YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 23 November 2012

చంద్రబాబు సారుకు బహిరంగ లేఖ...

గౌరవనీయులైన చంద్రబాబు గారికి,

సార్, ఈమధ్యకాలంలో పేపర్‌లో మీ ప్రసంగాలు చదివినప్పుడు, టీవీలో మీ ప్రసంగాలు విన్నప్పుడు, నా భర్త తరచు అనే మాటలు నాకు గుర్తుకు వచ్చాయి- ‘ఈరోజు రాజకీయాల్లో విలువలు లేని పరిస్థితి చూస్తున్నాము’ అని. అదెంత నిజమో ఇప్పుడు తెలుస్తోంది! మీరు మీ ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపి నా భర్తకు రావాల్సిన బెయిల్‌ను అడ్డుకున్నారు. మీ నీచ రాజకీయాలకోసం సీబీఐతో, కాంగ్రెస్‌తో చేతులు కలిపి, మీ గోబెల్స్ ప్రచారకులను, కొన్ని ఎల్లో పత్రికలను, ఛానల్స్‌ను వాడుకుని, జగన్ మీద, మా కుటుంబం మీద మీరు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ కంటే అన్యాయంగా ప్లాన్స్ వేసి, నా భర్తను మా నుండి, మా పిల్లల నుండి, ప్రేమించే ప్రజల నుంచి ఎంతకాలం వీలైతే అంతకాలం దూరంగా వుంచాలని నిత్యం ప్రయత్నిస్తున్నారు. నా భర్తను జైలు లోపల వుంచి, ఆయన మీద ఎన్ని అబద్ధాలు వీలైతే అన్ని అబద్ధాలు మీరు, మీ గోబెల్స్ ప్రచారకులు, మీ ఎల్లో గ్యాంగ్ కలిపి ప్రచారం చెయ్యాలనుకుంటున్నారు.

ఒక మనిషి ఎదుట లేనప్పుడు ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడడం కుసంస్కారం అని మాకు తెలిసిన, మాకు నేర్పిన విలువలు సార్! మరి మీరు నిజాలు కాదు... ఆ మనిషి లేనప్పుడు ఏకంగా అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. అది మీ స్థాయికి, మీ వయస్సుకు తగదు సార్. మిమ్మల్ని ఎందరో ప్రజలు గమనిస్తున్నారు. మీ నుంచి భావితరాలు ఎన్నో నేర్చుకోవాలి. అందుకే ఇటువంటి విలువలు లేని రాజకీయాలను భావితరాలకు నేర్పకండి. ఇప్పటికైనా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం మానండి. మనిషి ఎదురుగా వున్నప్పుడు పోరాడితే అది ఒక సమఉజ్జీ పోరాటం అవుతుంది. అంతేకాని ఇలా దొడ్డిదారిగుండా ఒకరిని తగ్గించి, మనలను మనం పెంచుకోవాలనుకోవడం వీరుల లక్షణం కాదు సార్. అది నా దృష్టిలో పిరికివారు, నయవంచకులు, వెన్నుపోటుదారులు వాడే మార్గం సార్.

సార్, ఈరోజు మీరు నా భర్త స్థాపించిన వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. నా భర్త స్థాపించిన రెండు కంపెనీలు - భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్ రెండూ దేశంలోనే అగ్రగామిగా, మన రాష్ట్రానికి వన్నె తెచ్చేవిగా, ఈరోజు నిలిచాయంటే దానికి కారణం -దేవుని దయ, నా భర్త యొక్క అంకితభావం! 

ఈరోజు ఆ రెండు కంపెనీలు ఆధారంగా 30,000 పైచిలుకు కుటుంబాలు బతుకుతున్నాయి. మీకు జగన్ మీద, మా మామగారి మీద వుండే కక్షపూరితమైన మనస్సుతో ఈ 30,000 కుటుంబాలకు అన్యాయం చేసే నీచ రాజకీయాలు మానండి. 

సార్, తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒకానొకప్పుడు దేశ రాజకీయాలను నిర్దేశించిన వ్యక్తిగా, మన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష ముఖ్యనాయకుడుగా వున్న మీ ద్వారా ప్రజలకు, నాలాంటి ఈ రాష్ట్ర ఆడబిడ్డలకు మంచి జరగాలి కానీ, మీ మూలంగా నాలాగా ఏ ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో కన్నీరు పెట్టకూడదు సార్! నాలాంటి ఆడబిడ్డల కన్నీరు మీకు మంచిది కాదు... మన రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదని చెప్తూ...

వయస్సులోను, అనుభవంలోనూ మీకంటే చిన్నదాన్ని అయిన నేను రాయడం తప్పుగా భావిస్తే క్షమించమని కోరుతూ... 
విలువలుగల రాజకీయాల కోసం నా భర్త నిలబడినట్టుగా మీరు కూడా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.



yours sincerely,
Y.S. Bharathi.









source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!