YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 20 November 2012

పేరు పెట్టిన వాళ్లు, కాగితాలకు పరిమితం చేసిన సీఎంల పేర్లు చెప్పారు

పేరు పెట్టిన వాళ్లు, కాగితాలకు పరిమితం చేసిన సీఎంల పేర్లు చెప్పారు 
కిరణ్ తూతూ మంత్రంగా పనులు చేసి తన జన్మ ధన్యమయిందన్నారు 
కానీ.. రూ. 3,600 కోట్లిచ్చి నిర్మాణం ప్రారంభించిన వైఎస్ పేరే ఎత్తలేదు 
2009 ఎన్నికల్లో హంద్రీ-నీవా ఎలైన్‌మెంట్ చూపించే కిరణ్ ఓట్లడిగారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సందర్భంగా జరిగిన సభలో.. ఈ ప్రాజెక్టు స్వప్నాన్ని సాకారం చేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావించక పోవటం దురదృష్టకరమని.. దీన్నిబట్టి ముఖ్యమంత్రికి ఏ మాత్రం ఇంగితం లేదనేది స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రాజెక్టుకు కేవలం పేరు పెట్టిన వాళ్లు, ఏళ్ల తరబడి ప్రాజెక్టు నిర్మాణాన్ని కాగితాలకే పరిమితం చేసిన మాజీ ముఖ్యమంత్రుల పేర్లను ప్రస్తావించి.. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన వైఎస్ పేరెత్తక పోవటం ముఖ్యమంత్రి కిరణ్ సంస్కారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గడికోట మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిత్య దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వైఎస్ హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయించి త్వరితగతిన నిర్మాణపనులు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. వైఎస్ బతికుండగానే ఈ ప్రాజెక్టుపై రూ. 3,600 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. 

నాడు వైఎస్ కృషిని ప్రశంసించారో లేదో చెప్పండి: 2009 ఎన్నికల సందర్భంగా కిరణ్.. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో హంద్రీ-నీవా కాలువల అలైన్‌మెంట్‌ను చూపించి ఓట్లు పొందారని, ఈ విషయాన్ని ఆయనే ఎన్నికల తరువాత చెప్పారని.. అలాంటి వ్యక్తికి వైఎస్ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ కృషిని అప్పట్లో కిరణ్ ప్రశంసించారో లేదో తన గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు పేరైతే ఎన్‌టీఆర్ పెట్టారు కానీ ఆ తరువాత ముందుకు తీసుకెళ్లలేక పోయారన్నారు. ఆ తరువాత వచ్చిన వారు కూడా దానిని పట్టించుకోకపోతే రాయలసీమ కోసం ఎంతో ధైర్యంతో వైఎస్ దీని నిర్మాణానికి సంకల్పించారని ఆయన వివరించారు. 

మీకు వైఎస్ పేరెత్తే అర్హతే లేదు: వాస్తవానికి వైఎస్ పేరును కిరణ్ ప్రస్తావించకపోవటం ఓ రకంగా తమకు సంతోషంగానే ఉందని కూడా శ్రీధర్ పేర్కొన్నారు. రాష్ట్ర రైతుల కోసం తపించి కోటి ఎకరాలకు లక్ష కోట్ల వ్యయంతో సాగునీరు అందించాలని సంకల్పించిన వైఎస్ పేరును సీబీఐ చార్జిషీటులో పెట్టటానికి కారణమైన వారికి.. ఆయన పేరెత్తటానికి కూడా అర్హత లేదన్నారు. తూతూ మంత్రంగా తొలి దశ పనులు పూర్తి చేసి తన జన్మ ధన్యమైందంటూ వైఎస్‌ను కాదని కిరణ్ చెప్పుకుంటే సరిపోదని ఆయన ఎద్దేవాచేశారు. ఒక ఎకరాకు సాగునీరు ఇవ్వాలంటే సుమారు రూ.2 వేలు ఖర్చు అవుతుందని, తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను కేవలం రూ.60 మాత్రమేనని లెక్కలు వేసి సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపని చంద్రబాబు కూడా ఇపుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని గడికోట ధ్వజమెత్తారు. బాబు తాను రాసుకున్న మనసులో మాట పుస్తకంలో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. రైతులన్నా, వ్యవసాయం అన్నా అటు బాబుకు, ఇటు కిరణ్‌కు ఇద్దరికీ తొలి నుంచీ చిన్నచూపేనని అందుకే వారి హయాంలో ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదని దుయ్యబట్టారు. 

కేశవ్‌ది ఆస్కార్ స్థాయి నటన: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తలకు అంతగా ఏడ్చి స్పందించాల్సిన అవసరం ఏముందని, ఆయన నటన ఆస్కార్ అవార్డు లభించే స్థాయిలో ఉందని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. తమ పార్టీలోకి రావటానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని.. అయితే తామెవ్వరినీ పిలవటం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఏదో అంటే కేశవ్ అంతగా స్పందించాల్సిన పని లేదని, బహుశా చంద్రబాబుకు భయపడిపోయి అలా వ్యవహరించి ఉండొచ్చన్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేయడానికి టికెట్లు ఇస్తే 70 శాతం మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల మనోభావాల మేరకే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని అంతే తప్ప ఎవరి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!