YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 21 November 2012

మా సహనాన్ని పరీక్షిస్తున్నారు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ న్యాయస్థానాల ముందుకొచ్చినప్పుడల్లా కౌంటర్ దాఖలు చేయడంలో సీబీఐ కావాలనే జాప్యం చేస్తోందని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. 

జగన్‌పై సీబీఐ కక్ష సాధింపుతో వ్యవహరిస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తోందని, సీబీఐ వైఖరి ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందన్నారు. సీబీఐ విచారణల తీరూ తెన్నూ ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు తీవ్రంగా స్పందించడం ఖాయమన్నారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 

21వ తేదీన ఇందుకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ మరింత గడువు కావాలని కోరింది. దీంతో జడ్జి ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. సీబీఐ కావాలనే ఇలా చేస్తోంది. జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టుల్లో ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా కౌంటర్ వేయడానికి వ్యవధి కోరడం, ఐదు, పది రోజులు లేదా నెల రోజుల గడువు కావాలని అడగడం సీబీఐకి ఆనవాయితీగా మారింది. సాధ్యమైనంత జాప్యం చేసి తీరా పిటిషన్ విచారణకు వచ్చినపుడు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని సీబీఐ ప్రతిఘటిస్తోంది’ అని అంబటి అన్నారు. 

జైల్లో ఉంచాలనే దుర్బుద్ధితోనే..
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అని చెప్పుకుంటున్న సీబీఐ ఇంత దారుణంగా ప్రవర్తించడం దురదృష్టకరమని, బాధాకరమని అంబటి వ్యాఖ్యానించారు. ‘‘జగన్‌పై పెట్టిన కేసుల్లో పస లేదనేది కాంగ్రెస్, టీడీపీతో పాటుగా సీబీఐకి కూడా తెలుసు కానీ జగన్‌ను నిరంతరం జైల్లో పెట్టాలనే దుర్బుద్ధితోనే ఇలా చేస్తున్నారనేది ప్రజలకు అర్థమైంది. సీబీఐ ఇంత అధర్మంగా, అన్యాయంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు.

రాష్ట్ర ప్రజలు తగిన విధంగా తీవ్ర స్థాయిలో స్పందిస్తారు’’ అని అంబటి హెచ్చరించారు. అసలు సీబీఐ ఏమనుకుంటోంది? అదేమీ రాజ్యాంగేతర శక్తి కాదు, చట్టబద్ధంగా పనిచేయాల్సిన సంస్థే వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తోందని అంబటి దుయ్యబట్టారు. ‘‘జగన్‌పై వచ్చిన ఆరోపణలపై మూడు వారాల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినపుడు, మూడు వారాలెందుకు, రెండు వారాలు చాలంటూ ఆగమేఘాల మీద విచారించి 14 రోజులకే కోర్టుకు నివేదిక ఇచ్చిన సీబీఐకి జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం సమయం లేదా?’’ అనిసూటిగా ప్రశ్నించారు.

జేడీ మాట మార్చారు
సుప్రీంకోర్టులో జగన్ బెయిల్‌పై వాదనలు జరిగినపుడు మూడు నెలల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆ తర్వాత బయటకు వచ్చి మాట మార్చారని అంబటి తప్పుపట్టారు. ఫలానా తేదీలోగా విచారణ పూర్తి చేయాలని, చార్జిషీటును వేయాలని తమకు సుప్రీంకోర్టు నిర్దేశించలేదని ఆయన పత్రికల వారితో అన్నారని గుర్తుచేశారు. 

ఇదంతా చూస్తూంటే కాంగ్రెస్, టీడీపీ కలిసి పన్నుతున్న నీచమైన రాజకీయ కుట్రలో సీబీఐ భాగస్వామి అయిందనేది స్పష్టంగా తేలిపోతోందన్నారు. ‘‘జగన్ బయటకు వస్తే సాక్షులను బెదిరిస్తారు, ప్రభావితం చేస్తారు అని సీబీఐ పదే పదే చెబుతోంది. వాస్తవానికి ఆ పని చేస్తున్నది సీబీఐ వారే . సాక్షులను బెదిరించడం, తాము చెప్పినట్లుగా జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తే కేసు నుంచి బయట పడేస్తామని చెప్పడం లేకుంటే కేసులో ఇరికిస్తామని చెప్పడం చేస్తున్నది సీబీఐ మాత్రమే’’ అని ఆయన తూర్పారబట్టారు.

ద్వంద్వ విధానాలెందుకు?
రాజకీయ కుట్రలో భాగమైపోయిన సీబీఐ పూర్తిగా విచక్షణ కోల్పోయిందని, ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తోందని అంబటి విమర్శించారు. ‘‘ఒక మంత్రికి బెయిలే ఇవ్వొద్దంటారు, మరో మంత్రికి బెయిల్ ఇచ్చినా అభ్యంతరం లేదంటారు, ఒకే కేసులో ముద్దాయిలైన ఇద్దరి పట్ల వేరువేరుగా సీబీఐ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది?’’ అని ఆయన ప్రశ్నించారు.

జగన్ జైలుకు వెళ్లి ఆరు నెలలు కావస్తోందని, ఆయనేమైనా నేరం రుజువైన వ్యక్తా ఇన్ని రోజులు జైలులో ఉండటానికని సామాన్య ప్రజలంతా ప్రశ్నిస్తున్నారని, మేధావులు, న్యాయనిపుణులకు కూడా ఈ విషయం అర్థం కావడం లేదని అన్నారు. జగన్‌ను నిర్బంధించి రాజకీయ లబ్ధి పొందుదామని కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న ప్రయత్నం వికటిస్తుందని, ప్రజా న్యాయస్థానంలో వైఎస్సార్ సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 200 అసెంబ్లీ స్థానాలను తమ పార్టీ గెల్చుకుంటుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!