YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 22 November 2012

బలిదానాలు వద్దు, తెలంగాణను నిలబెడదాం!

http://www.ysrcongress.com/news/top_stories/balidanalu_vaddu__telamgananu_nilabedadam_.html



పుల్లూరు (ఆలంపూర్ నియోజకవర్గం) 22 నవంబర్ 2012 : బలిదానాలు వద్దనీ, దేవుడిచ్చిన ప్రాణంతో తెలంగాణను నిలబెడదామనీ షర్మిల పిలుపు ఇచ్చారు. ప్రాణాలు తీసుకోబోమంటూ తనకు మాట ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణ అమరులకు ఆమె 'సలాం' చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా తెలంగాణలోకి అడుగుపెట్టిన షర్మిల గురువారం సాయంత్రం పాలమూరు జిల్లా పుల్లూరు వద్ద ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించారు. రాజన్నకూ, జగనన్నకూ తెలంగాణ అంటే ప్రాణమని, రెండు రూపాయల కిలో బియ్యం, పావలా వడ్డీ ఆరోగ్య శ్రీ వంటి పలు పథకాలను వైయస్ తెలంగాణ నుండే ప్రారంభించారనీ ఆమె గుర్తు చేశారు.
నా సలాం...
"ఉద్యమం కోసం తెలంగాణ బిడ్డలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నా సలాం. వారందరూ నా అన్నదమ్ములే. కానీ దేవుడిచ్చిన ప్రాణంతో తెలంగాణను నిలబెడదాం. మీ చెల్లెలిగా, మీ అక్కగా మిమ్మల్నందరినీ ఒక మాట అడుగుతున్నా. మీ ప్రాణాలివ్వద్దండి! మనందరమూ కలిసి తెలంగాణను బ్రతికించుకుందాం. నా పాదం తాకిన పవిత్రమైన తెలంగాణ ధూళి మీద ఒట్టేసి చెబుతున్నా...జగనన్నకు, రాజన్నకు తెలంగాణ అంటే ప్రాణం. ప్రతి తెలంగాణ ఇంట్లో ఉన్న కన్నీళ్లను జగనన్న తుడుస్తాడు. ప్రతి తెలంగాణ ఇంటినీ సంతోషంతో నింపుతాడు." అని షర్మిల అన్నారు.
"రాజన్నపై అభిమానంతో, జగనన్న మీద ప్రేమతో తరలి వచ్చిన తెలంగాణవాసులందరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది" అంటూ షర్మిల తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేసిన వైయస్ 24 లక్షల ఉచిత విద్యుత్తు కనెక్షన్లలో 15 లక్షలు తెలంగాణకే ఇచ్చారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డిగారికే కాదు,  నాన్నగారంటే తెలంగాణవాసులకూ అంతే ప్రేమ అన్నారు. నాన్నగారు చనిపోయినప్పుడు తట్టుకోలేక 660 గుండెలు ఆగిపోతే అందులో ఎక్కువ శాతం మంది తెలంగాణకు చెందినవారేనన్నారు. తెలంగాణవాసులంటే జగనన్నకు, రాజన్నకు ప్రాణమన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు తెలంగాణను అభివృద్ధి పరచి వెనుకబాటుతనాన్ని తొలగించాలని 'జలయజ్ఞం'లో తెలంగాణకే పెద్దపీట వేశారన్నారు.
రాజశేఖర్ రెడ్డిగారు చనిపోయినప్పుడు తెలంగాణవారే ఎక్కువమంది చనిపోగా, వారినెవరినీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు.

వైయస్ పేరును ఉచ్చరించే అర్హత కూడా వీరికి లేదు ...

"చనిపోయినవారంతా కాంగ్రెస్‌వారే. ఆ కుటుంబాలన్నీ కాంగ్రెస్‌కు ఓటు వేసినవే. కానీ ఇప్పటివరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. రాజశేఖర్ రెడ్డిగారు ఎంత పెద్ద మనసున్న నేతో తెలిసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తోంది. రాజశేఖర్ రెడ్డిగారి పేరుని ఎఫ్ఐఆర్‌లో దోషిగా చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిగారు అధికారమిస్తే, పదవులిస్తే అనుభవిస్తున్నవారు, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు, మంత్రులకు ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేరుస్తుంటే చీమకుట్టినట్లైనా లేకపోయింది. ఆ మనిషి ఇప్పుడు లేడే, సమాధానం చెప్పుకోలేడేనని కూడా ఆలోచించకుండా కనీస మానవత్వం లేకుండా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో  చేర్చారు. దీన్నంతా వేడుక చూసినట్లు చూశారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా గొంతెత్తి నిలదీయలేదు. రాజశేఖర్ రెడ్డిగారిని అభిమానిస్తున్నామంటున్నారే కానీ, పెదాలకు మాత్రమే పరిమితమయ్యే అభిమానం అభిమానమౌతుందా? రాజశేఖర్ రెడ్డిగారిని ఎఫ్ఐఆర్‌లో చేర్చిన ఈ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా రాజశేఖర్ రెడ్డిగారు మళ్లీ మా మనిషేనంటున్నది. నిజానికి వారికి రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు." అని షర్మిల మండిపడ్డారు.
"జగనన్న నాన్నగారు పోయినప్పుడు రాష్ట్రప్రజలంతా అనాథలై పోయారని తండ్రిలాగే వాళ్ల కష్టాలలో పాలుపంచుకున్నాడు. చేనేతలు, విద్యార్థుల వంటి వివిధ వర్గాల పక్షాన నిలచి పోరాటాలు చేశాడు. మీ మనసుల్లో జగనన్న స్థానం సంపాదించుకుంటే తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్, టిడిపి కలిసిపోయి కుట్ర పన్ని జగనన్నను బెయిలు కూడా రానివ్వకుండా జైలు పాలు చేశారు" అని ఆమె ఆరోపించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!