బొత్తిగా సృజనాత్మకత లేకుండా, ఇతరులు చేసిన పనులనే అనుకరించడాన్ని -ఎందుకో గానీ- ఇంగ్లిష్‌లో ‘ఏపింగ్’ అంటారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర గురించి తల్చుకోగానే ఈ మాటే గుర్తుకొస్తుంది. 2003 వేసవికాలంలో, ఆనాటి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఆయనకు చరిత్రలో శాశ్వతస్థానం కల్పించింది. 68 రోజులపాటు, మండే ఎండలను ఖాతరు చెయ్యకుండా, 1600 కిలో మీటర్ల దూరం నడిచిన వైఎస్‌ఆర్ అప్పటి ప్రజా సమస్యలను -ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న భయంకరమయిన పరిస్థితులను- అందరి దృష్టికీ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు దుష్పరిపాలనలో కనీసం ఓదార్పుకు కూడా నోచుకోని రైతన్నలు ఒకరి వెంట మరొకరుగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండిన చేటుకాలమది. వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు శతధా ప్రయత్నించిన వైఎస్‌ఆర్ గత్యంతరం లేక పాదయాత్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ పాదయాత్ర తన ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేసిందని ఆయన చాలాసార్లు చెప్పడం గమనార్హం. ఆ మార్పు ఫలితంగానే ఆయన ప్రజలకు అత్యంత సన్నిహితడయిన నేతగా ఎదగగలిగారు. అధికారం ఆయన్ను -తనంత తానుగా- వరించింది.
ఇవన్నీ మన రాజకీయాల గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారందరికీ తెలిసిన విషయాలే. అయితే, వాటిల్లోని ఆఖరి అంశం ఒక్కటే -పాదయాత్ర కారణంగా వైఎస్‌ఆర్‌ను అధికారం వరించిందన్న విషయం మాత్రమే- చంద్రబాబును ఆకర్షించింది. అంతే- తనకిప్పుడు అర్జెంటుగా అవసరమయిన అధికారం కోసం పాదయాత్ర చెయ్యాలని నడుంకట్టేశారు. గాంధీ జయంతి నాడు -అక్టోబర్ రెండున- మొదలుపెట్టి, రిపబ్లిక్ డే -జనవరి 26- నాటికి తన పాదయాత్ర ముగిస్తానని ఆయన అక్కడా ఇక్కడా చెప్పారు. అంటే, రెండు మూడు రోజులు తక్కువగా నాలుగునెలల పాటు పాదయాత్ర చేయాలన్నది బాబు యోచన. ఎంతయినా, చంద్రబాబు మంచి లౌక్యుడు. వైఎస్‌ఆర్ మాదిరిగా మండు వేసవిలో పెట్టుకోకుండా, కాస్త చల్లబాటు రోజులు చూసి మరీ ముహూర్తం పెట్టుకున్నాడు. అలాగే, ఏదో ముంచుకొచ్చినట్లు చకచకా పూర్తి చేసుకోకుండా నిదానంగా పాదయాత్ర సాగించాలనుకోవడం కూడా దివ్యంగా ఉంది.
ప్రస్తుతం పూర్వ పురుషుల స్వస్థలం నారావారిపల్లెలో పర్యటిస్తున్న నారా లోకేష్ బాబు మాత్రం తానింకా పిల్లకాకినేనని మరోసారి రుజువు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు పాదయాత్రకు ఇంకా ముహూర్తం పెట్టలేదనీ, 2014 ఎన్నికలు దగ్గిరకొచ్చాకా ఈ పాదయాత్ర ఉంటుందనీ అన్నట్లుగా జాతీయ పత్రికలకు వెల్లడించేశాడు. అంతేకాదు- ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని కూడా ఈ ‘సామాన్య కార్యకర్త’ చెప్పడం విశేషం. అలా చెప్పడంద్వారా, తన తండ్రి తలపెట్టిన పాదయాత్రకూ, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న కాంక్షకూ మధ్య ఉన్న లింకును బయటపెట్టేశాడు లోకేష్ బాబు! అయినా, అతను చెప్పకపోతే ఈ విషయం ఎవరికీ తెలిసివుండేదికాదని అనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే, ఈ రాష్ట్రంలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అన్నీ స్పష్టంగా తెలుసు.
తనను తాను హైటెక్కు సీయీవోగా చెప్పుకునే చంద్రబాబు, సొంతంగా ఆలోచించే తెలివితేటలు ప్రదర్శించిన సందర్భాలు తక్కువే. తొమ్మిదేళ్లకు తక్కువగా రాజ్యం చేసిన బాబు తన పాలనాకాలంలో నేలమట్టమయిపోయిన రైతాంగం కోసం ఉచిత విద్యుత్తులాంటి పథకం ఒక్కటయినా ప్రతిపాదించగలిగారా? అలా చెయ్యలేకపోగా, వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్తు పథకం ప్రవేశపెడితే, కరెంటు తీగెలు బట్టలారేసుకోడానికి తప్ప ఎందుకూ పనికిరావని వెటకారమాడాడు మన బాబూజీ! నిజానికి ఆ తీగెలకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో కాదు- చంద్రబాబు అండదండలతో రాజ్యమేలుతున్న కిరణ్ కుమార్ రెడ్డే. వైఎస్‌ఆర్ పాలనాకాలంలో ఉచిత విద్యుత్తు సౌకర్యం -బీదా గొప్పా- అందరికీ అందుబాటులోకి వచ్చింది. చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎంత దుమ్మెత్తి పోసినా జనం మర్చిపోలేని విషయాలివి.
తన ‘తొమ్మిదేళ్లకు తక్కువ’ పదవీ కాలంలో చంద్రబాబు ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకం ఒక్కటయినా రూపొందించగలిగాడా? పసిపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించడానికి సంబంధించి వైఎస్‌ఆర్ నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించారు. మరి బాబు అలాంటిది ఒక్కటయినా చేసి పుణ్యం కట్టుకున్నాడా? నిరుపేదల పిల్లలు కూడా వృత్తి విద్యా కోర్సులు చెయ్యాలన్న తలంపుతో, వైఎస్‌ఆర్ ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. మరి మన బాబో? అలాంటి సంక్షేమపథకాలు పౌరులను బిచ్చగాళ్లుగా మారుస్తాయని కారుకూతలు కూశాడు. పెపైచ్చు, ఇన్నాళ్ల తర్వాత ఆ పథకం అసలు తనదేనంటూ పట్టపగలే దొంగతనానికి తెగబడ్డాడు. ఒకసారి దొంగతనం చేసినవాడికి ఇక సిగ్గూ లజ్జాలాంటి మొగమాటాలు పోతాయట. అందుకే, ఇప్పుడు అధికారం అప్పనంగా కొట్టేయాలన్న యావతో ప్రజాప్రస్థానం లాంటి పాదయాత్ర చేసేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ప్రజలతోనూ, వాళ్ల సమస్యలతోనూ నిత్యం సంబంధాలు పెట్టుకునే నాయకుడు ఏ యాత్ర చేసినా జనం ఆదరిస్తారు. అడిగినా, అడక్కపోయినా అలాంటి నేతలకు అధికారం కట్టబెడతారు. అంతే కానీ, అధికారం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ఏ యాత్రలు చేసినా ఫలితం సున్న! చంద్రబాబు ఈ చిన్న విషయం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.
No comments:
Post a Comment