YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 24 November 2012

మానవత్వం లేని పాలకులు

కృష్ణా, తుంగభద్ర వరద బాధితులు మూడేళ్లుగా నరకం చూస్తున్నారు
వరదల్లో సర్వస్వం కోల్పోయి.. ఇప్పటికీ గుడారాల్లోనే బతుకుతున్నారు
పాములు, విషపు పురుగులతో కలిసి జీవనం సాగిస్తున్నారు
వీరందరికీ ఇళ్లు కట్టిస్తామని రోశయ్య ఇచ్చిన మాట ఏమైంది?
ఈ పాలకులకు ప్రజల అవసరం లేదు, ప్రజా సమస్యలూ పట్టవు
ఈ సర్కారుపై అవిశ్వాసం పెట్టి దించేయాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబుకు వినపడడం లేదు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 38, కిలోమీటర్లు: 507.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన ఏడాది కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి ఇళ్లు మునిగి పోయాయి. పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు సర్వం కోల్పోయారు. ముంపునకు గురైన వాళ్లను పరామర్శించడం కోసం అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఇక్కడకు వచ్చి ఇళ్లు కోల్పోయిన వారందరికీ వెంటనే కొత్త ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చారు. ఆయన హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ముంపు బాధితులకు కనీసం ఇళ్లు కాదు కదా.. గుడిసె కూడా వేయించలేదు. ఆ వేళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టికొని బతికిబయటపడ్డ వాళ్లంతా ఎక్కడో ఒక చోట గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. మూడేళ్లుగా నరకం చూస్తున్నారు. వాళ్లుంటున్న ప్రాంతం సురక్షితం కాదు. పాములు, విషపు పురుగులు చుట్టూ తిరుగుతున్నా వాటి మధ్యే కాపురాలు చేస్తున్నారు. అయ్యా..! కాంగ్రెస్ పాలకులారా... ఆ వేళ రోశయ్య ఇచ్చిన మాట ఏమయింది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. 

ఇంత మానవత్వం లేని వాళ్లా మన రాష్ట్రాన్ని పాలిస్తోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 38వ రోజు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా మార్గమధ్యంలో వరద ముంపు బాధితులు పలువురు షర్మిలను కలిశారు. ‘‘ముగ్గురు ఆడపిల్లల తల్లిని, వరదల్లో నా భర్త పోయాడు. రోడ్డు పక్కన గుడారం వేసుకొని ఉంటున్నాను. నాకు ఏ దిక్కూ లేకుండా పోయింది’’ అని ఉరుకుందమ్మ అనే మహిళ గోడు వెళ్లబోసుకుంది. తమ బతుకులు కూడా అలాగే ఉన్నాయని దుర్గమ్మ, మల్లయ్య తమ బాధలు చెప్పడంతో.. షర్మిల పై విధంగా స్పందించారు. 

ఈ పాలకులకు ప్రజల అవసరం లేదు..

షర్మిల శనివారం శాంతినగర్ నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడ బహింరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కేటాయించిన నిధులు ఈ ప్రభుత్వం విడుదల చేసి ఉంటే ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పూడికతీత పనులు పూర్తైపంట పొలాలకు నీళ్లు అందేవి. ఈ చేతగాని పాలకులకు ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడంతోనే ఆర్డీఎస్ ఎండిపోయింది. అన్నం పెట్టే రైతన్నకు ఇప్పుడు అన్నం లేకుండా పోయింది. వైఎస్సార్ సువర్ణయుగంలో రైతు రాజులాగా బతికారు. నాన్నగారు ఏ పని చేసినా.. ఆ పనితో ప్రజలకు మేలు జరుగుతుందా? లేదా? అని ఆలోచన చేసేవారు. ఈ పాలకులకు ప్రజల అవసరం లేదు, ప్రజల సమస్యలూ పట్టవు’’ అని విమర్శించారు. ‘‘తొమ్మిదేళ్లు పాలించి ప్రజల్ని పీడించిన చంద్రబాబుకు, ఇప్పుడు పాలిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి తేడా ఏమీ లేదు. ఇద్దరూ తోడు దొంగలే. చంద్రబాబు హయాంలో.. అప్పటికే పెన్షన్ పొందుతున్న వారు ఎవరైనా చనిపోతేనే కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చేవారు. అంటే పెన్షన్ రావాలంటే ఆ గ్రామంలో ఎవరైనా చనిపోవాలని కోరుకోవాలన్నమాట. అదే పరిస్థితి ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తోంది. వృద్ధులకు, వికలాంగులకు ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారు.. గ్యాస్ ధరను పెంచారు. సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి ఆరే ఇస్తారట. అంతకు మించితే రూ.1,000 పెట్టి కొనుగోలు చేయాలట.. ఇది మానవత్వం లేని పాలన కాదా?’’ అని షర్మిల అన్నారు.

మరో అవకాశం కావాలట..

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడుకు వినపడటం లేదు’’ అని షర్మిల టీడీపీ అధినేత తీరును ఎండగట్టారు.

500 కి.మీ. పూర్తయిన యాత్ర: షర్మిల శాంతి నగర్ నుంచి కొంకాల గ్రామానికి చేరడంతో పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తయింది. 38వరోజు ఆమె వెంకటాపూర్ వరకు మొత్తం 15 కిలోమీటర్ల యాత్ర చేశారు. వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శనివారానికి మొత్తంగా 507.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

షర్మిల యాత్రకు పలువురి సంఘీభావం

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: యాత్ర కొంకాల వద్ద 500 కి.మీ. పూర్తవడంతో షర్మిలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వేలాది మంది మహిళలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. జిల్లాలోని పలువురు నేతలతో పాటు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, వంగూరు బాలమణెమ్మ, ఎడ్మ కిష్టారెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్ తదితరులు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.

గిట్టుబాటు లేదక్కా...

‘‘మూడేళ్ల నుంచీ ఏం గిట్టుబాటు లేదక్కా.. అన్ని రేట్లూ పెరిగినాయి. కూలీ కూడా గిట్టటం లేదు. అప్పట్లో రూ.400 ఉన్న టన్ను బూడిద ఇప్పుడు రూ.700, అప్పుడు ట్రాక్టర్ కంకర రూ.8,000 ఉంటే.. ఇప్పుడది రూ.12,000, అప్పుడు రూ.600 ఉన్న ఇసుక రూ.1,200 అయింది. ఇంత ధర పెట్టి ఇటుకలు చేస్తే మార్కెట్‌లో కొనేటోళ్లే లేరక్కా.. రైతుల పరిస్థితి బాగా లేదు. మూడేళ్ల నుంచి పంటలు చేతికి అందటం లేదు. రైతు చేతికి పంట వస్తే ఇళ్లు కట్టుకుంటడు. అప్పుడు మాకు కూడా గిరాకీ ఉంటుంది. వాళ్లే అల్లాడిపోతుంటే ఇక మా దిక్కు ఎవరు చూస్తరు చెప్పక్కా..’’ అంటూ 26వ కాల్వ స్టేజ్ ప్రాంతానికి చెందిన ఇటుకల తయారీదారుడు వడ్డె వెంకటేష్.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. రైతులు బాగుపడాలంటే జగనన్నే సీఎం కావాలన్నాడు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని అతడికి ధైర్యం చెప్పిన షర్మిల.. ఇక్కడ కొద్దిసేపు ఇటుకల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఈ పనిలో ఉన్న కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=492919&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!