YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 22 November 2012

ప్రాణహిత-చేవెళ్ల వైఎస్‌ కల

*ప్రాణహిత-చేవెళ్ల ద్వారా ఈ ప్రాంతంలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది
*రాష్ట్రంలో ప్రాజెక్టులకు వైఎస్ రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.25 వేల కోట్లు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకే ఇచ్చారు
*కానీ వైఎస్‌మరణించాక ఆ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి వాటిని పూర్తి చేస్తానని జగన్ బాబు ప్రజలకు మాటిచ్చాడు
*జగన్‌గాని, వైఎస్ రాజశేఖరరెడ్డిగాని తెలంగాణకు వ్యతిరేకం కాదు 
*తెలంగాణ మట్టిపై ఒట్టేసి చెప్తున్నా.. ప్రతి ఇంటినీ జగన్ సంతోషంగా ఉంచుతాడు: షర్మిల
*చంద్రబాబు ఈ పనికిరాని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరేమని ప్రశ్న
*షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 36, కిలోమీటర్లు: 478.40


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల స్వప్నాల్లో ఒకటని, దాన్ని పూర్తి చేయాలని ఆయన ఎంతో తపించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుర్తుచేసుకున్నారు. వైఎస్ మరణించాక ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఆగిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వైఎస్సార్ మానసపుత్రిక. ఈ ప్రాంతంలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అది. వైఎస్సార్ ఉన్నప్పుడే దీనికి కేంద్ర జలసంఘం నుంచి సూత్రప్రాయ అనుమతులు తెచ్చారు. జలయజ్ఞం ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కలలుగన్నారాయన.వైఎస్సార్ వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ప్రజలను గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 36వ రోజు గురువారం కర్నూలు జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో అడుగిడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకం విజయమ్మ, షర్మిలకు ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మానవపాడు మండలం పుల్లూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ, షర్మిల మాట్లాడారు. విజయమ్మ ప్రసంగం ప్రారంభిస్తూ.. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన బిడ్డలకు నివాళులర్పించారు.

జగన్‌బాబు పూర్తి చేస్తానని మాటిచ్చాడు..

‘‘రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం వైఎస్ రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ఇచ్చారు. అలీసాగర్, గుత్ప, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. ఎల్లంపల్లి, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు సాకారం అయ్యే సమయంలోనే ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఇక అవి పూర్తికావడం అసాధ్యమని కొందరు అంటున్నారు. కానీ వాళ్ల నాన్న మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన పథకాలను పూర్తి చేస్తానంటూ జగన్‌బాబు ప్రజలకు మాటిచ్చారు. ప్రజలందరి మనుసులో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇంకా బయటే ఉంటే కాంగ్రెస్, టీడీపీల వాళ్ల ఆటలు సాగవని ఈ ఇద్దరూ కలిసి కుట్రలు చేసి జగ న్ బాబును జైల్లో పెట్టించారు’’ అని విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘ఇవాళ తను బయట ఉండి ఉంటే తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేసి ఉండేవారు. జగన్‌బాబు లోపల ఉండి కూడా ప్రజల గురించే ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. కన్నీళ్లు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా లేనట్లే. నిలదీయాల్సిన ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వంతోనే కుమ్మక్కయింది. ఆ రెండు పక్షాల వైఖరికి నిరసన తెలుపుతూ, ప్రజలను ధైర్యంగా ఉండమని, మంచికాలం ముందుంది అని చెప్పమని జగన్ తన సోదరి షర్మిలను మీ మధ్యకు పంపించారు’’ అని చెప్పారు.

తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్రమే..


‘‘వైఎస్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా.. మనిషిని మనిషిగా ప్రేమించారాయన. వైఎస్సార్ కాని, జగన్‌బాబు కానీ ఏ రోజూ తెలంగాణకు వ్యతిరేకం కాదని సభాముఖంగా తెలియజేస్తున్నా. తెలుగు ప్రజలంతా కలిసి ఉంటే బలంగా ఉంటాం.. అభివృద్ధి కూడా బలంగా ఉంటుందని వైఎస్ వ్యక్తిగతంగా ఆశించారు. కానీ ఎవరి మనోభావాలూ దెబ్బతినకూడదని కోరుకునే వ్యక్తి ఆయన. జగన్‌బాబు పార్టీ ప్లీనరీలో కూడా చెప్పాడు. తెలంగాణ ఇవ్వాలన్నా, వద్దనుకున్నా కేంద్రం చేతిలోనే ఉందని, కేంద్రం ఇస్తే తాము ఆపే వాళ్లం కాదని చెప్పాడు. తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే.. వాళ్ల మనోభావాలను గౌరవించాలని చెప్పి ఉప ఎన్నికల్లో జగన్‌బాబు ఆ ఆరు స్థానాల్లో పోటీ పెట్టలేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి బాటలు వేశారనే చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేయడంతోపాటు రూ.1200 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. ఇందులో ఎక్కువ భాగం తెలంగాణ ప్రాంత రైతులు లబ్ధిపొందారు. 23 లక్షల ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇస్తే అందులో 15 లక్షల కనెక్షన్లు తెలంగాణ ప్రాంత రైతులకే ఇచ్చారు’’ అని విజయమ్మ గుర్తుచేశారు.

ప్రాణ త్యాగాలు వద్దు.. అందరం కలిసి తెలంగాణను నిలబెట్టుకుందాం: షర్మిల

‘‘తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలకు నా సలాం.. నా పాదం మోపిన పవిత్ర తెలంగాణ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా.. ప్రతి తెలంగాణ ఇంటిని జగనన్న సంతోషంగా ఉంచుతాడు. నా అక్కలకు చెల్లెలకు, తెలంగాణసోదరులకు ఒక్క మాట చెప్తున్నా.. మీరు ప్రాణ త్యాగాలు చేసుకోవద్దు. మీ ప్రాణాలు ఇవ్వకుండా.. అందరం కలిసి తెలంగాణను నిలబెట్టుకుందాం’’ అని షర్మిల తెలంగాణ ప్రజలను కోరారు. ‘‘వైఎస్సార్‌కు తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఏ పథకం ప్రారంభించినా తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. జలయజ్ఞం, రూ.2 కిలో బియ్యం, రుణ మాఫీ, ఉచిత విద్యుత్తు, అన్ని పథకాలను ఆయన తెలంగాణ నుంచే ప్రారంభించారు. తెలంగాణ వాసులకు కూడా వైఎస్సార్ అంటే అంతే ప్రేమ. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడం తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది చనిపోతే అందులో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారు’’ అని షర్మిల గుర్తుచేశారు. ‘‘చనిపోయిన వారంత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లే. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజన్నా వాళ్ల ఇంటికి వెళ్లి చనిపోయిన కుటుంబాలను ఓదార్చకపోవడం దారుణం’’ అని విమర్శించారు.

తొమ్మిదేళ్లు పీడించింది చాలదా చంద్రబాబూ..

‘‘ఇవాళ చంద్రబాబు నాయుడు ‘మీకోసం’ అంటూ యాత్రలో బయలు దేరారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను పీడించింది సరిపోలేదట. ఇప్పుడు అధికారం ఇస్తే ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేస్తాడట.. వృద్ధులకు పింఛన్ ఇస్తాడట.. రైతులకు రుణాలు మాఫీ చేస్తాడట.. చంద్రబాబు నాయుడూ నీ మొసలి కన్నీళ్లు ఆపు. అవన్నీ వైఎస్సార్ ఎప్పుడో చేసి చూపించాడయ్యా..’’ అని షర్మిల టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. వైఎస్ పథకాలు తాను అమలు చేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు.. వైఎస్సార్ పరిపాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టి పోయిందని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ‘‘అయ్యా..! చంద్రబాబు నాయుడు గారు. మీ డ్రామాలు ఇక ఆపండి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మీరు అంటున్నారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం అంటున్నారు. మరి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించరేం?’’ అని షర్మిల ప్రశ్నించారు.

నాయకుడిని బంధించగలరేమో..
ప్రజల అభిమానాన్ని కాదు: కొండా సురేఖ


‘‘మాది పోరాటాల గడ్డ.. నమ్మిన మనిషి కోసం ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడని గడ్డ. అటువంటి రక్తం మాలో ప్రవహిస్తోంది కాబట్టే ఈ రోజు రాజశేఖరన్న కోసం, మీ(వైఎస్ కుటుంబీకుల) కోసం మంత్రి పదవి, శాసనసభ సభ్యత్వాన్ని వదులుకొని మీ వెంట నడుస్తున్నాం’’ అని మాజీ మంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగు పెట్టిన షర్మిలకు పుల్లూరు గేటు వద్ద సురేఖ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా గర్వంగా ఉంది. వైఎస్సార్ కుటుంబం విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ ప్రజలంతా వారి వెంట నడుస్తున్నారు. వైఎస్సార్ వల్ల పదవులు అనుభవిస్తూ ఆయన కుటంబానికి ద్రోహం చేస్తున్న నాయకులు సిగ్గుతో తలదించునే సందర్భం ఇది’’ అని అన్నారు. ‘‘ఈ పాలకులు కుట్ర చేసి ఈ రోజు అకారణంగా జగనన్నను జైల్లో పెట్టారు. వాళ్లకు ఒక్క మాట చెప్తున్నాను.. నాయకుడిని బంధిస్తారేమో కానీ ప్రజల అభిమానాన్ని బంధించలేరని చెప్తున్నాను’’ అని ఉద్ఘాటించారు.

కరెంటు బిల్లు కట్టలేకున్నాం...

‘‘పొద్దంతా కూలి పనికి పోతాం.. ఒళ్లలువ పనిజేసుకొని ఇంటికొచ్చి బుగ్గ (కరెంటు బల్బు) ఏస్తే కరెంటు ఉండదు. దీపం బుడ్డీ ఎలుగుల(వెలుతురు) వంటజేసుకుంటాం. రాత్రంతా దోమలు పీక్కతింటున్నాయి. ఫ్యాన్ వేసుకుందామంటే కరెంటు రాకపాయె.. కరెంటు బిల్లేమో వందలకు వందలు వస్తున్నాది. ఈ బిల్లు సూడక్కా రూ.388 వచ్చింది. రోజుకు నాకు పడే కూలి రూ.30. వచ్చిన కూలితో బిల్లు ఎట్టా కట్టను.. పిల్లలకు తిండిపెట్టి బడికి ఎట్టా పంపను. ఈ సర్కారు మీద మన్నుబోయ గింతనన్న సాయంగాట్లేదు. ఇంకా ఎన్నాళ్లక్కా! జగనన్న రావాలె’’ అని కర్నూలు జిల్లా సరిహద్దు గ్రామం మామిడాలపల్లి గ్రామానికి చెందిన రైతుకూలీ మహిళ తిమ్మక్క.. కరెంటు బిల్లు తీసుకొచ్చి షర్మిలకు చూపిస్తూ గోడు వెళ్లబోసుకుంది. ఇందులో విద్యుత్తు వినియోగం చార్జీ రూ.196 ఉంటే సర్దుబాటు చార్జీ రూ.192 ఉండటం గమనార్హం.

జగనన్న ఎప్పుడొస్తాడు బిడ్డా..

75 ఏళ్ల వృద్ధురాలు.. పేరు వెంకటమ్మ.. మామిడాలపల్లి ఊరు. రోడ్డు పక్కనే ఉన్న పొద్దుతిరుగుడు తోటలో కూలిపని చేస్తోంది. ఒంట్లో జవసత్వాలను కూడదీసుకొని జనాలను తోసుకుంటూ షర్మిల దగ్గరకు వచ్చింది. ఇంకెన్నాళ్లు అన్నను జైల్లో ఉంచుతారు? ఎప్పుడు బయటికి వస్తాడో చెప్పు బిడ్డా అంటూ బోరున విలపించింది. ఆమె మాటలకు షర్మిల కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘మీరే అన్నకు ధైర్యం అవ్వా.. త్వరలోనే బయటికి వస్తారు’ అని షర్మిల ఓదార్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!