YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 13 September 2012

10 నుంచి 12% పెరగనున్న బస్సు చార్జీలు

- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు 
- 2,3 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ)పై డీజిల్ బాంబు పడింది. అసలే నష్టాలతో నెట్టుకొస్తున్న సంస్థను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా డీజిల్ ధరను లీటరుకు రూ. 5 చొప్పున పెంచటం ఆర్టీసీకి పిడుగుపాటుగా మారనుంది. ఈ పెంపు కారణంగా.. సంస్థపై ఏటా రూ. 340 కోట్ల భారం పడనుంది. ఈ నేపథ్యంలో తనపై పడే అదనపు భారాన్ని ప్రయాణికులపైకే మళ్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. తరుచూ ఇంధన ధరలు పెంచుతుండటం వల్ల వాటికి అనుగుణంగా బస్సు చార్జీలను కూడా సవరించాలని గతంలోనే ఆర్టీసీ నిర్ణయించింది. ఈ క్రమంలో చార్జీల భారాన్ని ప్రయాణికులపై వడ్డించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గత ఏడాది జూన్‌లో డీజిల్ ధరలు పెంచడంతో 8.68% మేర బస్సు చార్జీలను మోపిన ప్రభుత్వం.. ఇప్పుడు కూడా చార్జీల వడ్డనతోనే ఈ లోటు నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. డీజిల్ ధరల పెరుగుదల వల్ల వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు బస్సు చార్జీలను 10 నుంచి 12 శాతం పెంచాలని కూడా సూత్రప్రాయంగా ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది.

దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆర్‌టీసీ ఉన్నతాధికారి ఒకరు గురువారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఆర్డినరీ బస్సులకు తక్కువ స్థాయిలో, ఆ తరువాత స్థాయి బస్సులకు ఎక్కువ మొత్తంలో చార్జీలు పెంచేందుకు గురువారం రాత్రి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. దూరప్రాంత బస్సు ప్రయాణికులపై 10 నుంచి 12 శాతం భారం మోపే అవకాశం ఉంది. ఇప్పటికే బస్సులతో పోలిస్తే రైళ్లలో చార్జీలు తక్కువ కావటంతో ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ చార్జీలు పెంచటం తప్ప మరో మార్గం లేదని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెపుతున్నారు. 

చార్జీల పెంపు అనివార్యం: ఎన్‌ఎంయూ
ఆర్టీసీని ఆదుకోవాలంటే చార్జీలు పెంచటం అనివార్యం. ప్రజా రవాణా సంస్థను రక్షించాలంటే ఇంధనంపై విధించే అమ్మకం పన్ను మినహాయిస్తే తప్ప సాధ్యం కాదు. ఆర్టీసీ రూ.4 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.అదనపు భారాన్ని భరించే స్థితిలో లేనందున బస్సు టికెట్ల ధరలు పెంచక తప్పదు.
-నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు 

లారీలపై రోజుకు రూ. 25 కోట్ల భారం
డీజిల్ ధరల పెంపు ఆర్‌టీసీకి పరిమితం కాలేదు. ఆటోలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలపై ఈ భారం తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90 లక్షల వాహనాల్లో దాదాపు 20 లక్షల పైచిలుకు డీజిల్ వినియోగిస్తున్న వాహనాలే ఉన్నాయి. డీజిల్ రేట్లు పెంచడంతో వీటి యజమానుల జేబుకు చిల్లుపడనుంది. రాష్ట్రంలో నాలుగు లక్షల లారీలు తిరుగుతున్నాయి. ఇవి రోజుకు ఐదు కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నాయి. డీజిల్ ధర పెంపుతో వీటిపై రోజుకు రూ. 25 కోట్లు భారం పడుతుందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు పేర్కొన్నారు. డీజిల్ ధరల పెంపును వారం రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. డీజిల్‌పై లీటరుకు రూ. 5 పెంచటం దారుణమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నుల్ని తగ్గించుకోకుండా, ఆ భారం తమపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

తేడా లేకుండా చేస్తారేమో!
పెట్రోల్ రేటు రూ. 70 దాటడంతో రవాణా భారం తగ్గించుకోవడానికి 10 నెలల కిందట పెట్రోల్ కారు అమ్మేసి ధర ఎక్కువైనా డీజిల్ కారు కొన్నాను. ఇప్పుడేమో డీజిల్ రూ.50 దాటింది. మరోవైపు పెట్రోల్ రేటు తగ్గింది. అసలు కారెందు కు మార్చానా? అని చింతించాల్సిన పరిస్థితి. నెలకు సగటున 50 లీటర్ల డీజిల్ వినియోగిస్తాను. అంటే నా ఒక్కడిపైనే నెలకు 300 రూపాయలు అద నంగా భారం పడుతుంది.

డీజిల్ ధర పెంపు వల్ల పరోక్షం గా (నిత్యావసరాలు, పాలు, కూరగాయ లు... ఇతరత్రా పెంపు) నా కుటుంబంపై కనీసపక్షం 500 రూపాయలు అదనపు భారం ఉండొచ్చని నా అంచనా. అంటే నా జేబుకు నెలకు అదనంగా 800 రూపాయల చిల్లు అన్నమాట. ఒకవైపు నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతున్న నేపథ్యంలో... డీజిల్ ధర ఏకంగా ఆరు రూపాయల దాకా పెరగడం సామాన్యుడికి మోయలేని భారమే అవుతుంది. - కృష్ణా రెడ్డి, ఉద్యోగి, హైదరాబాద్

శాశ్వత పరిష్కారాలు ఆలోచించడం లేదు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయని ఒకసారి, అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పడిపోయిందని మరోసారి కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ పోతోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను మాత్రం ఆలోచించడం లేదు. డీజిల్ ధరల పెంపు, సిలెండర్లపై పరిమితి విధించడం సరికాదు. 
-జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి 

వెంటనే ఉపసంహరించుకోవాలి
ఈ ధరల పెంపు మరీ ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా డీజిల్ ధరను ఏకంగా లీటరుకు ఐదు రూపాయల మేర పెంచడం సరికాదు. ఈ పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతున్నాను.
- కరుణానిధి, డీఎంకే అధినేత

ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం..
ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం. దీనికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతాం. సామాన్యులపై, రైతులపై భారాన్ని మోపే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
-కమల్ ఫరూకీ, రాజేంద్ర చౌదరి, సమాజ్‌వాదీ పార్టీ నేతలు

వెంటనే ఉపసంహరించుకోవాలి
డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లపై పరిమితిని ఎత్తివేయాలి.
- నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి

వేధించుకు తినడమే సర్కారు పనా?
ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వేధించుకు తింటున్నాయి. లీటరు పెట్రోల్‌పై రూ.7 పెంచి మూడు నెలలు గడవక ముందే ఇప్పుడు డీజిల్‌పై ఏకంగా రూ.5 పెంచి ప్రజలపై పెనుభారం మోపారు. నెలకోసారి ఏదో ఒక ఉత్పత్తి ధర పెంచడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. పెంచిన డీజిల్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మా పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నాం. 
- సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!