YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 13 September 2012

ముఖ్యమంత్రికి విజయమ్మ లేఖ

* విద్యుత్ కోతలతో ప్రమాదపుటంచున ఉన్నాయి
* లక్ష పరిశ్రమలు మూసివేతకు దగ్గరపడుతున్నాయి
* పది లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు
* ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది
*ఈ పరిశ్రమల రుణాలను రీషెడ్యూలు చేయాలి
* కరెంటును పునరుద్ధరించే వరకూ రుణాలపై వడ్డీ రద్దు చేయాలి
* సమస్యలపై కేంద్రం వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి
* డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, సీవీడీలను రద్దు చేయాలని కోరాలి
* అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ పరిశ్రమల పరిస్థితిపై చర్చించాలి
* సీఎంకు రాసిన లేఖలో విజయమ్మ విజ్ఞప్తులు, సూచనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ కోతల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోకుండా నివారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ రంగాన్ని ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలని, వడ్డీని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుతూ విజయమ్మ గురువారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది...

‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి,
విద్యుత్ సంక్షోభం వల్ల రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే సుమారు 20 లక్షల మంది కార్మికుల అనూహ్యమైన దయనీయ స్థితిని మీ దృష్టికి తీసుకువచ్చేందుకు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ లేఖ రాస్తున్నాను. ఈ పరిశ్రమల్లో లక్ష యూనిట్లు తక్షణం మూతపడే ప్రమాదంలో ఉన్నాయి. అదే జరిగితే వాటిలోని పది లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే దుస్థితి నెలకొంది.

ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. తమ సమస్యలను ప్రభుత్వం, మీడియా దృష్టికి తీసుకువెళ్లే వనరులు కానీ శక్తి కానీ ఈ చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి లేదు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో, ఆదాయ ఉత్పత్తిలో ఎంతో కీలక పాత్ర పోషించే ఈ పరిశ్రమల గోడును వినిపించుకోవాల్సిన బాధ్యత.. ప్రజా ప్రతినిధులుగా మనపైన ఉంది. విద్యుత్‌ను సరఫరా చేయటంలో ప్రభుత్వ ైవె ఫల్యం కారణంగా ఇలాంటి పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి రావటం విషాదకరం. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి గత రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. గత నాలుగేళ్లుగా దేశీయ బొగ్గు ఉత్పత్తికీ డిమాండ్‌కూ మధ్య వ్యత్యాసం పెరుగుతోందనే విషయం కూడా తెలుసు. జల విద్యుత్ ఉత్పాదనకు తీవ్ర విఘాతం కలించే విధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితిని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి ఉండాల్సింది. ఈమూడింటిని దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఉండాల్సింది.

ఒక ప్రభుత్వంగా పరిపాలన అంటే అర్థం అదే. ప్రభుత్వం అలాంటిదేమీ చేయకుండా రాష్ట్ర ప్రజలను వారి మానాన వారిని వదలి వేసింది. అధికారిక, అనధికారిక విద్యుత్ కోతల వల్ల క్రమంగా సంక్షోభంలో చిక్కుకుంటూ వచ్చిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఆదుకునేందుకు ప్రయత్నించకుండా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య, ప్రభుత్వ బ్యాంకులు ఈ రంగానికి రుణాలు ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపకపోవడం వల్ల ఇప్పటికే ఈ రంగం బాగా దెబ్బతిన్నది.

ఉపాధి కల్పించడానికి ఈ రంగం తక్కువ పెట్టుబడులే ఆశిస్తున్నప్పటికీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏ మాత్రం ప్రయోజనకారి కాదనే ఉద్దేశ్యంతో బ్యాంకులు భారీ పరిశ్రమల వైపే మొగ్గు చూపుతున్నాయి. పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి నానా రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, బడా పారిశ్రామిక వేత్తల విషయంలో బ్యాంకులు, ప్రభుత్వాలు కలిసి రుణాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చర్యలు తీసుకోవడంతో పాటుగా రుణాల మాఫీ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అదే విధమైన చర్యలను చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో మాత్రం తీసుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఈ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇలాంటి ఆలోచనలు చేయడం లేదు.

ఈ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగంలో తలెత్తబోయే తీవ్ర ఇబ్బందులను నివారించడానికిగాను వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఈ అంశాలన్నింటిని రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ సరఫరాలో కోతల వల్ల ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఈ కింది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి రెండింట్లోనూ తీర్మానాలు చేయాలని సూచిస్తున్నాను.

ఎ) ఈ రంగంలోని పరిశ్రమలకు ఈ రోజు వరకూ ఇచ్చిన అన్ని రకాల రుణాలను కనీసం రెండు త్రైమాసికాల వరకూ వాయిదా వేస్తూ రీషెడ్యూలింగ్ చేయాలి. ఇలా వాయిదా వేసిన రుణాలకు కనీసం ఏడాది వరకూ వడ్డీ వసూలు చేయరాదు. బి) విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో సరఫరా చేసే వరకూ ఇప్పటికే ఉన్న బకాయీలపై వడ్డీ రద్దు చేయాలి. ఈ పరిశ్రమలు ఉత్పాదన కోసం వినియోగించే డీజిల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ, సీవీడీని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తరఫున విజ్ఞప్తి చేయాలి.

వీరి సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చ ర్చించి పరిష్కరించడానికి ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకు వెళ్లాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ రంగానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నాను. విద్యుత్‌పై మినిమమ్ డిమాండ్ చార్జీలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రంగంలో ఆయా పరిశ్రమలు సొంతంగా విద్యుత్ ఉత్పాదన కోసం వాడే డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను మినహాయించాలని కూడా కోరుతున్నాను’’.
ఇట్లు
వైఎస్ విజయమ్మ

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!