YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 19 November 2012

జగన్, మోపిదేవిలను అన్యాయంగా కేసుల్లో ఇరికించారు

డిసెంబర్9లోగా తెలంగాణపై ప్రకటన రాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ మంత్రులు కలసిరావాలి
మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని వివాదాల్లోకి లాగుతూ పదేపదే విమర్శలు చేస్తే సహించబోమని మాజీమంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మాజీమంత్రి మోపిదేవిని అక్రమంగా, అన్యాయంగా కేసుల్లో ఇరికించారని అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నల్లగొండలో సోమవారం ఆమె విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో మంత్రులందరికీ సమన్యాయం లేకపోవడం విచారకరమన్నారు. అవినీతి కేసుల్లో ఒక మంత్రికి ఒకవిధంగా, మరోమంత్రికి మరొక విధమైన న్యాయమా అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో ఉండిఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. 

ఓడిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2014 వరకు ఈ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. డిసెంబర్9లోగా తెలంగాణపై ప్రకటన రాకుంటే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు వెనుకాడనని స్పష్టంచేశారు. ఒకవేళ మాటకు కట్టుబడి ఉండకపోతే కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకమేనన్నారు. తెలంగాణ మంత్రులు ఇప్పటికైనా రాజీనామా చేసి ముందుకురావాలని సూచించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీట్ల కోసం కాకుండా తెలంగాణ లక్ష్యంగా పోరాడాలని హితవుపలికారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ తన సోదరుడైనప్పటికీ ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రజల అభిప్రాయాన్నే ఆయన వ్యక్తంచేసి ఉంటారన్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి జానారెడ్డి పూలమాలలవేసేందుకు ప్రయత్నించబోగా వెంకట్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్యకర్తలకు, మంత్రికి కొంతసేపు స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

ఎమ్మెల్యే సీటిచ్చి వైఎస్సారే గెలిపించారు: చిరుమర్తి

రామన్నపేట: పేద కుటుంబానికి చెందిన తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే సీటిచ్చి గెలిపించారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. సోమవారం ఆయన రామన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలు వైఎస్ చేసిన సేవలు మరువలేకపోతున్నారని తెలిపారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని వాడుకోవాలనుకోవడం సరికాదని, జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ఎలా వస్తుందో కేసీఆర్ ప్రజలకు వివరించాలని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు మంత్రులు రాజీనామా చేస్తే అప్పుడే తెలంగాణ వచ్చేదని, కానీ జిల్లాకు చెందిన నాయకులు మంత్రి పదవి కోసం క్యూ కట్టారని విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!