‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘సాగు చేసి అప్పుల పాలైనాను. మూడేళ్ల నుంచి పంట చేతికి రాలేదు. పంట పండితే రేటు లేదు. నాకున్నది ఐదెకరాల భూమి. ఇప్పటిదాక 10 బోర్లు వేయించినా. రెండింట్లో నీళ్లు పడినాయి. మూడెకరాల్లో ఉల్లి, రెండెకరాల్లో పత్తి వేసినాను. కరెంటు లేక పంట మొత్తం పోయింది. వైఎస్సార్ ఉన్నప్పడు ఏటా రూ.40 వేలు మిగిలినయి. ఆయనతోనే కాలం పోయింది. మూడేళ్ల నుంచి రూ.3 లక్షలు అప్పయింది. నా అప్పులు తీరాలంటే నాకున్న భూమైనా అమ్ముకోవాలి. లేకుంటే జగనన్న ముఖ్యమంత్రైనా కావాలి. అప్పులకు భయపడి నేను ప్రాణాలు తీసుకోలేను అక్కా.. కలబడి జగనన్నను నిలబెట్టుకుంటా’’ అని సి.బెళగల్‌కు చెందిన ఉల్లిరైతు కుర్వ మిన్నెళ్ల.. షర్మిలతో ఉద్వేగంగా అన్నారు. మాది కూడా అదే పరిస్థితి అని అక్కడే ఉన్న రైతులు బోయ బీసన్న, బాలనాగన్న చెప్పారు.
32వ రోజు ఆదివారం పాదయాత్రలో భాగంగా ఉదయం కర్నూలు జిల్లా కాంపాడు నుంచి బయలు దేరిన షర్మిల సి.బెళగల్ శివారులోని ఉల్లిరైతులను పలకరించారు. అప్పటికే రైతులు నీళ్లులేక పంట ఎండిపోయిన ఉల్లిగడ్డలు తోడి బయటపోయడం చూశారు. ‘‘ఒక్క ఏడాది పాటు ఓపిక పడితే మీరు కోరుకున్నట్టే మీ జగనన్న వస్తారు. మళ్లీ రైతు రాజ్యం వస్తుంది’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి ఆమె బెళగల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. కదంతొక్కుతూ పాదయాత్రలో అడుగులు వేసేందుకు వేలాదిమంది ప్రజలు అక్కడకు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అక్కడి నుంచి పొలకల్ మీదుగా రాత్రి 7 గంటలకు జూలకల్లు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 420.90 కి.మీ. యాత్ర పూర్తయింది.
No comments:
Post a Comment