YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 11 September 2012

రసాయన ఎరువులతో ముప్పు

మితిమీరిన ఎరువులతో సాగు భూములు పనికిరాకుండా పోతున్నాయి
అంతర్జాతీయ హైబ్రిడ్ వరి సదస్సులో శాస్త్రవేత్తల ఆందోళన
పాడైన భూముల్లో సైతం మంచి దిగుబడి ఇచ్చే వరి వంగడాలు రావాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘రసాయన ఎరువులను మితిమీరి వినియోగించడంతో భూములు సాగుకు పనికిరాకుండా పోయాయి. క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చే వ్యవస్థ లేకపోవడంతో ఎక్కువ దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది..’’ అని అంతర్జాతీయ హైబ్రిడ్ వరి సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. సాగు భూముల్లో ఆమ్లత్వం, క్షారత్వం ప్రమాదకరస్థాయిలో పెరిగిందని, ఇలాంటి నేలల విస్తీర్ణం వరి సాగయ్యే భూమిలో ఐదు శాతంగా ఉందని పేర్కొంది. ఇది ఆహార భద్రతకు పెద్ద సవాలుగా మారుతోందని తెలిపింది. పాడైన భూములను సైతం తట్టుకునే హైబ్రిడ్ వరి వంగడాలను ఉత్పత్తి చేస్తేనే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ హైబ్రిడ్ వరి సదస్సు రెండోరోజైన మంగళవారం చైనా, పిలిప్పీన్స్, భారత్‌ల్లో హైబ్రిడ్ వరి ఉత్పత్తి, తాలు గింజలు లేని వరి, పాడైన-మెట్ట భూముల్లో వరి సాగు అంశాలపై చర్చించారు. 

అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మైఖెల్ జె.థామ్సన్, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సి.ఎన్.నీరజ, చైనా శాస్త్రవేత్త జెలిన్ టాన్, హూ జటిన్‌లు ప్రసంగించారు. అవసరం కంటే చాలా ఎక్కువగా రసాయన ఎరువుల వినియోగించడంతో వచ్చే ఇబ్బందులను రైతులకు వివరించడంలో శాస్త్రవేత్తలు విఫలమవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ఎరువుల వినియోగం తగ్గించేందుకు రైతులను ఒప్పిండంలోనూ విఫలమవుతున్నామని అంగీకరించారు. ఆమ్లత్వం, క్షారత్వం పెరిగిన భూముల్లో మేలైన వరి వంగాలను సాగు చేసినా ఏ మాత్రం ఫలితం ఉండడంలేదని... ప్రమాదకర స్థాయికి చేరిన భూముల్లో విత్తన ఖర్చులు సైతం రావడం లేదని పేర్కొన్నారు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రభావంతో వర్షాలు తగ్గుతున్న నేపథ్యంలో.. మెట్ట భూముల్లో సైతం దిగుబడిని ఇచ్చే వరి వంగడాలు విరివిగా రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. మంగళవారం భోజన విరామం తర్వాత శాస్త్రవేత్తలు పంటల పరిశీలనకు రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన కేంద్రం, ఖానాపూర్‌లోని బేయర్ క్రాప్ సెన్సైస్ బహుళజాతి సంస్థను సందర్శించారు.

ఆహార కొరత తీర్చాలి: లాంగ్‌పింగ్

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని చైనా హైబ్రిడ్ వరి పితామహుడు యాన్ లాంగ్‌పింగ్ అన్నారు. 180 మంది శాస్త్రవేత్తల బృందం మంగళవారం రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన కేంద్రాన్ని(డీఆర్‌ఆర్) సందర్శించారు. డీఆర్‌ఆర్‌లో జరుగుతున్న పరిశోధనలను ప్రాజెక్ట్ డెరైక్టరు బి.సి.వీరక్తమథ్ శాస్త్రవేత్తలకు వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!