YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 13 September 2012

కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళన

- కాంగ్రెస్‌కు లౌకిక ప్రత్యామ్నాయంగా చాటుకున్న ఎస్‌పీ 
- టీడీపీ వంటి పార్టీల మూడో ఫ్రంట్ ఆకాంక్షలకు ఎస్‌పీ గండి 
- రాహుల్ పాత్రపై నిర్ణయం తీసుకోలేని అధిష్టానం? 

న్యూఢిల్లీ సాక్షి ప్రతినిధి, డబ్ల్యూ. చంద్రకాంత్: సొంత మిత్రుల మనసుల్లో ఏముందో తెలుసుకోలేకపోవటం కారణంగా కాంగ్రెస్ అధిష్టానం తన భవిష్యత్తు కోసం ఎలాంటి ఎత్తుగడలూ వేయలేకపోతోంది. కుంభకోణాలు, విధాన పక్షవాతం (ప్రభుత్వం మిత్రులతో నడుస్తున్నంత వరకూ) రూపంలో రోజురోజుకూ పార్టీకి ఇబ్బందులు పెరిగిపోతుండటంతో.. ఏ కీలక అంశంపైనా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితిలో లేదు. 

తనకు ఒక లౌకిక ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తే.. అది రాహుల్‌గాంధీ ఆకాంక్షలను చావుదెబ్బ తీస్తుందని కూడా ఆందోళన చెందుతోందని చెప్తున్నారు. సరిగ్గా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ చేస్తున్నది ఇదే - లౌకిక ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుండటం. పైగా.. ఆయన ఈ రోజు తెలివిగా ఎన్నికలకు ముందు మూడో ప్రత్యామ్నాయానికి తనకు తానుగా దూరం జరిగారు. తద్వారా.. మెజారిటీ సాధించిన వాళ్లు, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరదలచుకోని వాళ్లు 2014 తర్వాత తనతో కలిసి రావచ్చని ఆయన సూచిస్తున్నారు. 

రాహుల్‌గాంధీని విశ్వసించాలా, ఆయనకు పెద్ద బాధ్యతను అప్పగించాలా అన్న దానిపై కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉన్నదన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, మార్పుచేర్పుల మాటలు వార్తల్లో వినిపిస్తుండగా.. ఈ దశలో ఏదైనా తనకు సహాయం చేస్తుందా అన్న విషయం అర్థం చేసుకునే పరిస్థితిలో అధిష్టానం లేదు. ఒకటి.. పార్టీని పునరుత్తేజం చేయటంలో రాహుల్‌గాంధీ వైఫల్యం దానిని చాలా ఇబ్బంది పెడుతోంది. రెండోది.. ఆర్థిక వ్యవస్థ, విదేశీ సంబంధాలు, కాశ్మీర్ అంశం, నక్సల్ సమస్య, తెలంగాణ డిమాండ్ తదితర దేశం ఎదుర్కొంటున్న ప్రధాన అంశాలపై రాహుల్‌గాంధీ మౌనం పార్టీకి ఎలాంటి మేలూ చేయటం లేదు. ఈ అంశాలన్నింటినీ ఒకచోటకు చేరిస్తే.. ప్రజలకు ప్రత్యేకించి యువకులకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా రాహుల్ ప్రతిష్ట ప్రతిరోజూ మసకబారుతోందన్న వాస్తవంపై కూడా పార్టీ ఆందోళన చెందుతోంది.

పైగా.. అతిపెద్ద బాధ్యత ప్రధానమంత్రి పదవిని కానీ పార్టీ పగ్గాలను కానీ ఆయన యువభుజాలపై మోపాలని పార్టీ భావించినా కూడా.. కుంభకోణాలతో తూట్లుపడిన యూపీఏ సుదీర్ఘ ఇన్నింగ్స్ భారంతో ఆయన కుంగిపోవచ్చన్న భయం కూడా ఉంది. 2014లో సంఖ్యలను రాబట్టటంలో ఆయన విఫలమైతే.. ఆయనతో పాటు కాంగ్రెస్ కెరీర్ కూడా చాలా కాలం పాటు అంతమవుతుంది. 

రెండో విషయం.. రాష్ట్రాల్లో బలమైన ప్రత్యామ్నాయాల ఆవిర్భావం కూడా ఆందోళనకు కారణం. యువముఖాలకు సంబంధించినంత వరకూ పలు ప్రత్యామ్నాయాలు గల ప్రాంతీయ పార్టీల ఎదుగుదల.. కాంగ్రెస్ పార్టీకి శుభవార్త కాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు.. కాంగ్రెస్ కాకుండా మరో లౌకిక ప్రత్యామ్నాయం ఆవిర్భవించటం.. ఎల్లప్పుడూ లౌకికవాదం పేరుతో తిరిగి అధికారంలోకి రావటానికి ఇలాంటి మతతత్వ వ్యతిరేక మనోభావాలపై ఆధారపడే కాంగ్రెస్‌కు ప్రాణాంతకం. 

ఆంధ్రప్రదేశ్ అనిశ్చిత పరిస్థితి పార్టీని వెంటాడుతుండగా.. ఫలితాలపై అన్ని రకాల జోస్యాలూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటం ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రకంపనలకు కారణమవుతోంది. దీనికి తెలంగాణ అంశంపై అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ తీసుకునే నిర్ణయం పరిణామాల భయాలు కూడా తోడయ్యాయి. 

దీనికితోడు ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ స్వరంలో తీవ్రత పెరుగుతోంది. 2014 ఎన్నికలకు తాను కీలక స్థానంలో ఉంటున్నానని ములా యం ఇప్పుడు చాలా స్పష్టంచేశారు. ఇప్పటినుంచే సానుకూల సంకేతం ఇవ్వటం భవిష్యత్తులో పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందన్న పూర్తి అవగాహనతోనే ఆయన ఇలా చేస్తున్నారని ఎస్‌పీ వర్గాలు చెప్తున్నాయి. 

ఆమేరకు.. తమలో ఒక దానిని పెద్ద సీటుకు పంపే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వటం ద్వారా.. బీఎస్‌పీయే కాకుండా, కాంగ్రెస్, బీజేపీల అవకాశాలకు గండి కొట్టటంపై ఆయన గురిపెట్టినట్లు కనిపిస్తోంది. రెండోది.. కాంగ్రెస్‌కు తన మద్దతు మతతత్వంతో ముప్పు ఉన్నంతవరకే ఉంటుందన్న వైఖరిలో మార్పు కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

ఎస్‌పీ వైఖరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రయోజనాలను త్వరలో దెబ్బతీయగలవని.. కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు తన పేరును గోప్యంగా ఉంచాలన్న షరతు మీద వ్యాఖ్యానించారు. కుంభకోణాలతో తూట్లుపడిన పాలనపై ములాయం దాడి చేయటానికి అర్థం.. తన మద్దతుకు రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను హెచ్చరించటమే. రెండోది.. ఆయన మమతా దీదీతో చర్చించిన తర్వాతే ఈ రోజు ఈ ప్రకటన చేశారు. 

భారీ క్రీడకు ఎస్‌పీ కొత్త నిబంధనలు పెడుతోందనే దానికి మరో సూచిక.. మూడో ఫ్రంట్ 2014 ఎన్నికల తర్వాతే ఏర్పాటవుతుంది కానీ, అంతకన్నా ముందు కాదని ఆయన ఉద్ఘాటించటం. ఇది.. రాబోయే ఎన్నికల్లో యూపీ నుంచి మెజారిటీ సీట్లు కూడగట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. వామపక్షాలకు సంబంధించినంత వరకూ తన అవకాశాలను తెరచివుంచుకోవాలని ఆయన భావిస్తున్నారని సూచిస్తోంది. 

టీడీపీ వంటి పార్టీల ప్రతిష్టను, ఇమేజ్‌ను పెంచటానికి వాటిని కూడగట్టుకోవటానికి ఆయనకు ఎలాంటి కారణమూ లేదని ఎస్‌పీ వర్గాలు సూచిస్తున్నాయి. తద్వారా.. తాను అంకెలను చూస్తాను కానీ గత రికార్డును కాదని చంద్రబాబునాయుడు వంటి నాయకులకు ఆయన తెలివిగా సందేశం పంపారు. తద్వారా ఎస్‌పీ యూపీ ప్రజల ప్రధాన చాయిస్‌గా తనను తాను ముందుపెట్టటంతో పాటు.. మరిన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం మరింత ఎక్కువగా ఆందోళన చెందుతోంది. తన మిత్రపక్షాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!