టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించి, పిచ్చికుక్కలా మొరుగుతున్నాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదికోట్లిస్తే పశువులకంటే హీనంగా పోతారని వైఎస్సార్సీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఆయన పైవిధంగా స్పందించారు.
సోమవారం గూడూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బాబు చెబుతున్న మాటలపై విశ్వసనీయత లేకే టీడీపీ ఎమ్మెల్యేలంతా వైఎస్సార్సీపీలోకి వచ్చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండే ఎమ్మెల్యేలను కోట్లరూపాయలిచ్చి కొంటున్నారని బాబు అంటున్నారని, వాస్తవానికి ప్రజల్లో వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానంతోనే ప్రస్తుతం వలసలు ప్రారంభమయ్యాయన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. అందుకే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారన్నారు. అంతేగాని ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోలేదన్నారు. కావాలంటే బాబు కాణిపాకం వినాయకుడి వద్దకు వస్తే, తామంతా అక్కడకు వచ్చి ‘మాకు డబ్బిస్తే వైఎస్సార్సీపీలోకి రాలేదు’అని ప్రమాణం చేస్తామన్నారు.
విశ్వసనీయతకు అర్థం తెలుసా బాబూ?
‘బాబూ నీకు విశ్వసనీయత అంటే ఏమిటో తెలుసా.. నీకు అది తెలిస్తే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మానసికంగా ఎన్టీఆర్‌ను హత్య చేసేవాడివి కాదు.. రాష్ట్ర ప్రజలంతా దేవుడిలా కొలిచే ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించావు. అప్పుడు నీవు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ముట్టచెప్పావు’ అని ప్రసన్న ప్రశ్నించారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలని లేదంటే ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే అవిశ్వాసం పెట్టు.. ప్రభుత్వాన్ని కూలదోస్తామని ప్రసన్న, బాబుకు సవాల్ విసిరారు.
No comments:
Post a Comment