‘ఆత్మానుభవం అయితే గానీ తత్వం బోధపడ’దన్నాడు మహానుభావుడు! ధర్మాన ప్రసాదరావు మాటలు వింటుంటే, ఆయనకు సదరు ఆత్మానుభవం గట్టిగానే అయినట్టుంది. దాంతో, తత్వబోధ కూడా ఓ రేంజిలో జరిగినట్లు అనిపిస్తోంది! బుధవారంనాడు -సెప్టెంబర్ పదకొండో తేదీన- శ్రీకాకుళంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇంకా మంత్రిగానే ఉన్న ధర్మాన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా చెప్పుకునే సీబీఐకి నిర్దేశకత్వం వహించేవాళ్లు కూడా మనుషులేననీ, కొందరు వ్యక్తులేననీ ధర్మాన పబ్లిగ్గా వ్యాఖ్యానించడం విశేషమే. తనదాకా వచ్చేసరికి ధర్మాన ప్రసాదరావుకు తత్వం బోధపడినట్లుంది!
నిన్న మొన్నటిదాకా ఇదే ధర్మాన ‘ఐడియాలజీ’, ‘క్రమశిక్షణగల సైనికుడు’, ‘అధిష్టానమ్మ తీర్పుకు కట్టుబడి ఉండడం’ లాంటి ధర్మపన్నాలు వల్లించిన సంగతి అందరికీ తెలిసిందే. తన వల్ల ఎవరూ నష్టపోకూడదనే తాను రాజీనామా సమర్పిస్తున్నట్లు కూడా అమాత్యులు గంభీరంగా ప్రకటించారు. ఇప్పుడేమయిందో ఏమో- సీబీఐ పరిమితులు గుర్తుకొచ్చేశాయి ధర్మానకు. అంతేకాదు- తనపై సీబీఐ చార్జిషీట్ గురించి మాట్లాడుతూ, ఆ సంస్థను -వెనక నుంచో ముందునుంచో- నడిపే వ్యక్తుల ఆదేశాలమేరకే తనపై అభియోగాలు మోపారని ధర్మాన అక్కసు వెళ్లగక్కారు. భూముల కేటాయింపు మొత్తం మంత్రివర్గం చేసిన నిర్ణయమనీ, దానికి -అప్పట్లో రెవిన్యూ మంత్రిగా ఉన్న- తనను ఒక్కణ్ణే బాధ్యుణ్ణి చెయ్యకూడదనీ నిక్కచ్చిగా చెప్పేశారు.
ఏదో ఆత్మరక్షణ వ్యవహారంలో భాగంగా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అనుకునేలా లేదు ధర్మాన మాటతీరు. వ్యాన్‌పిక్ భూముల వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటో తేల్చిచెప్పాలని మంత్రిగారు సీబీఐని డిమాండ్ చేశారు. ఈ మాటలు వింటుంటే, తనను వాన్‌పిక్ భూముల కేసులో ఇరికించాలని చూస్తే తాను చూస్తూ ఊరుకోననే హెచ్చరిక చేస్తున్నట్లు లేదూ? పెద్దమనిషి తరహాగా మాట్లాడుతూనే బ్లాక్ మెయిల్ చెయ్యడంలో ధర్మాన, కిరణ్ కుమార్ రెడ్డికి తీసిపోడని తేలిపోయింది. మహానటులైన ఇద్దరు రాజకీయులు రంగమెక్కితే ఆట రంజుగా ఉండదూ మరి?
అసలు విషయమేమిటంటే, ఇప్పుడు ధర్మాన నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకునే విషయాల గురించి గతంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అసలు మంత్రివర్గం చేసిన 26 జీవోల గురించిన కేసుతో తనకు ఎలాంటి సంబంధమూలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిననాడు ధర్మాన ఏమయిపోయారు? అలాగే, మంత్రివర్గం చేసిన నిర్ణయాలకు క్యాబినెట్ సభ్యులందరూ బాధ్యత వహించాలనీ, చార్జిషీట్ తమ పైన కాకుండా వారిపైన పెట్టాలనీ జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేసిన వాదన ధర్మాన చెవికెక్కలేదేం? ఇప్పుడు తనకిందకే నీళ్లొచ్చేసరికి ‘సాంకేతిక వివరాలు’ సీరియల్‌గా గుర్తుకొచ్చాయా మంత్రివర్యులకి? సాటి మంత్రి మోపిదేవి వెంకట రమణను విచారణకని పిలిపించుకుని మూసిపారేసిన నాడు ధర్మాన మౌనం పాటించడంలో ఆంతర్యం ఏమిటి? ఆనాడు మోపిదేవికి జరిగిందే ఇప్పుడు ధర్మానకూ జరుగుతోంది. ఇదే, రేపు మరికొందరు మంత్రులకూ జరగక తప్పదు!
వ్యాన్‌పిక్ భూముల కేటాయింపులో రెవిన్యూ మంత్రికే ఏ అధికారమూ ఉండదంటున్నారు ధర్మాన. మంత్రికే లేని అధికారం, అసలు పాలన వ్యవహారాలతో ఏ సంబంధంలేని ఒక పారిశ్రామికవేత్తకు ఎలా సంక్రమిస్తుంది? ఈ మాత్రం అవగాహన ధర్మానకు ఇంతకు ముందు ఎందుకు కలగలేదు? ఇంతవరకూ సీబీఐ సాగిస్తూ వచ్చిన ‘విచారణ తంతు’ మొత్తం కొందరు వ్యక్తుల నిర్దిష్ట నిర్దేశకత్వం ఆధారంగానే జరిగిందని జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శ ధర్మాన దృష్టికి రానేలేదా? వచ్చివుంటే, ఇంతకాలం ఆయన ఎందుకు మౌనం వహించినట్లు? ఇతరులకు అన్యాయం జరుగుతున్నప్పుడు లౌక్యంగా మౌనం పాటించిన వాళ్లకు ఏదోరోజున సొంతకొంప కూలడం ఖాయం!
ఇప్పటికీ, మూకీ నాటకం ఆడుతున్న అయిదుగురు మంత్రులూ -ఆ మాటకొస్తే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సభ్యులందరూ- ఈ దశలోనయినా కళ్లుతెరవడం మంచిది. నిద్రనటిస్తూ పడుకునిఉంటే, తమ కొంపే ములుగుతుందని -ధర్మాన ఉదంతం వివరాలు గమనించినవాళ్లు- గ్రహించడం మంచిది. సీబీఐ చార్జిషీట్‌లో ఎన్నో స్థానంలో ఉన్నప్పటికీ, మంత్రులందరికీ ముప్పు నెత్తిమీద కత్తిలా, మిత్తిలా వేలాడుతూనే ఉంటుంది. ఏ సంబంధంలేని పారిశ్రామిక వేత్తలకూ, ఆడిటర్లకూ -కాస్త ముందో వెనకో- న్యాయం జరక్కుండా ఆపేశక్తి ఏ వ్యక్తికీ లేదు. ఈ దేశంలో ఇప్పటికీ చట్టపాలన ఏదో రూపంలో అమలు జరుగుతోంది. ఎటొచ్చీ తొందర పడాల్సింది ధర్మాన, ఆయన అనుచరులూ మాత్రమే. ఈ విషయం వాళ్లు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.
No comments:
Post a Comment