి ఆధారాలు కొల్లలు.
అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా జలసాధన సమితి అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు ధరూరు పుల్లయ్య, ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ నాయకత్వంలో సీపీఐ, సీపీఎం, కొన్ని స్వచ్ఛందసంస్థలు, పౌరహక్కుల సంస్థలు తదితరులతో కలిసి పౌర సమాజం 2003-04లో అనేక పోరాటాలు జరిపింది. ఆ పోరాటాలలో రఘువీరా జాడ ఏనాడూ కనపడలేదు.
2004లో హంద్రీ-నీవా జలసాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్‌ను కలవడం జరిగింది. ప్రతినిధి బృందంలో ఓబుళ కొండారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం మాజీ శాసన సభ్యుడు కె.రామకృష్ణ, సీపీఎం ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. హంద్రీ-నీవా పథకం చేపట్టాల్సిన అవసరాన్ని ఈ బృందం ఆయనకు వివరించింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. సీనియర్ జర్నలిస్టు దామోదర్‌ప్రసాద్ ‘‘రాజశేఖరరెడ్డిగారూ... నేడు మీరు బడ్జెట్‌లో హంద్రీ-నీవాకు రూ.17 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఈ రకంగా మీరు హంద్రీ-నీవాను ఎప్పటికి పూర్తి చేస్తారు?’’ అని ప్రశ్నించారు. అందుకు వైఎస్ ‘‘ఛ... అలా జరగడానికి వీల్లేదే! అలా జరిగి ఉం డదే!!’’ అన్నారు. ‘దయచేసి మీరు రికార్డులు పరిశీలించండి’ అని బృందంలోని ఇతరులు సూచించారు. అందుకు ఆయన వెంటనే నాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి శర్మను ఫోన్లో సంప్రదించి ‘‘అదేమిటండీ శర్మగారూ... హంద్రీ-నీవాకు రూ.17 కోట్లే బడ్జెట్‌లో కేటాయించారా...! ఇదెలా జరిగింది? నేను ఎల్లుండి మడకశిరలో పర్యటిస్తున్నాను. అక్కడ నన్ను ఎవరైనా మీరు రూ.17 కోట్లు మాత్రమే కేటాయించారేమిటని అడిగితే నేనేమి సమాధానం చెప్పను? ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న పుల్లయ్య, సింగమనేనిలను మీ వద్దకు పంపుతున్నాను. వారితో చర్చించి నిధుల కేటాయింపు విషయం చూడండి’’ అన్నారు.
పౌరసమాజం ప్రతినిధి బృందానికే ఇంతటి ప్రాముఖ్యం ఇచ్చి నిధులు వెచ్చించిన రాజశేఖరరెడ్డి గారు... జిల్లాకు చెందిన ఆనాటి కేబినెట్ మంత్రులు బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడంపై ప్రశ్నించి ఉంటే స్పందించకుండా ఉండేవారా? మరి రఘువీరా ఆరోజు జిల్లా ప్రజలపట్ల, సీమపట్ల బాధ్యతగా ప్రవర్తించారా? మరో విషయం.. అనంతపురం జిల్లాకు తుంగభద్ర నుంచి 10 టీఎంసీల జలాలు కేటాయించడంపై ఆయనకు అభినందనలు తెలియజేయడానికి జిల్లాలోని దాదాపు 500 మంది సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైఎస్ అందరినీ పలకరించుకుంటూ అందరి ధన్యవాదాల్ని అంగీకరిస్తూ ఆనాటి నల్లమాడ శాసన సభ్యుడు కడపల మోహన్‌రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డప్పరెడ్డి దగ్గరకు వచ్చారు. ఆ పక్కనే ఉన్న నేను ‘‘అన్నగారూ... 10 టీఎంసీలు మా జిల్లాకు కేటాయించినందుకు మేము మీకు రుణపడి ఉంటాం. అలాగే మీరు స్టేజ్-2 హంద్రీ-నీవా పథకాన్ని తక్షణం ప్రారంభించండి. అనంతపురం జిల్లా ఎగువ ప్రాంతాలకు ఆ పథకమే శరణ్యం. అలాగే చిత్తూరు జిల్లాకు కూడా స్టేజ్-2 వరప్రసాదిని’’ అని విన్నవించగా... వెంటనే ఆయన వ్యక్తిగత కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డిని పిలిచి ఉన్న పళంగా టెండర్లు పిలవడానికి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. అప్పుడు ఆయన పక్కనే ఆనాటి జిల్లా మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, రఘువీరా, అనంతపురం ఎంపీ అనం త వెంకటరామిరెడ్డి ఉన్నారు. రెండోదశ హంద్రీ-నీవా పనులను చేపట్టవలసిందిగా వైఎస్‌కు రఘువీరా ఎప్పుడైనా సూచించారా? లేదు.
హంద్రీ-నీవా పథకానికి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 848 అడుగుల నుంచి తోడి పైకి తెచ్చే విధంగా తొలుత నిర్ణ యించారు. వాస్తవానికి 863 అడుగుల ఎత్తు నుంచి తోడితేనే హంద్రీ-నీవా సాకారం అవుతుంది. ఇది జరగాలంటే ఉరవకొండలో ఈ పథకానికి శంకుస్థాపన చేసేప్పుడే వైఎస్‌కు విన్నవించాలి. విజ్ఞాపన పత్రాన్ని వైఎస్‌కు ఇచ్చేందుకు వేదిక వద్ద పుల్లయ్య తదితరులు ఉన్నారు. ఇంతలో వైఎస్‌ను హెలిప్యాడ్ వద్దనే కలిసి సమస్యను వివరించవలసిందిగా హంద్రీ-నీవా జలసాధన సమితి ప్రతినిధి బృందం నన్ను ఆదేశించింది. పోలీసులు కల్పిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ నేను హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటున్నంతలోనే వైఎస్ నన్ను చూసి ‘ఆయనను నా దగ్గరకు తీసుకురండి!’ అంటూ పోలీసులను ఆదేశించారు. నేను నా చేతిలో ఉన్న విజ్ఞాపన పత్రాన్ని కొంత అలజడికి గురవుతూ ఆయన చేతిలో పెట్టి విషయం చెబుతున్నంతలోనే గ్రహించి ‘‘జరిగిన పొరపాటును ఇప్పుడే సభలో సవరిస్తూ ప్రకటన చేస్తాను... సరేనా!! ఆర్ యూ హ్యాపీ... ఓకే...’’ అన్నారు. మరి ఆయనతోపాటే హెలికాప్టర్‌లో కర్ణాటక నుంచి వచ్చిన రఘువీరా ఈ అన్యాయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు?
కడప, కర్నూలుజిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా 10 టీఎంసీల తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లాకు ఆ మహానుభావుడు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆదేశాలను తుంగలో తొక్కి 10 టీఎంసీల జీవోను పక్కనపడేసింది. అపర భగీరథయాత్ర చేస్తున్న రఘువీరారెడ్డికి దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నట్టా లేనట్టా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా తుంగభద్ర నుంచి మరిన్ని అదనపు జలాల కేటాయింపు జరిగేందుకు రాయలసీమ మంత్రిగా ఉండి ఆయన చేసిన కృషి ఏమిటి? ట్రిబ్యునల్ రివిజన్ పిటిషన్‌లో మనకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి రఘువీరా చూపించిన శ్రద్ధ ఏమైనా ఉందా?
2008లో హిందూపురంలో వైఎస్ ఓ బహిరంగసభలో మాట్లాడుతూ ‘‘అనంతపురం జిల్లాకు జలయజ్ఞంలో పూర్తి న్యాయం జరగలేదు. జిల్లాలో జలయజ్ఞం అమలుపరిచిన తరువాత కూడా సేద్యపునీటి వసతి 29 శాతం మేర మాత్రమే ఏర్పడుతుంది. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ నీటిపారుదల సౌకర్యం కలిగిన జిల్లాగా ఈ జిల్లా మిగిలిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో మన రాష్ట్రానికి అదనంగా నీటి జలాల కేటాయింపులు జరిగే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి అదనపు జలాలు కేటాయిస్తే వాటిని కచ్చితంగా అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలకు కేటాయిస్తాను’’ అని హామీఇచ్చారు.
వైఎస్ అపర భగీరథుడు, అభినవ కాటన్‌దొర అంటూ పొగడ్తలను గుప్పిం చిన రఘువీరా... నేడు జలయజ్ఞంపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న సవతితల్లి ప్రేమను ఎలా భరిస్తున్నారు? అవినీతి, అక్రమాల పేర వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు, కిరణ్‌కుమార్ అహోరాత్రాలు కలసి కట్టుగా కృషిచేస్తున్నారు. అందులో భాగంగానే కిరణ్, రఘువీరా, బొత్సలు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. అందుకు అద్దం పట్టేదే ఇటీవలి హంద్రీ-నీవా ప్రారంభోత్సవ ప్రహసనం.
రాష్ట్రంలో ప్రజలకు తమ నాయకులెవరో, తమ ప్రయోజనాల కోసం ఎవరు పోరాడుతారో తెలుసు. ఇడుపులపాయలో వైఎస్ శాశ్వత నిద్రలో ఉన్నారని భావిస్తున్న వారు, కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా నిలిచి ఉన్నారనే సంగతి గుర్తుంచుకుంటే మంచిది. చెట్టు వేర్లు సుదూరంలో ఉన్న నీటి దగ్గరకు భూమిని చీల్చుకుంటూ ఎలా చేరుకుంటాయో, ప్రజలు కూడా సప్తసముద్రాల అవతల ఉన్నప్పటికీ, జైళ్లలో ఉన్నప్పటికీ తమ నాయకులను చేరుకుంటారు. ప్రజలను నాయకుల నుంచి వేరు చేయలేరన్నది చరిత్ర నిగ్గుదేర్చిన సత్యం.
No comments:
Post a Comment