YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 10 September 2012

పాపం చిరంజీవి!


తెలుగు చలనచిత్ర జగత్తులో ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవి సమయంకాని సమయంలో రాజకీయాలలో అడుగుపెట్టి ఊహించని సంఘటనలు, ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. సామాజిక న్యాయం నినాదంతో ప్రభంజనం సృష్టించాలని భావించారు. ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారు. ఎన్నో కలలు కన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆయన ఇచ్చిన హామీలకు అభిమానులు, బీసీ వర్గాల వారు, ఆయన సామాజిక వర్గం వారు పొంగిపోయారు. సినీహీరోగా ఎన్నో హిట్లు కొట్టిన చిరంజీవి రాజకీయంగా అట్టర్ ఫ్లాప్ ను చవిచూడవలసి వచ్చింది. ఆయన రాజకీయ ప్రవేశం కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన జనానికి నిరాశే మిగిలింది. ఆయన హీరోలా రాజకీయాలలో నిలవలేకపోయారు. ఒక హీరోలా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. మెగాస్టార్ లా ప్రజాభిమానాన్ని కొల్లగొట్టలేకపోయారు. తమిళనాడులో ఎమ్జీఆర్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ లను చూసి రాజకీయాలలోకి వచ్చిన ఉత్తరాది, దక్షిణాది సినీహీరోలు పలువురు కోలుకోలేని దెబ్బలు తిన్నారు. సునాయాసంగా ముఖ్యమంత్రి కావాలని రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు తన సొంత జిల్లా పాలకొల్లులో కూడా నెగ్గలేకపోయారు. రాజకీయాలలో విజయం సాధించడం దర్శకుడు, రచయిత మలిచిన పాత్రలతో సినిమాలలో హీరోగా ఎదిగిపోయినంత తేలిక కాదని అర్ధమైపోయింది. పరిస్థితులను తట్టుకొని, సమర్థవంతంగా వ్యవహరించి ప్రజానేతగా ఎదగడం కష్టమని తేలిపోయింది.

రాజకీయాలపై స్పష్టతలేదన్న విమర్శలు ఎదుర్కొన్న చిరంజీవి ప్రతిపక్షం పాత్రని కూడా సమర్థతంగా పోషించలేకపోయారు. ఈ పరిస్థితులలో పార్టీ బరువుని దింపుకోవడానికి, పదవులు పొందడానికి తేలిక మార్గం ఎన్నుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ముచ్చటగా మూడేళ్లు కూడా పూర్తీ కాకుండానే, ఏ పార్టీ(కాంగ్రెస్)కీ వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేశారో ఆదే పార్టీలో విలీనం చేశారు. అంతే కాకుండా రైతు వ్యతిరేక విధానాలతో కూలిపోవడానికి సిద్దంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు పార్టీని విలీనం చేశారు. దాంతో ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీకి ఓటు వేసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనలో పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు లోపించాయని బాధపడ్డారు. ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న హీరో రాజకీయంగా ఇలా ప్రవర్తించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అతి తక్కువ కాలంలో పార్టీ జెండాని తిప్పేయడాన్ని వారు తట్టుకోలేకపోయారు. అభిమానులకు కూడా తమ హీరో ఆలోచనా తీరు అర్ధమైంది.

రాష్ట్ర ప్రయోజనాల కోసం, సామాజిక న్యాయసాధన కోసం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. అయితే ప్రజలు చిరంజీవి మాటలను, చేతలను అర్ధం చేసుకోలేని అమాయకులు కారు. ఆ విషయం తిరుపతి ఉప ఎకన్నికలలో తమ ఓటు ద్వారా నిరూపించారు. తొలుత సొంత జిల్లాలోనే ఓడిపోయిన ఆయన రాజీనామా చేసిన తిరుపతిలో కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. విచిత్రం ఏమిటంటే, గతంలో చిరంజీవి తిరుపతిలో 15 వేల మెజార్టీతో గెలిస్తే, అదే స్థానం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి 17 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసినా ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి ప్రయోజనం కలగకపోగా, పెద్ద నష్టం జరిగినట్లు తేలిపోయింది. కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని చిరంజీవి సినీ గ్లామర్‌తో గట్టెక్కించుకోవాలనుకున్న ఢిల్లీ పెద్దల ఆశలు అడియాశలయ్యాయి. చిరంజీవిని అందలమెక్కించి రాజ్యసభకు పంపినా, కించిత్తు ఉపయోగం లేదని వారికి అర్ధమైంది. చిరంజీవి సత్తా ఏమిటో తేలిపోంది.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఫలితంగా చిరంజీవి సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది (సామాజిక న్యాయం). ఉప ఎన్నికలలో ఓటమితో ఒప్పందం ప్రకారం దక్కవలసిన కేంద్ర మంత్రి పదవి చిరంజీవికి దక్కలేదు. ఊహించిన విధంగా కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన, ఆయన అభిమానులు తీవ్ర అంసంతృప్తికి లోనయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎప్పుడు ఏ పదవి దక్కుతుందో చెప్పలేం. ఊహించని వ్యక్తులు ఎంపిలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతుంటారు. అధిష్టానం తలచుకుంటే ఏమైనా చేయగలదు. ఆ ఆశతోనే చిరంజీవి ఇంతకాలం ఎదురు చూశారు. ఫలితంలేదు. ముఖ్యమంత్రి కావాలన్న చిరంజీవి ఆశలు అడియాశలయ్యాయి. ప్రజలు తనని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని ఇటీవలన తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే పార్టీలో చిరంజీవికి ప్రాధాన్యత బాగా తగ్గినట్లుగా అనిపిస్తోంది. దాంతో రాజకీయ భవిష్యత్ పై ఆయనకు ఆందోళన మొదలైంది. ఆయన మాటతీరులో మార్పు వచ్చింది.

రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ జూబ్లీహాల్‌లో ‘సేవ్ ది పార్టీ’ పేరిట నిర్వహించిన సదస్సులో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసి తన అసంతృప్తిని, ఆందోళనను బహిరంగంగా వ్యక్తపరిచారు. ‘‘కాంగ్రెస్‌కు కష్టకాలమొచ్చింది. పార్టీ బీటలు వారుతోంది. ప్రతి ఒక్కరిలో స్తబ్దత, నైరాశ్యం నెలకొన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అభద్రతా భావంతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది’ అని చిరంజీవి అన్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందుతూ అవతలి పార్టీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. ‘‘తినేది ఇక్కడ. పాడేది అక్కడా? ఇదేం న్యాయం, ధర్మం? ఇవేం ఎథిక్స్’’అని కూడా ఆయన ప్రశ్నించారు.

చిరంజీవి వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఆయన మధనపడుతున్నట్లు భావించాలా? కాంగ్రెస్‌లో తన రాజకీయ జీవితం సినిమాలా సాగిపోతుందని భావిస్తే, ఇప్పుడు మునిగిపోయే పడవలో ఎక్కానని ఆందోళన చెందుతున్నారా? తన రాజకీయ భవిష్యత్ పై చిరంజీవిలో ఆందోళన, కలవరం మొదలయ్యాయా? రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు దూరమయ్యానని బాధపడుతున్నారా? ఇటీవల ఆయన కాంగ్రెస్‌ నేతలను పరోక్షంగా విమర్శిస్తున్నారు. అయితే కాంగ్రెస్ రాజకీయాలను వంటబట్టించుకున్న చిరంజీవి రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలా విమర్శిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!