YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 13 September 2012

మళ్లీ సామాన్యుడి నడ్డి విరిచిన యూపీఏ సర్కారు

* ఏడాదిలో ఆరు గ్యాస్ సిలిండర్లకే సబ్సిడీ
* భగ్గుమన్న డీజిల్.. లీటర్‌పై రూ. 5 పెంపు 
* మళ్లీ సామాన్యుడి నడ్డి విరిచిన యూపీఏ సర్కారు
* వంట గ్యాస్ సబ్సిడీలో భారీగా కోత
* 6 సిలిండర్లకు మించితే మార్కెట్ ధరకు కొనాల్సిందే
* అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన నిర్ణయాలు
* వచ్చే మార్చిలోపు సబ్సిడీపై ఇచ్చేది మూడు సిలిండర్లే
* పెట్రోలు, కిరోసిన్ జోలికి వెళ్లని ప్రభుత్వం
* హైదరాబాద్‌లో సిలిండర్ మార్కెట్ ధర రూ. 786
* ఇకపై దాన్ని కూడా నెలనెలా ‘సవరిస్తాం’: కేంద్రం
* ఉపసంహరణకు మిత్రపక్షాలు, విపక్షాల డిమాండ్ 

చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు చూసి నిత్యం బెంబేలెత్తుతున్న సగటు జీవులారా! మరోసారి గుండెలు చిక్కబట్టుకోండి. ఎందుకంటే వాటి ధరలకు మరింతగా రెక్కలు రానున్నాయి. మీ ఇంటి బడ్జెట్ భరించలేనంత భారంగా మారనుంది. రవాణా సహా మొత్తం ఆర్థిక వ్యవస్థకే ప్రాణవాయువు వంటి డీజిల్ ధర భగ్గున మండింది మరి! కరెంటు కోతలతో ఇప్పటికే కుదేలైన పరిశ్రమలు కూడా ఈ దెబ్బతో ఇక పూర్తిగా పడకేయాల్సిందే. ఇంతటితోనే అయిపోలేదు. గ్యాస్ బండను కూడా సామాన్యుడి పాలిట గుదిబండగా మారుస్తూ యూపీఏ సర్కారు చిలక్కొట్టుడు నైపుణ్యం ప్రదర్శించింది..

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: భయపడిందే జరిగింది. పెట్రోలు ధరపై నియంత్రణను ఇప్పటికే ఎత్తేసి సామాన్యుడికి చుక్కలు చూపిన యూపీఏ ప్రభుత్వం తాజాగా డీజిల్, వంట గ్యాస్‌లకూ మంట పెట్టింది. లీటర్ డీజిల్ ధరను ఏకంగా 5 రూపాయలు పెంచింది. సబ్సిడీపై ఇస్తున్న 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై పరిమితి విధించింది. ఇకపై అవి గరిష్టంగా ఏడాదికి ఆరు మాత్రమే లభిస్తాయని ప్రకటించింది. అంతకు మించితే మార్కెట్ ధర చెల్లించాల్సిందే. గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రెండు నిర్ణయాలూ గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యపై పరిమితి విధించడం ఇదే తొలిసారి. ఇకపై ఏడాదికి ఆరు సిలిండర్లకు మించి వాడే ఒక్కో అదనపు బండపైనా మార్కెట్ ధర ప్రకారం జేబుకు రూ.786 దాకా చిల్లు పడుతుందన్నమాట! పైగా వంట గ్యాస్ మార్కెట్ ధరను నెలవారీ ప్రాతిపదికన చమురు కంపెనీలు సవరిస్తాయని కేంద్రం పేర్కొంది. తద్వారా, అది కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటుందని చెప్పకనే చెప్పింది. 

ఆ ధరకు ఎన్ని కావలిస్తే అన్ని సిలిండర్లు కొనుక్కోవచ్చంటూ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది! అంతేకాదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే ఇప్పటినుంచి 2013 మార్చి దాకా గృహ వినియోగదారులకు గరిష్టంగా 3 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే లభిస్తాయని కూడా ప్రకటించింది! కాకపోతే సబ్సిడీ సిలిండర్ ధరను, పెట్రోలు, కిరోసిన్ ధరలను మాత్రం పెంచకపోవడం సామాన్యునికి, సగటు జీవికి కాస్తలో కాస్త ఊరట. విపక్షాలతో పాటు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలు కూడా దీనిపై భగ్గుమన్నాయి. యూపీఏ సర్కారుపై దుమ్మెత్తిపోశాయి. పెంపును ఉపంహరించాలని డిమాండ్ చేశాయి. డీజిల్ ధర చివరిసారిగా 2011 జూన్‌లో లీటరుకు 3 రూపాయలు పెరిగింది. 

పెట్రోలుపై సుంకం లీటరుకు రూ.5.30 తగ్గింపు
పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 5.30 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల చమురు కంపెనీలకు మాత్రమే లబ్ధి కలగనుంది. వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీపై కోత, డీజిల్ ధర పెంపు వల్ల వాటి లోటు మరో రూ.20,300 కోట్ల మేరకు పూడనుంది. అయినా డీజిల్‌పై రూ.1.03 లక్షల కోట్లు, గ్యాస్, కిరోసిన్‌లపై చెరో రూ.32,000 కోట్ల నష్టాలు తప్పవని కేంద్రం పేర్కొంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!