YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 14 September 2012

బెయిల్ రాకుండా కుట్ర

బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వారి బినామీ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది
కోర్టులు, న్యాయవాదులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తోంది
‘అవుట్‌లుక్’ కథనం అందులో భాగమే

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా బంధించడానికి శక్తిమేర కృషిచేసిన శక్తులే ఇప్పుడు ఆయనకు బెయిల్ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్, టీడీపీ నేతల బినామీ మీడియా సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురిస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులతో జగన్‌మోహన్‌రెడ్డిని బంధించి 110 రోజులవుతోంది. 90 రోజులు దాటాక కేసు నిరూపితం కాకపోతే ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎవరికైనా బెయిల్ లభిస్తుంది. అయితే జగన్ బయటకొస్తారని తెలిసి కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వణుకు పుడుతోంది. బయటకొస్తే ఆయన్ను ఏ విధంగా బద్నాం చేయాలనే దానిపై ప్రత్యేక కుట్రను రూపొందిస్తున్నారు. జగన్ బయటకొస్తే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని భావించిన ఆ రెండు పార్టీలు తమ చేతిలో ఉన్న సీబీఐని అడ్డం పెట్టుకొని ఎల్లో మీడియా చేత తమదైన శైలితో రాతలు రాయిస్తున్నాయి. 

అందుకే జగన్ బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కోర్టులను, న్యాయవాదులను ప్రభావితం చేసేలా కథనాలు వెలువరిస్తున్నాయి’’ అని మండిపడ్డారు. అందులో భాగంగానే ‘‘అవుట్‌లుక్’’ అనే పత్రిక చేత తలా తోకాలేని విధంగా మరో కథనాన్ని వండివార్చారని గట్టు దుయ్యబట్టారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రోజుకొక కుంభకోణం వెలుగుచూస్తుంటే అవుట్‌లుక్ మాత్రం.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని రాయడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. కేంద్రంలో రోజుకొక కుంభకోణం 2జీ, బొగ్గుస్కాం, కామన్‌వెల్త్ ఇలా అనేకం చోటుచేసుకుంటున్నా ఆ మీడియాకు కనబడదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబూ.. కుమ్మక్కైంది ఎవరు?

‘‘జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు విషయంలో హైకోర్టు ఆదేశాలే తడవుగా సీబీఐ ఎక్కడలేని అత్యుత్సాహం ప్రదర్శించింది. అదే చంద్రబాబుపై దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తే నెలరోజులైనా పట్టించుకోలేదు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అటువైపు కన్నెత్తి చూడలేదు. చంద్రబాబు, ఆయన బినామీలు సుప్రీంకోర్టుకు వెళ్లి రకరకాల నాటకాలతో కేసును నీరుగార్చేదాకా ప్రేక్షకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు అవడం వల్లే ఇదంతా జరిగింది’’ అని గట్టు తూర్పారబట్టారు. జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో వాదిస్తున్న లాయర్లను కేంద్రం మార్చిందని, దీంట్లో ఆయన హస్తముందంటూ టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా మరో కొత్తవాదనను తెరపైకి తెస్తోందన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!