YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 14 September 2012

జగన్‌ను ఎందుకు అరెస్టు చేశారు?

*జగన్ బెయిల్‌పై విచారణ 28కి వాయిదా
*సీబీఐ దర్యాప్తు తీరును పలుమార్లు ప్రశ్నించిన ధర్మాసనం
*సూరీడుకు కోర్టు సమన్లను తమ ముందుంచాలని ఆదేశం
*స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సాక్ష్యం కోసం సమన్లివ్వడమేమిటి?
*జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణియం వాదన
*జగన్ బయటకు రాకుండా చేసేందుకే కల్పిత సాకులని వెల్లడి
*మరిన్ని చార్జిషీట్లు వేస్తామన్న సీబీఐ తరఫు న్యాయవాది
*విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పైనా 28నే విచారణ

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 28కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న సూర్యనారాయణరెడ్డి (సూరీడు)కు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన ఉత్తర్వును, అందుకు సంబంధించి సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును తన ముందుంచాల్సిందిగా దర్యాప్తు సంస్థను ఆదేశించింది. వాటిని పరిశీలించాకే పూర్తిస్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో సీబీఐ వ్యవహార శైలిని ధర్మాసనం పలుమార్లు నిలదీసింది. ‘‘మొత్తం కేసుకు సంబంధించి గతంలో మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు.

సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న అభియోగమేదీ కూడా అప్పట్లో పిటిషనర్‌పై మోపలేదు. విచారణ నిమిత్తం మీరు నోటీసులిచ్చి రమ్మంటే ఆయన (జగన్) వచ్చారు. మూడు రోజుల పాటు మీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. మర్నాడు కోర్టులో హాజరు కావాల్సి ఉన్న పరిస్థితుల్లో ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?’’ అని సీబీఐని ప్రశ్నించింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ పెట్టుకున్న అనుబంధ పిటిషన్‌పై విచారణను కూడా ధర్మాసనం 28వ తేదీకే వాయిదా వేసింది.

సాక్షులను ప్రభావితం చేయలేదని సీబీఐకి కూడా తెలుసు

హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, దానిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు సీబీఐ కౌంటర్ వేయడంతో కేసును న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. జగన్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ జైన్ వాదనలు వినిపించారు. మొదట సుబ్రమణియం వాదిస్తూ కేసులో సీబీఐ అనుసరించిన తీరును ఎండగట్టారు. ‘‘హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన నాటి నుంచీ దర్యాప్తు సంస్థకు జగన్ పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. ఏనాడూ సాక్షులను ప్రభావితం చేయడం గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ చేయలేదు. ఈ విషయం సీబీఐకి కూడా స్పష్టంగా తెలుసు’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

సంఖ్యల్లో సున్నాలు జారిపోతున్నాయి..

జగన్ రూ.లక్ష కోట్లు ఆర్జించారని హైకోర్టులో దాఖలైన పిటిషన్లలో ఆరోపించారని, ఎఫ్‌ఐఆర్ దాఖలుకు వచ్చేసరికి సీబీఐ దాన్ని రూ.50వేల కోట్లకు తగ్గించిందని, ఇప్పుడేమో రూ.20 కోట్లకు వచ్చిందని సుబ్రమణియం వివరించారు. సీబీఐ దర్యాప్తు తీరును దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘జగన్‌పై చేసిన అక్రమార్జన ఆరోపణలకు సంబంధించిన సంఖ్యల నుంచి సున్నాలు జారిపోతున్నాయి. అవినీతి జరిగిందని సీబీఐ భావిస్తుంటే, అది ఎంతో కచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. కానీ ఏమాత్రం పొంతన లేకుండా సీబీఐ చూపుతున్న సంఖ్యలను చూస్తే వారు మొత్తం కేసును అభూతకల్పనలతో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. జగన్‌ను సీబీఐ గత మే 27న అరెస్టు చేసింది. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనను అందుకు ప్రధాన కారణంగా చూపారు. కానీ ఇలా పిటిషనర్ సాక్షులను ప్రభావితం చేశారని, బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పడం ఏమాత్రం సరికాదు. ఈ కేసులో సాక్షి వై.సూర్యనారాయణరెడ్డి (సూరీడు)కి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద తన ఎదుట హాజరై సాక్ష్యమివ్వాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఇలా ఎలా చేస్తారు? ఇదసలు ఎక్కడా లేనటువంటి విషయం.

సాక్ష్యమనేది స్వచ్ఛందంగా ఇచ్చేది. అంతే తప్ప సమన్లు జారీ చేసి బలవంతంగా ఇప్పించలేరు. ఈ ‘కొత్త చట్టం’ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశముంది. సూర్యనారాయణరెడ్డి నుంచి సీబీఐ అధికారులు అప్పటికే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద సాక్ష్యం తీసుకున్నారు. ఆ తర్వాత సెక్షన్ 164 కింద ఆయనకు సమన్లు పంపారు. ఇలా సాక్ష్యం చెప్పి తీరాలని ఒక వ్యక్తిని సెక్షన్ 164 కింద ఆదేశించే అధికారాన్ని కోర్టుకు ఎవరిచ్చారు? అలా ఆదేశించే చట్టమేదన్నా ఉందా? సాక్ష్యం చెప్పడం సూర్యనారాయణరెడ్డి హక్కు. అందుకాయన నిరాకరిస్తే, జగన్ ప్రభావితం చేశారని ఎలా చెబుతారు? అసలు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. సాక్ష్యం విషయంలో సెక్షన్ 164ను అసలు ఉపయోగించరాదు. కానీ అదే సెక్షన్ కింద సమన్లు ఇచ్చారు. ఇదంతా చూస్తే సీబీఐ ఈ కేసులో జగన్‌ను ఎలాగైనా ఇరికించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన వివరించారు.

దర్యాప్తు సా...గుతోందంటూ జైల్లో ఉంచుతున్నారు..

ఏ కేసులోనైనా ఒక వ్యక్తిని 90 రోజులకు మించి కస్టడీలో ఉంచడం చట్ట ప్రకారం కుదరదని సుబ్రమణియం గుర్తు చేశారు. ‘‘కానీ మే 28న కోర్టులో హాజరు కావాల్సిన వ్యక్తిని, తర్వాత రాజకీయ ప్రచారంలో పాలుపంచుకోవాల్సిన అవసరమున్న వ్యక్తిని ముందు రోజు రాత్రి అరెస్టు చేయడమే గాక.. ఇంకా చార్జిషీట్లు వేయాల్సి ఉందనే సాకుతో 90 రోజులు దాటినా కస్టడీలోనే కొనసాగిస్తున్నారు. జగన్ బెయిల్ కోరిన ప్రతిసారీ.. ‘దర్యాప్తు కొనసాగుతోంది, కీలక దశలో ఉంది’ అంటూ సీబీఐ అధికారులు చెబుతున్నారు.

ఈ కల్పిత సాకులన్నీ ఆయన్ను బయటకు రాకుండా చేసేందుకే! దర్యాప్తు, చార్జిషీట్ల పేరుతో జగన్‌ను కస్టడీలోనే కొనసాగించడం చట్టప్రకారం ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమే. బెయిల్ కోరే హక్కు పిటిషనర్‌కు చట్టప్రకారం ఉంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ 90 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్లలో ప్రస్తావించిన అంశాలనే అందులోనూ పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్ 173 (8) ప్రకారం అనుబంధ చార్జిషీట్ లేదా తదుపరి చార్జిషీట్ల దాఖలు కోసం నిందితుడిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. అరెస్టు చేసి 90 రోజులు దాటాక కూడా ఇంకా అనుబంధ చార్జిషీట్ల నెపంతో బెయిల్ ఇవ్వవద్దనడం ఏమాత్రమూ సరికాదు.

అత్యంత కీలకమైన ఉప ఎన్నికల సమయం లో తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న జగన్‌కు సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద సమన్లు జారీ చేశారు. తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించారు. వాటిని గౌరవిస్తూ ఆయన హాజరయ్యారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి, మరుసటి రోజు జగన్ కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉండగా మే 27 రాత్రి 7.15కు అరెస్ట్ చేశారు. దీన్ని రాత్రి వేళ చేసిన అరెస్టుగా మేజిస్ట్రేట్ కూడా అభివర్ణిం చారు’’ అని సుబ్రమణియం గుర్తు చేశారు. విచారణకు పిటిషనర్ పూర్తిగా సహకరిస్తున్న సమయంలో ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో దర్యాప్తు సంస్థ చెప్పి తీరాలన్నారు.

సంఖ్యలపై నిలదీసిన ధర్మాసనం

పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని మోహన్ జైన్ చెప్పారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయరాదని ధర్మాసనాన్ని కోరారు. ‘‘కేసులో ఇప్పటికే మూడు చార్జిషీట్లు వేశాం. మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తాం. దర్యాప్తు కీలక దశలో ఉంది. పిటిషనర్ భారీగా ఆస్తులను ఆర్జించారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన సంస్థల్లోకి నిధులొచ్చేలా చేశారు.

రాష్ట్రంలోని పలుచోట్ల వివిధ సంస్థలకు జరిపిన కేటాయింపులకు ప్రతిగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు’’ అంటూ జైన్ వాదిస్తుండగా ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘అలా జరిగి ఉండొచ్చుననేదేగా మీ వాదన’ అంటూ ప్రశ్నించింది. అవునని ఆయన బదులిచ్చారు. రూ.50 లక్షల ఆస్తి నుంచి రూ.40 వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా జగన్ ఎదిగారని అన్నారు. అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో దీన్నిబట్టి తెలుసుకోవచ్చన్నారు. దాంతో ధర్మాసనం మళ్లీ జోక్యం చేసుకుని.. ‘‘ఇది మీరు (సీబీఐ) ఊహిస్తున్న సంఖ్యా? ఈ సంఖ్యలను ఇప్పుడెందుకు ఉదహరిస్తున్నారు? సీబీఐ వాస్తవంగా లెక్కగట్టిన సంఖ్యేమిటో చెప్పండి. ఇప్పటిదాకా మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు కదా! వాటిలోని మొత్తాలెంత?’’ అంటూ ప్రశ్నించింది. దాంతో జైన్ అప్పటికప్పుడు చార్జిషీట్లలోని మొత్తాలను కూడారు.

‘రూ.1,595 కోట్లు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని బదులిచ్చారు. దాంతో ధర్మాసనం ఆయనను నిలువరిస్తూ.. ‘గతంలో మీరు మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు. సాక్షులను ప్రభావితం చేయడంపై అప్పుడు పిటిషనర్‌పై ఏ అభియోగమూ మోపలేదు. నోటీసులందుకున్నాక సీబీఐ ఎదుట ఆయన మూడు రోజులు హాజరయ్యారు. మర్నాడు కోర్టులో హాజరవ్వాల్సి ఉండగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది?’’ అంటూ నిలదీసింది. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని అరెస్టు చేసినట్టు జైన్ తెలిపారు. దాంతో, మరి సీఆర్పీసీ సెక్షన్ 164 విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది.

అనంతరం జైన్ తన వాదనను కొనసాగించారు. ‘పిటిషనర్ కంపెనీల్లోకి ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు బాగా వచ్చాయి. వాటిపై సాక్షులను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే ఆయన వారిని ప్రభావితం చేయజూశారు’’ అన్నారు. అందుకు సుబ్రమణియం అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ ఎవరినైనా ప్రభావితం చేయడానికి గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడానికి గానీ ప్రయత్నించారని సీబీఐ ఎక్కడా కూడా నిరూపించలేదని గుర్తు చేశారు. దానివి కేవలం నిరాధార ఆరోపణలు మాత్రమేనని తేల్చి చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘సాక్షులను ప్రభావితం చేసినట్టు, సాక్ష్యాలను తారుమారు చేసినట్టు రికార్డుల్లో ఉందా’ అని ప్రశ్నించగా ఉందని జైన్ బదులిచ్చారు. ‘‘164 సెక్షన్ కింద సీబీఐ మేజిస్ట్రేట్ జారీచేసిన సమన్ల ఉత్తర్వును మేం పరిశీలిస్తాం. ఆ సమన్ల జారీకోసం సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును కూడా పరిశీలించాలనుకుంటున్నాం. ఆ రెండింటినీ మా ముందుంచండి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాక తర్వాతి వాదనలు వింటాం’’ అని జైన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!