YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 12 September 2012

20 లక్షల మంది కార్మికులపై విద్యుత్ కోతల ప్రభావం


* నెలకు రూ.650 కోట్ల వేతనాలు కోల్పోతున్న వైనం
* నెలలో సగం రోజులే నడుస్తున్న పరిశ్రమలు
* సగం వేతనం.. అర్ధాకలితో కార్మికులు
* ఏడాది కాలంగా కొనసాగుతున్న కోతలు
* కోలుకోలేని విధంగా దెబ్బతింటున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు
* రోజుకు ఏకంగా రూ. 150 కోట్ల నష్టం

హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశ చరిత్రలోనే ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏడాది కాలంగా కొనసాగుతున్న విద్యుత్ కోతలు.. ప్రగతికి కీలకమైన పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు మూతపడుతుంటే మరికొన్ని పరిశ్రమలు ఏకంగా అమ్మకానికి సిద్ధమయ్యాయి. మరికొందరు ఈ ఇబ్బందులు తాళలేక అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.

మరీముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలపై ఆధారపడిన 20 లక్షల మందికి పైగా కార్మికుల ఆకలి మంటలకు విద్యుత్ కోతలు కారణమవుతున్నాయి. నెలలో (వీక్లీ ఆఫ్ పోను) కేవలం 12 రోజులకే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో కార్మికులకు నెలలో సుమారుగా సగం జీతమే అందుతోంది. దీంతో వారు కాలే కడుపులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. కోతల కారణంగా కార్మికులు నెలకు ఏకంగా రూ.650 కోట్ల మేరకు వేతనాలు కోల్పోతున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో అవగతమవుతుంది.

సకల జనుల సమ్మె సాకుతో గత ఏడాది సెప్టెంబర్ 15న మొదలైన కోతలు... ఏడాదైనా ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా పరిశ్రమలు నడవడం లేదు. రాష్ట్రంలో 1,88,685 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ యూనిట్లు) ఉన్నాయి. వీటి ద్వారా 20,36,517 మందికి ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్ల స్థాపనకు అయిన పెట్టుబడి మొత్తం రూ.33,811.22 కోట్లు. ఈ యూనిట్ల ఏడాది ఉత్పత్తి విలువ రూ.1.20 లక్షల కోట్లుగా ఉంటుందని పరిశ్రమల శాఖే తేల్చింది. కాగా ఒక్కో కార్మికుడికి సగటున నెలకు రూ.6,500 చొప్పున వేతనంగా లెక్కిస్తే.... నెలకు మొత్తం రూ.1,300 కోట్ల మేర వేతనాలను కార్మికులు అందుకుంటున్నారు. అయితే విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు నెలకు కేవలం 12 రోజులు మాత్రమే నడుస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు సుమారుగా సగం వేతనాన్ని మాత్రమే పరిశ్రమలు ఇస్తున్నాయి. అంటే రూ.650 కోట్ల వేతనాలను కార్మికులు కోల్పోతున్నారన్నమాట. కేవలం సగం వేతనానికే పనిచేయలేక... పని వదులుకోలేక కార్మికులు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. ఇది కేవలం ఎంఎస్‌ఎంఈలది మాత్రమే. ఇక రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మరో 10 లక్షల మంది కోల్పోతున్న సగం వేతనాన్ని (రూ.325 కోట్లు) కూడా కలుపుకుంటే... ఈ మొత్తం ఏకంగా రూ.975 కోట్లకు పెరుగుతుంది.

వలసల నుంచి వెనక్కి...
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రవుల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా పరిశ్రమలు సరిగ్గా నడవక, వేరే పని దొరక్క స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. కేవలం 15 రోజుల వేతనమే లభిస్తే భార్యాపిల్లల్ని ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. ‘ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వూ వాళ్లు వుళ్లీ ఉత్తరప్రదేశ్‌కే వెళ్లిపోయూరు. వూకు నెలకు గతంలో రూ.7,500 నుంచి రూ.8 వేలు వచ్చేది. ఇప్పుడు కరెంటు లేకపోవడంతో రూ.4 వేలు వస్తోంది. నెలకు రూ.4 వేలతో మహానగరంలో బతకడం ఎట్లా సాధ్యం?’ అని నాచారం పారిశ్రామికవాడలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వుహేందర్‌రాజ్ ‘న్యూస్‌లైన్’తో వాపోయూరు. దీనివల్ల పరిశ్రవులు కూడా సవుస్యలు ఎదుర్కొంటున్నారుు.

పరిశ్రమలకు రోజుకు రూ.150 కోట్ల నష్టం
రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు విద్యుత్ కోతల వల్ల తమకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాయి. ఫలితంగా రోజుకు రూ.150 కోట్ల మేరకు నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ చిన్నతరహా పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) అధ్యక్షుడు, పరిశ్రమల జేఏసీ అధికార ప్రతినిధి ఏపీకె రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వరుసగా 90 రోజులు రుణం చెల్లించకపోతే... ఆస్తులను వేలం వేస్తామని బ్యాంకర్లు అంటున్నారు. దొంగల తరహాలో మీ ఫోటోలను బ్యాంకులో అతికిస్తామని కూడా హెచ్చరిస్తున్నారని ఏపీకే రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ర్టంలో 11 వేల ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు.

ఆత్మహత్యల బాటలో పారి‘శ్రామికులు’
విద్యుత్ కోతల వల్ల ఒకవైపు కార్మికులు ఉపాధి కోల్పోతుంటే... మరోవైపు చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. పరిశ్రమలు నడిచేరోజుల్లోనైనా నిపుణులైన కార్మికులు లేకపోతే ఆర్డర్లు ఎలా పూర్తి చేయాలని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఆర్డర్లు సకాలంలో పూర్తి కాకపోవడంతో వచ్చినవన్నీ వెనక్కి వెళుతున్నాయి. ఫలితంగా రైతులు, చేనేత కార్మికుల తరహాలో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు.

జీడిమెట్ల పారిశ్రామికవాడలో ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్న నాగేశ్వరరావు (45) విద్యుత్ కోతల కారణంగా గత మే నెలలో ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్ కోతలతో ఆర్డర్లు కోల్పోయి... అప్పులకు భారీ వడ్డీలను చెల్లిస్తూ బతుకు వెళ్లదీయలేక ఈ దారుణానికి పాల్పడ్డారు. మౌలాలి పారిశ్రామికవాడలో గార్మెంట్ యూనిట్‌ను నెలకొల్పిన నందకుమార్ (35)ది కూడా ఇదే పరిస్థితి. గత జూలై 29 వతేదీన యువ పారిశ్రామికవేత్త అయిన నందకుమార్ ప్రాణాలను కూడా విద్యుత్ కోతలు బలితీసుకున్నాయి. ‘విద్యుత్ కోతలు మార్చి వరకు కొనసాగుతాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి వరకు విద్యుత్ కోతలు అమలైతే అనేకమంది చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితి ఏర్పడనుంది’ అని ఏపీకే రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పనిచేసిన కాడికే ఇస్తున్నారు
విద్యుత్ కోతల వల్ల సగం జీతమే వస్తున్నది. ఇంతకుముందు రూ.7 వేలు వచ్చేది. ఇప్పుడు పనిచేసినరోజు, పనిచేసిన సమయానికే జీతం ఇస్తున్నారు. దీంతో అటుఇటుగా మూడున్నరవేలు మాత్రమే చేతికొస్తోంది. రూ.2 వేలకు పైగా ఇంటి కిరాయికే పోతే..కరెంటు బిల్లులు, స్కూలు ఫీజులు, సరుకులు ఎలా.. ఇంకొక కంపెనీకి పోదామన్నా అంతటా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.

- శ్రీనివాసనాయుడు
(నాచారం పారిశ్రామికవాడలోని కార్మికుడు)


ఉద్యోగాలు పోతాయని భయమైతన్నది
బియ్యం, పప్పులు, నూనెల ధరలు పెరిగిపోతుంటే మాకేమో సగం జీతమే వస్తున్నది. సగం జీతం కూడా ఇవ్వడం కష్టమేనని యజమానులు అంటున్నరు. సగం జీతమైనా ఇవ్వడానికి కంపెనీ ఉంటదా? ఈ ఉద్యోగాలు కూడా పోతయేమోనని భయం అయితున్నది.
- వెంకటకుమార్ (పటాన్‌చెరు)

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!